అసలు మనం నాలుగు నీతి కబుర్లు చెప్పటం మినహా ఎప్పుడైనా మన కుటుంబ బంధాలు ఎంత ప్రజాస్వామికంగా వుంటున్నాయో ఆలోచిస్తామా? అన్నింటికీ నివ్వెర పోవటమే తప్ప మన మానవ సంబంధాల్లోని హింస మనుషుల్ని ఎంత పతనం చేస్తుందో ఆలోచిస్తున్నామా?
నిన్న సంతబొమ్మాళిలో నీలిమ తన భర్త నవీన్ కుమార్ పీక కోసేసింది. మొన్నామధ్య నాగర్ కర్నూల్ లో స్వాతి తన భర్త సుధాకర్ ని ప్రియుడి సహాయంతో హత్య చేసింది. అలాగే విజయనగరం జిల్లా దిట్టపువలసలో సరస్వతి తన భర్త యామక శంకర్రావుని కిరాయి హంతకుల్ని హైర్ చేసి మరీ లేపేయించింది. కొద్ది రోజుల క్రితం కడప జిల్లా రాజంపేటలో అరుణ తన భర్త శివని దారుణంగా హత్య చేయించింది. కాకినాడలో భానుచందు తన మొగుడైన రాయుడు హరిని ప్రియుడి సహాయంతో చంపేసింది. ఇలా ఎన్నో!
ఏమైందీ స్త్రీలకి?
దెబ్బకి దెబ్బ తీస్తున్నారా?
పురుషుడంత దుర్మార్గంగా మారుతున్నారా?
ఎందుకిలా తయారవుతున్నారు?
ఏమైనా కొత్త రక్తం ఎక్కించుకున్నారా?
మరక మంచిదే అన్నట్లు భయపెట్టడం కూడా మంచిదేనా?
*
స్త్రీని పురుషుడు కొట్టడం రివాజు. పురుషుడిని స్త్రీ తన్నటం వార్త. స్త్రీని పురుషుడు హత్య చేయటం మామూలు. పురుషుడిని స్త్రీ చంపటం మాత్రం కల్లోలం. స్త్రీని పురుషుడు మోసం చేయటం సంస్కృతి. పురుషుడిని స్త్రీ వంచించటం సంక్షోభం. అవునిప్పుడీ వార్తా కల్లోల సంక్షోభం పెరుగుతున్నది.
ఈ మధ్య కాలంలో భారతీయ సమాజంలో జరగరానివి అవునో కాదో కానీ ఇన్నాళ్ళు జరగనివి జరుగుతున్నాయి. స్త్రీలు పురుషుల్ని చంపుతున్నారు. సంఘటనల శాతం తక్కువ కావొచ్చేమో కానీ అచ్చం పురుషులు స్త్రీలను చంపుతున్నట్లే కొందరు స్త్రీలు పురుషుల్ని చంపేస్తున్నారు. “ప్రియుడి మోజులో పడ్డ భార్య కిరాతకం” అనో లేదా “అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తని హత్య చేసిన భార్య” అనో “నవ వధువు అఘాయిత్యం” అనో మీడియాకి సేలబుల్ వార్తలుగా కొంతమంది స్త్రీలు బైటపడుతున్నారు.
ఇలా ఎన్నో వింటున్నాం. ఇలాంటి దాదాపు ప్రతి కేసులోనూ మొగుడు తాగొచ్చి భార్యని హింసించటమో, ఇంటి బాధ్యతని పట్టించుకోక పోవటమో జరుగుతుంది. విసుగెత్తిన విద్యావంతులైన స్త్రీలు చాలా డెస్పరేట్ గా నేరానికి పాల్పడటం ద్వారా అయినా సరే హింస నుండి బైటపడి కొత్త జీవితం కోసం మూర్ఖంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. దుర్మార్గుడైన భర్త చస్తే తమకు జీవితంలో శాంతి దక్కుతుందని అనుకుంటున్నారు.
నేరం పురుషుల స్వభావమని, స్త్రీలు కోమలులనే సూత్రీకరణలు తప్పని నిరూపితమౌతున్నాయి. మానవస్వభావంలోని నేర ప్రవృత్తికి స్త్రీ మాత్రం అతీతం కాదా? స్త్రీల స్వభావం చుట్టూ అల్లిన కండిషనింగ్ కరిగిపోతున్నదా? స్త్రీల స్వభావ ఔన్నత్యానికి సంబంధించి “కార్యేషు దాసీ…” వంటి వ్యూహాత్మక కీర్తనలు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయా? ఇవే కాదు. స్త్రీలను హంతకులుగా, నేరస్థులుగా నిలబెడుతున్న నేరపూరిత సంఘటనలు విలువలకి సంబంధించిన అనేక ప్రశ్నలను కూడా రేకెత్తిస్తున్నాయి.
*
భారతదేశంలో స్త్రీ పురుష సంబంధాలన్నీ ప్రధానంగా దంపతీ సంబంధాలుగా చూడబడతాయి. దంపతీ సంబంధాల బైటనున్న సంబంధాలకి గౌరవం లేదు. సమసమాజ స్థాపనకు నడుం బిగించిన పురోగమివాదులు కూడా అటువంటి సంబంధాల్ని “అక్రమ సంబంధాలు” అని కసిగా పళ్ళు నూరటం కద్దు. ప్రేమ, తృప్తి, గౌరవం, అనురాగం వంటి మానవీయానుభూతులు, సహజ భావోద్వేగాలన్నీ ఆయా వ్యక్తుల కుటుంబ చట్రం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే దక్కుదల! మరో రకంగా పాపులర్ వ్యక్తీకరణలో చెప్పాలంటే “ఎవరికి ఎంత రాసిపెట్టుంటే అంతే దక్కుతుంది” నిజం చెప్పాలంటే కుటుంబం స్త్రీ పురుషులు ఒక యూనిట్ గా సౌకర్యంగా, ప్రజాస్వామికంగా బతికే ఒక సామాజిక నిర్మాణంగా కాక నిర్వచిత ఆధిపత్య విలువల ప్రాతిపదికన నిర్దేశించబడిన పరిధిలోని నిర్దిష్ఠ కదలికల కేంద్రంగా భారతీయ సమాజంలో రూపుదిద్దుకుంది. ఆ కుటుంబ విలువల్లో ఆధిపత్య భావనలు తక్కువగా వుంటే ఆ మేరకు సుఖంగా, శాంతిగా బతకొచ్చు. అలా కాకుండా ఆ పని చేసి తీరాలి, ఈ పని చేయకూడదు, ఇలా కూర్చోవాలి, ఇలా నుంచోవాలి, నాతో నువ్విలా వుండాలి, నీతో నేను ఇలా మాత్రమే వుంటాను, నువ్వది చేయాలి, నేనిది చేయాల్సిన పనిలేదు, ఈ డబ్బు నాది, ఈ బాధ్యత నీది, నాకీ స్వేఛ్ఛ వుంది, నీకీ కట్టడి వుంది వంటి జడత్వ భావనలన్నీ కుటుంబంలోని సభ్యుల హెచ్చుతగ్గుల స్థానాల్ని తెలుపుతుంటాయి. మన కుటుంబ వ్యవస్థలోని జడత్వాన్నే మనం పటిష్ఠతగా భావించి మురిసిపోతుంటాం. ఏ మాత్రం సడలింపు లేకుండా వ్యవహరించటాన్ని సంస్కృతిగా భావించి చప్పట్లు కొట్టుకుంటాం. మానవ స్వభావంలోని వైవిధ్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేని కారణంగా ఒక భిన్నాభిరుచిని, ఒక విరుద్ధ అభిప్రాయాన్ని సహించలేనితనాన్ని క్రమశిక్షణగా కీర్తించుకుంటాం. మూస బతుకుల్లో సృజనాత్మకతకు తావుండదు, ఒక్క ఉక్కపోత తనమే తప్ప! ఉక్కపోతతనం కలిగించే అసంతృప్తి, నిస్పృహ తప్ప.
*
విద్య హక్కుల గురించి ఎంతో కొంత జ్ఞానం ఇస్తుంది
జ్ఞానం స్వీయ అస్తిత్వ చైతన్యాన్నిస్తుంది.
అస్తిత్వ చైతన్యం తన ఇష్టాయిష్టాలకు విలువనిచ్చే ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తుంది.
ఆత్మ గౌరవం తాననుకున్నది పొందాలనే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.
ఇవాళ అసూర్యంపశ్యలంటూ ఎవరూ లేరు. ఎండ కన్నెరగని లలనామణులు, కోమలత్వ లాలసులూ లేరు. తల బైటకిపెట్టడమే కాదు, పురుషుడితో పాటు సమానంగా జీవితంలో పరిగెడుతున్నది స్త్రీ. చదువుకున్నది. ఉద్యోగాలు చేస్తున్నది. సిటీ బస్సులెంట పరిగెడుతున్నది. షేరింగ్ ఆటోల్లో పురుషుల పక్కన కూర్చుంటున్నది. కార్యస్థానమైనా, తిరిగి ఇల్లైనా గమ్యం చేరటం పురుషుడికెంత ముఖ్యమో ఆమెకూ అంతే ముఖ్యం. పురుషుడికి తన భవిష్యత్తు పట్ల ఎంతటి ఆతురత, ఆసక్తి వుంటుందో ఆమెకీ అంతే వుంటున్నది. నేటి స్త్రీ తన విలువ తాను బాగానే తెలుసుకుంటున్నది. తనకేం కావాలో నిర్ణయించుకుంటున్నది. ట్రాన్సిషన్‌లో ఒక కీలకమైన దశలో వుంది. తన ట్రాన్సిషన్ పట్ల ఆమెకున్న అవగాహన పురుషుడికి కొరవడుతున్నది. అక్కడే వైరుధ్యం అంకురిస్తున్నది.
ఇప్పుడు ముప్ఫై, నలభై ఏళ్ళున్న నేటి పురుషుడికి తన స్త్రీ తనలాగే అన్నీ చేయగలిగుండాలి. స్త్రీ చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. ఏదో చేసి సంపాదించాలి. కుటుంబ భావి ప్రణాళికల్లో ఆమె సంపాదనకి ఎంతో ప్రాముఖ్యముంటుంది. కానీ చివరాఖరికి తన చిటికెల సవ్వడికి ఆమె తలొగ్గాలి. తన పాద ఘాతానికి ఆమె కంపించాలి. తనకి మద్యపానం, ధూమపానం, క్లబ్బుల జీవితం ఒక హోదానో, ఒక సహజ హక్కో లేదా ఆభరణమైతే ఆమె విషయంలో మాత్రం అవి చేయకూడని పనులు, పతనమౌతున్న సంస్కృతికి ప్రతీకలు, తిరోగమిస్తున్న సమాజానికి చిహ్నాలు!!!
స్త్రీలు కూడా పురుషుడంత మొరటుగా తయారవటానికి దారి తీసే పరిస్తితులున్నాయని, ఖండన ముండనలకు పూనుకోకుండా ఇది నిజంగా అర్ధం చేసుకోవాల్సిన సందర్భమని నాబోటోడు అనగానే ఇక్కడే ఉదారవాదులు కూడా ఏ మాత్రం తడబాటు లేకుండా వెంటనే సంధించే ప్రశ్నలు కొన్నున్నాయి.
సమానత్వమంటే ఇదేనా?
ఇదేనా స్త్రీల అభ్యున్నతి అంటే?
స్త్రీలు కూడా నేరస్తులైతే ఈ సమాజం మరింత నాశనమవ్వదా?
స్త్రీలు కూడా పతనమైతే భావి తరాల సంగతేమిటి?
ఈ ప్రశ్నల్లో కొంత అపరిపక్వత, మరికొంత అమాయకత్వమూ, ఇంకొంచెం అవగాహనారాహిత్యం వున్నాయి. ఈ రకం ప్రశ్నలు నిజానికి సంస్కృతి పరిరక్షణా బాధ్యత నుండి, సామాజిక శాంతి నిర్వహణ నుండి, కుటుంబ పటిష్ఠతా బాధ్యత నుండి పురుషుడికి ఒక సేఫ్ పాసేజ్ ని ఇస్తాయి. ఒక వీటో పవర్ ని ఇస్తాయి. అంటే సగం సమాజానికి అనైతికంగా బతకటానికి ప్రత్యక్ష ఆమోదం ఇవ్వకపోయినా పరోక్షంగా మినహాయింపు ఇస్తున్నట్లే. వీటన్నింటికంటే ముఖ్యంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. అదేంటంటే “అసలు స్త్రీ అయినా, పురుషుడైనా…ఎవరైనా నేరపూరితంగా తయారవకుండా వుండాలంటే ఏం చేయాలి?” ఈ ప్రశ్నకి సమాధానం అనేక అనుబంధ ప్రశ్నలకి సమాధానంగా దొరుకుతుంది.
**
అసలు మనం నాలుగు నీతి కబుర్లు చెప్పటం మినహా ఎప్పుడైనా మన కుటుంబ బంధాలు ఎంత ప్రజాస్వామికంగా వుంటున్నాయో ఆలోచిస్తామా? అన్నింటికీ నివ్వెర పోవటమే తప్ప మన మానవ సంబంధాల్లోని హింస మనుషుల్ని ఎంత పతనం చేస్తుందో ఆలోచిస్తున్నామా? ఆధ్యాత్మికంగా, మతపరంగా ఇద్దరినీ సాంప్రదాయబద్ధంగా ఏకం చేయటం తప్ప ఆ పెళ్ళి సంబంధంలోని ప్రేమరాహిత్యం, ఉక్కపోతతనం కలిగించే అశాంతి ఏమిటో, అదెలా పరిణమిస్తుందో పట్టించుకుంటామా? ఎంతసేపటికీ కట్టి పడేస్తే సరి అనుకోవటం తప్ప మనిషి స్వభావంలోని స్వేఛ్ఛా కాంక్ష, స్వాతంత్ర్య ప్రీతి ఎంత బలమైనవో ఆలోచిస్తామా? విలువల పేరుతో బ్లాక్మెయిల్ చేయటం తప్ప ప్రేమగా, బాధ్యతగా మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తామా?
మనకు నిందలు మోపి తిట్టి పోయటమే తప్ప, బుగ్గలు నొక్కుకోవటం తప్ప, నైతిక తీర్పులివ్వటం తప్ప, మోరల్ పోలీసింగ్ తప్ప ఆలోచించటం చేతకాదు. కార్యకారణ సంబంధ విశ్లేషణలకు పూనుకోం. మనిళ్ళల్లోని వాతావరణంలో ఎంత సున్నితత్వం వుందో, మనం మానసికంగా ఎంత నెత్తురోడుతామో పట్టించుకోం. పక్కిళ్ళ గురించి తీర్పులిస్తాం. అన్నీ ద్వంద్వ ప్రమాణాలు.
*
ప్రేమ ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమగా జయించకపోతే హింస హింసని హింసాత్మకంగా హింసించి హింసపై హింస గెలుస్తుంది.
ఎనీ డౌట్స్?
~ అరణ్య కృష్ణ