కొండపల్లి శేషగిరిరావు కోసం
ఆయన పుట్టినరోజు సందర్భంగా 2009
జనవరి 26 న ఆర్టిస్ట్ మోహన్ రాసిన
అరుదైన ప్రేమలేఖ
…………………………………
మాది ఏలూరు. నేను హైస్కూలు.. అలాంటి పీరియడ్‌లో మా వూరికి లలితా కళా అకాడమీ వారి ఎగ్జిబిషన్ వచ్చింది. అన్నిటికంటే పెద్ద పెయింటింగ్ కొండపల్లి శేషగిరిరావు గారిది. రెండు చేతులూ బార్లా చూపినా అందనంత వెడల్పుంది. అందులో చచ్చిపోయిన ఆవు పడి వున్న బొమ్మ. తల మీద కాకివాలి కన్ను పొడుస్తూ వుంది. ఆవు మీదా వెనుకా అరిచేయంత పెద్ద కుంచెతో ఆ చివరి నుంచి ఈ చివరికి విసిరి కొడుతున్నట్టు రంగులు. ఏయే రంగులు కలిపితే అలా వస్తుందో ఎంత మాత్రం అంతుపట్టని మిస్టరీ. వట్టి సర్‌ప్రైజ్ ఎలిమెంటే కాదు. షాక్ ఎఫెక్ట్ అది. ఈ ఆవు శేషగిరిరావు గారి చేతిలో చచ్చిందేమో గాని, మేము కూర్చున్నా, నుంచున్నా వెంటాడేది. కలల్లోకి నడుచుకుంటూ వచ్చేసేది.
హైస్కూల్ పోయి కాలేజీ వచ్చేసింది.
బెజవాడలో జర్నలిస్టుగా ఉద్యోగంలో చేరాను. ఇన్నేళ్ళు ఆయన మీద ఏ పుస్తకమూ దొరకలేదు. వేరే బొమ్మలూ తగ్గల్లేదు. ఆయన బొమ్మలతో చిన్న పుస్తకం ఉందని కాలేజీ రోజుల్లో మా లెక్చరర్ వెల్చేరు నారాయణరావు గారు చెప్పారు.
1970 దశకం మధ్యలో మొత్తం మీద ఒక చిన్న బుక్ దొరికింది. బొమ్మలు తక్కువే ఉన్నాయి. ఆయన గురించి వివరాలూ టూకీగా ఉన్నాయి. అయినా భారతీయత గల ఆయిల్స్, చైనీస్ వాటర్ వండర్స్. అలాంటివి ‘‘చైనా రీకన్‌స్ట్రక్ట్’’ లాంటి పత్రికల్లోనూ వాళ్ళ ఆల్బమ్స్‌లోనే ఉండేవి.
చైనీస్ కేలిగ్రఫీలాగా ఆయన సంతకం పై నుంచి కిందికి మరీ షోగా వుండేది . జీరో బ్రష్ ఇండియన్ ఇంక్‌లో ముంచి తెల్ల కాయితం పెట్టి అలాంటి ఫోర్జరీ చేద్దామంటే బొత్తిగా రాదే. ఆ కోడిపుంజూ, చెట్ల వేళ్ళూ కూడా అంతే. పంచరంగులైనా, వట్టి బూడిద రంగైనా అదే వరస. మిమిక్రించడం ప్రాణాంతకం. అది శేషగిరి అనీ, మనం దాని పాదాల కింద పచ్చగడ్డి అనీ చచ్చుకుంటూ తెలిసొచ్చింది. కాపీ చేయడం ఆపలేదనుకోండి. కొండపల్లి గారి బొమ్మల ఒరిజినల్స్ ఎప్పటికైనా చూడగలనా అనిపించేది.
చచ్చిన గోవు బతికించింది …హైదరాబాద్ ఆంధ్రప్రభలో కార్టునిస్టు ఉద్యోగమొచ్చింది. పెట్టేబేడా సర్దుకు బయల్దేరా. ఉద్యోగంలో చేరి ఇల్లు వెతుక్కునేలోగా నా సొంతిల్లు లాంటి మఖ్దుం భవన్‌లో మకాం. మొదటిరోజే షాక్. మఖ్దుం భవన్‌లో గోడమీద పెద్ద పెయింటింగ్. డెడ్ కౌ అంత పెద్దగానూ ఉంది. లాగి లెంపకాయ కొట్టే ముదురు రంగులు. నేవీ బ్లూ కొండలు, మిలిటరీ గ్రీన్ చెట్లు. మధ్యలో ధవళ వస్త్రాల్లో మెరుస్తూ రావి నారాయణరెడ్డి, గంభీరంగా కుడిచేయి పైకెత్తి తెలంగాణను ముందుకురకమంటున్నాడు.
వెనుక తుపాకులతో పోరాట యోధులు, రజాకార్ల గుంపులు, నేల కొరుగుతున్న వీరులు, ఆడవాళ్ళు, రావి నారాయణరెడ్డి పైన నీలాకాశం లో మబ్బుల కాంట్రాస్ట్‌లో ఆదర్శమంత ఎత్తయి ఏగురుతున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తీ కొడవలి. కళ్ళు నిండిపోతాయి. నిజానికి అలాంటిలాంటివాడు వేస్తే పరమగాడీ గా ఉండాల్సిన కాంపోజిషన్ అది. రంగుల ఎంపిక కూడా అంతే ప్రమాదకరమైంది. మరి వేసిందెలాంటి వాడు!
అందుకే అలాగుందా బొమ్మ.
కానీ ఓ అనుమానం.
నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ, అంతకంటే పరమాతి పరమ సాంప్రదాయక చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అదే విషయం మఖ్దం భవన్‌లో ఓ పెద్ద నాయకుడినడిగాను. ఆయన పార్టీ కార్డ్ హోల్డరేమీ కాదు. కానీ, హర్డ్ కోర్ సింపతైజర్ అని చెప్పాడాయన. పైగా మఖ్దుం మొహుయుద్దీన్, రావి నారాయణరెడ్డి లాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులెందరో ఆయనకు జిగిరీ దోస్తులని చెప్పాడు. ఇంకా ఆయన జీవిత విశేషాలు చాలా తెలిశాయి. మఖ్దుం భవన్ గోడ పెయింటింగ్
ఏ అర్థరాత్రో ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే అనే కల డ్రీమ్‌గానే మిగిలింది.
ఉదయంలో కార్టునింగ్ బోర్ కొట్టి గుడ్‌బై కొట్టి
చిన్న అద్దె కొంప తీసుకుని స్టూడియో అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. 1991 అనుకుంటా, కాగితాల నిండా న్యూడ్స్ స్కెచ్‌లు వేసుకుంటున్నా. ‘చిత్రకారులు మోహన్ మీరేనా’ అనే గ్రాంథిక గొంతు వినిపించి తలపైకెత్తా. ఆయనే. గుండె జారింది. పొడుగ్గా నుంచుని ఉన్నారు. డ్రాయింగ్ ప్యాడ్ ముందుకు తోసి అమాంతం లేచా. నోట మాట రాలేదు. అందంగా ఉన్నాడు. మనిషి పొడుగు, ముక్కు పొడుగు, ఫాల భాగం అన్నీ, మాలాగ వెర్రి మొహంలా లేడు.
‘నీ సహాయముని కోరి వచ్చాను.’ అంటూ
ఒక సంచీలోంచి చిన్న కవిలి కట్ట బైటికి తీసాడు. పద్నాలుగేళ్ళ వయస్సు నుంచి వెతుకుతున్న మెరుపు తీగ, నలభై ఏళ్ళ వయసుండగా ఎదురొచ్చి కాళ్ళకీ, ఒళ్ళంతా చుట్టుకుని ఊపిరి సలపనీయక పోతుంటే ఎలా! పైగా కుంచె సామ్రాజ్యం మహారాజావారు అంబారీ దిగి వచ్చి
ఈ కుచేలుణ్ణి అటుకులకై అర్థించుటయా, దైవమా! నీ లీలలు కనుగొనుట ఈ ముష్కరుడి తరమా!
విషయం. ఆయన పెద్ద గ్రంథం రాశారు. అది
మన దేవాలయాల్లో స్తంభాలు, విగ్రహాలు, మానవ, జంతు రూపాలకు ఎన్నో అలంకరణలుంటాయి కదా. వాటన్నింటికీ అనేక ముడులుంటాయి. మచ్చుకి రామప్పదేవాలయం మీద నాగకన్యలుంటారు . మెడలో నగలకీ, నడుమున గుడ్డకీ, కుచవల్కలానికీ, నడుము నుంచి కుచ్చిళ్ల మీదకి వేలాడే తాళ్లకీ ఒక్కోచోట ఒక్కోరకంగా ముడివేసి ఉంటుంది. అలాగే ఆలయం బైట నంది మెడలో గంటల వరసలకీ, మూపురం మీద వేలాడే నగలకీ, తోక నుండి చట్టల మీదుగా పైకి వెళ్ళి కిందకి వేలాడే తాళ్లకి మరో రకం ముడి వుంటుంది. వీటన్నింటికీ ఖచ్చితమైన గ్రామర్ ఉంటుంది.
ఆ వేనకువేల చిక్కుముడుల శాస్త్రాన్ని ఆయన రాశారు. పైగా ప్రతి ముడి గురించీ వివరంగా చెప్పే బొమ్మలన్నీ ఓపికగా గీశారు. ఇంకా ఆ నగలూ, తాళ్లూ అటూ ఇటూ తిరిగి ఎలా విడివడి, ఎలా కలసి ముడిపడతాయో చూపే బొమ్మలు బాణం గుర్తులతో వేశాడాయన. చాలా పెద్ద వర్క్. ఈ కాలంలో మానవ మాత్రులెవరికీ తెలిసేది కాదు. ఎవరూ చేసేదీ కాదు. తెలిసినా, చేసినా యాతడు ఆర్టిస్టే కాక, పాశవిక భుజబల సంపన్నుడైన రాక్షసుడై ఉండవలెను. ఏమీ తెలియని ఇలాంటి దానికేమీ సంబంధం లేని నేనేం చేయాలి. ఈ చిక్కుముడి విప్పవలసిందిగా ప్రాధేయపడ్డాను. చెప్పాడాయన. ‘‘ఈ గ్రంథమునకు నీ చైనీయమైన కేలిగ్రఫీతో టైటిల్ వ్రాయవలెను. నీ బొమ్మ ఆకర్షణీయమైన రంగులతో గీయవలెను.
నీ తెలుగు అక్షరములలో వేగమే కాదు. ఆ పొందికయన్న నాకెంతో అభిమానము’’, అన్నాడయన. నా కుర్చీ నాల్గు కాళ్ళ కింద గచ్చు పెనుకంపమునకు ఛిద్రమై సెకండ్ ఫ్లోర్‌లోకి పతనమవడానికి సిద్ధమవుతోంది. తమాయించుకున్నాను.
నా బొమ్మల గురించాయన పొగిడిందీ, ఎనలైజ్ చేసిందంతా చెప్పలేను. కానీ, జరుగుతుందని
ఎలా అనుకుంటాం. పర్వతమొచ్చి గడ్డి పరకను పలకరించటమా! పని అడగడమా! తేరుకున్నా. వేస్తానన్నా. అమాయకమైన ఆయన సుకుమార హృదయాన్ని ధర్భాంకురేణముతో నేనేల గాయపరచవలె! తప్పకుండా అంతా చేస్తానన్నా.
తర్వాత ఎన్నోసార్లు ఆయనింటికి వెళ్లా.
మేమిద్ధరం ఏ.ఐ.సీ.సీ. సావనీర్‌కు పనిచేశాం. బాలల చిత్రకళా పోటీలకు జడ్జీలుగా వెళ్ళాం. ఇప్పటికీ ఆ స్క్రిప్టు అలాగే ఉంది. అందులో భారతీయ చిత్రకారుల గీతారహస్యం ఉంది.
మన దక్షిణాది నుండి ఎనిమిదో శతాబ్దంలోనే ఆగ్నేయాసియాకు వెళ్ళి కాంబోడియాలో ‘‘అంకార్‌వాట్’’గా నిలిచిన దేవాలయాల సముదాయం వుంది. ఇది సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్‌లో ఒకటి. దీని పునరుద్ధరణకు ఐరాస వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ఇది మాయా నాగరికత కట్టడాలకూ, ఈజిప్టు పిరమిడ్లకూ సమానమైనది. ఇలాంటి అపురూపమైన సంపదను అచ్చు వేసుకొని మన గురించి మనం తెలుసుకోవడం, తలచుకోవడం అత్యవసరమని అనుకుంటున్నాను.
నా ఈ అరణ్యరోదనను విని ఎవరైన అచ్చు వేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఏమంటున్నారూ ….
అడవిలో అరుస్తున్నానంటారా!
-ఆర్టిస్ట్ మోహన్