“నీకు దేశభక్తి లేదు” లేదా “నీకసలు దేశభక్తి వుందా?” “నాకు దేశభక్తి మిన్న!”. “ఆమె తన కుమారుడికి కథల ద్వారా దేశభక్తిని రంగరించి పోసేది” అనే మాటలు విన్నప్పుడల్లా లేదా చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం కలిగేది. ఎందుకంటే భక్తి అనేది దైవ విశ్వాసానికి సంబంధించిన ఒక మానసికోద్వేగం. అభౌతిక, మానవాతీత విశ్వాసం మీద ఆధారపడినటువంటిది. కనిపించే మనుషుల మీద నమ్మకం లేక వాస్తవాలకి భయపడో, గందరగోళ పడో కనిపించని దేవుడికి మొర పెట్టుకునే విధానం. భక్తి అంటే ఊదొత్తుల, ధ్యానాల, పూజా పునస్కారాల, మంత్ర తంత్రాల, కర్మ కాండల, క్రతువుల వ్యవహారమాయే! మరి దేవుడికి దేశంకీ మధ్య పోలికెక్కడ? దేశం ఒక వాస్తవం కదా? పూర్వకాలంలో రాజుల్ని దైవ ప్రతినిధులుగా భావించి రాజులకు అధీనంగా, విశ్వాసంగా బతకటాన్ని ‘రాజభక్తి ‘ అనేవారు. కానీ ఈ ఆధునిక కాలంలో దేశాల్ని ఏ భగవంతుడూ తన ప్రతిరూపాలుగా ఏర్పరిచాడని మనం అనుకోలేం. పైగా ఏ మతగ్రంధమూ అలా ఉద్భోధించలేదే! మరి దేశభక్తి ఏమిటి బాబూ? దేశం కూడా దేవుడి లాంటిదని, దేవుడిని కొలిచినట్లు సమాజాన్ని కొలవాలని ఊరకనే తర్కానికి అనుకోవచ్చు. కానీ సమాజానికి కావలిసింది నిబద్ధతతో కూడిన కార్యాచరణ, సాటి మనుషులకు సేవ. ఊదొత్తులు, పూజలూ కాదే?
నిజానికి దేశమంటే నువ్వూ, నేనూ, మనలాంటి వాళ్లే కదా ప్రియ మిత్రమా! మన ప్రభుత్వాలు, మన రాజ్యాంగం, మన చట్ట వ్యవస్థలు, మన నాయకులు…అన్నింటికీ మించి మన దేశమంటే మన ప్రజలు. అంటే మనందరం. ఇదో భౌతిక వాస్తవం. ఈ ప్రభుత్వం మన కోసం మనం ఏర్పరుచుకున్నది. ఈ చట్టాలు మన కోసం మనం చేసుకున్నవి. దేవుడు నుండి నువ్వు కోరుకుంటావు, మొక్కుకుంటావు. మరి నువ్వే దేశం అయినప్పుడు నీకు నువ్వు మొక్కుకుంటావా? పోనీ నీకూ నాకూ మధ్యన వుండాల్సింది భక్తా? నిజాయితీతో కూడిన బంధమా?
దేశమంటే భూమి సరిహద్దులా లేక ఏ యుద్ధమో లేక ఏదో ఒడంబడిక ప్రకారం మారుతుండే సరిహద్దుల మధ్యన బ్రతికే ప్రజలా? నిజం చెప్పు, చరిత్రలో భారతదేశ సరిహద్దులు ఎన్నిసార్లు మారలేదు? దేశం ఎప్పుడు ఎంత వుంటే ఆ మేరకి భక్తి కలిగి వుండటం దేశభక్తా? దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులనుకున్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి వుండాల్సింది నిజాయితీతో కూడిన నిబద్ధత. ఒకరి మీద మరొకరు లేదా ఏవో సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువల, విశ్వాసాల ఆధారంగా ఏర్పడిన ప్రజా సమూహాల్లో ఒక సమూహం మరొక సమూహాన్ని అణచివేయకుండా బతికే సంస్కారం కావాలి. ఏదో వంకతో తనకో లేదా కుల, మత, వర్గ, ప్రాంత ప్రాదిపదికన తన వాళ్లకో లాభం కలిగించే పనులు చేయని నిస్వార్ధం కావాలి. భిన్నమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల సహనం కావాలి. అంతేకానీ కోవెలలోనో, మశీదులోనో, చర్చిలోనో, గురుద్వారాలోనో చూపించాల్సిన భక్తి ఏం చేయగలదు ఏ ఇద్దరి మధ్యనైనా?
భగత్ సింగ్ దేశభక్తుడు, అల్లూరి దేశభక్తుడు, గాంధీ నెహ్రూ పటేల్….అందరూ దేశభక్తులంటాం బాగానే వుంది కానీ వారు నిజానికి భక్తితో బ్రిటీష్ వారి మీద పోరాడారా లేక ఆగ్రహంగానో, ప్రతీకార దృక్పథంతొనో, శాంతియుతంగానో నిరసనగానో పోరాడారా? వారు బానిసత్వానికి, దోపిడీకి, క్రూర చట్టాలకు వ్యతిరేకంగా స్వాత్రంత్ర్య కాంక్షతో పోరాడటంలో భక్తి పాత్ర ఎంత? వాళ్లు ఖచ్చితంగా ఒక జాతి మీద మరో జాతి సాగించే దౌష్ట్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఒక వ్యక్తి లేక ఒక సమాజం బానిసత్వంలో మగ్గటం అమానుషం కాబట్టి, ఆత్మగౌరవానికి భంగం కాబట్టి, జాతుల ఉనికికి ప్రమాదకరం కాబట్టి వారు పోరాటం చేసారు. వారి గుండెల్లో వున్న భావోద్వేగం దుర్మార్గం పట్ల ధిక్కారమే కానీ భక్తి భావం కాదు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన బెంగాలీ నవల “ఆనంద్ మఠ్” లోని “వందేమాతరం” అనే ఒక కవిత శీర్షికని నినాదం ప్రజల్ని స్వాతంత్రోద్యమం పట్ల ప్రొద్భల పరచటానికే కానీ ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో ఇచ్చినది కాదే!
“నువ్వు నిబద్ధత అను, నిజాయితీ అను…మేం దాన్నే దేశభక్తి అంటాం! నష్టమేమిటి?” అని అడగొచ్చు. నష్టం వుందనే అనుకుంటున్నా. భక్తికి ఆచరణకి సంబంధించిన జవాబుదారీతనం లేదు. భక్తి నైరూప్యం. దాని లక్ష్యం ఏదో కోరుకోవటం, కటాక్షం పొందటం. భక్తి లేకపోతే నిన్ను అడిగేవాళ్లెవ్వరూ లేరు. అందుకే దేశభక్తిది ఖర్చులేని రిస్కు లేని ఆదర్శంగా ప్రచారం చేయబడే భావోద్వేగంగా మిగిలిపోయింది. పైన అనుకున్నట్లుగా దేశమంటే కేవలం సరిహద్దులే కాకుండా ప్రజలు, ప్రభుత్వం, రాజ్యాంగం, అది నిర్దేశించే విధులు, చట్టాల పట్ల గౌరవం, న్యాయబద్ధమైన నడవడిక, రాజ్యాంగ వ్యవస్థలపైన నమ్మకం….వీటన్నింటినీ దేశభక్తి ఎంతమాత్రమూ చర్చించదు, తనలో పొందుపరుచుకోదు.
మనదేశంలో దేశభక్తి కేవలం ఒక ప్రతీకాత్మక ఆదర్శం. అది మాటలకే పరిమితమైనది. నువ్వెన్ని సార్లు “భారత్ మాతాకీ జై” అంటే అంత దేశభక్తుడివి. మనకి దేశభక్తి అనేది ఒక సెంటిమెంట్. దేశభక్తి వున్నవాళ్లు ఏం చేయాలో ఎక్కడా చెప్పబడలేదు. దేశభక్తి అంటే మనకు జెండాకి సెల్యూట్ చేయటం, సైనికుల పట్ల ఆరాధనాభావం కలిగి వుండటం, భారతదేశంతో తగాద వున్న దేశాల్ని ద్వేషించటం, ఒక ఊహాజనిత స్త్రీమూర్తికి పట్టుచీర కట్టి, అమ్మవారిలా అలంకరించి భారతమాత అని తాదాత్మ్యమై పోవటం. ఇదీ మన దేశభక్తి. ఇందులో దేశం కోసం ఆచరణ ఏముంది? మనవారు సైనికులే అత్యున్నత దేశభక్తులనుకుంటారు. కానీ సైన్యమే అదో మంచి కెరీర్ అని ఉద్యోగ ప్రకటనల్లో వేస్తుంటుంది. సైనికులే దేశభక్తులనుకోవటానికి ప్రధాన కారణం పౌరులుగా మనకున్న అభద్రతే. వారు సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనల్ని శతృవుల నుండి రక్షిస్తుంటారనే నమ్మిక! అవతలి దేశపు ప్రజలూ తమ సైన్యం గురించి అలానే అనుకుంటారని మనం అనుకోం. మన కోసం వారెందుకు అంత ప్రమాదకర ఉద్యోగాలు చేయాలని, మనకెందుకు ఇంత స్వార్ధమని ప్రశ్నించుకోం. దేవుడికి దండం పెట్టినట్లు వీళ్లకి కూడా చప్పట్లు కొదితే చాలనుకుంటాం. అసలు చుట్టుపక్కల దేశాలన్నింటితో మనకెందుకు తగాదాలు అని తార్కికంగా ఆలోచించటం మాత్రం దేశభక్తిలో భాగంగా చూడం. అంటే పౌరులుగా మనం హక్కులతో, తలెత్తి బతకటంగా కాక కాపాడబడే వారిలా, రక్షించబడే వారిలా, కటాక్షించబడే వారిలా బతకటాన్నే దేశభక్తి ప్రభోదిస్తుంది.
పైన అనుకున్నట్లు దేశభక్తి ఆచరణకి సంబంధించినది కాదు. దేశభక్తి మన రాజ్యాంగం మీద అవగాహనేమీ పెంచదు. హక్కుల పట్ల మన స్పృహని పెంచదు. రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలను నిజం చేయటానికి మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయదు. మన నాయకుల అవినీతిని ప్రశ్నించేలా చేసేది కాదు. వారి మీద ఎన్నికల వాగ్దానలను నిజం చేయమని వొత్తిడి తీసుకొచ్చేది కాదు. మన దేశభక్తికి అతి పరిమితమైన పరిధి వున్నది. ఆ పరిమిత ఆదర్శంలో వాస్తవాలతో పనిలేకుండా ఎవ్వరైనా తలమునకలేసేలా చేయగలదు మన దేశభక్తి. ఏవో జెండా పండుగలకు శాల్యూట్ కొట్టడం మినహా, సైన్యాన్ని చూసి ఉప్పొంగిపోవటం, క్రికెట్ మాచెస్లో ప్రత్యర్ధుల మీద గెలిస్తే సంబరాలు చేసుకోవటం మినహా దేశభక్తి మన నుండి ఆశించేది పెద్దగా లేదు. కానీ దేశం గురించిన మన ఆలోచనలు ఇంతవరకేనా ఉండాల్సింది?
మనం జాగ్రత్తగా గమనిస్తే దేశభక్తి అనేది మతం చుట్టూనే తిరుగుతుంటుంది. ముఖం మీద ఇంతేసి తిలకాలు పెట్టుకొని, కుంకుమలు అద్దుకొని కాషాయ స్కార్ఫ్స్ కట్టుకొని “భారతమాతాకీ జై” అంటూ దేశభక్తిని ఒక మతానికి పరిమితం చేయటం దేశానికి ఏ విధంగా హితకరం? విగ్రహారాధన లేదా బహు దేవతారాధన చేయని మత సెంటిమెంట్స్ వున్నవారు భారతమాత రూపంలోని దేశభక్తికి దూరం కావలిసిందేనా? పౌరులందరినీ కలుపుకుపోవాల్సిన భావజాలానికి పనిగట్టుకొని దూరం చేయటం “దేశభక్తి” ఉద్దేశ్యమా? వాళ్లు “భారత్ మాతాకీ జై” అనే ప్రతీకాత్మక నినాదం అనలేదని కంప్లైంట్లో అర్ధం ఏమున్నది? తమ మైనారిటీ మత సెంటిమెంట్స్ ని గాయపరుచుకొని మరీ మెజారిటీకి తలొగ్గాల్నా? నినాదమిస్తేనే మీరన్న దేశభక్తి వున్నట్లా? ఇది దేశభక్తి ద్వారా చెలరేగిపోయే మెజారిటేరియనిజపు అసలు రంగు. పౌరుల్ని మతాలుగా విడదీసేదా దేశభక్తి అంటే? దురదృష్టవశాత్తూ దేశభక్తులకు ఇవేవీ పట్టవు.
కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించటానికి, పొరుగు దేశాల్ని ద్వేషించటానికి, పొరుగు దేశాలతో మతపరమైన పోలికలతో మన పౌరుల్లోని కోట్లాదిమందిని వేలెత్తి చూపటానికి మన దేశభక్తి పరిమితం అవుతున్నది. ఉగ్రవాదానికి అచ్చు బొమ్మ వుంటాయనే సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు దేశాన్ని నాశనం చేసేది కేవలం బాంబు మోతల, మారణకాండల చర్యలేనా? ఇవి ఖండించటం వరకేనా దేశభక్తుల పని? దేశానికి నష్టం కలిగించే రాజకీయ నాయకుల, పార్టీల అవినీతి కార్యకలాపాలు దేశభక్తుల దృష్టిలో ఎందుకు పడవు? పార్టీలు మార్చే వాళ్లు, రాజకీయ బ్రోకర్లు, పదవుల్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయిల ఆస్తుల్ని పోగేసుకొని వాటిని కాపాడుకోవటానికి పదవుల్లో రావటం కోసం ఎన్నికల సమయంలో మద్యం, నగదు పంపిణీలు చేస్తూ ప్రజల్ని కూడా అవినీతి పరుల్ని చేసే రాజకీయ నాయకులు, ఎమ్మెల్లేల్ని కొనటానికి కోట్లు కుమ్మరించే పార్టీల అధినేతల కార్యకలాపాలు ఏ విధంగా ఉగ్రవాదం కంటే తక్కువ నష్టం కలిగిస్తాయి? వీటిని ఖండించటం, వాళ్లని తిరస్కరించటం ఏ విధంగానూ దేశభక్తుల కార్యాచరణలో భాగం కాదు కదా! వేల లక్షల కోట్ల రూపాయిల ఋణాల్ని ఎగ్గొట్టే కార్పొరేట్ల దాష్టీకం ఆయుధ ఉగ్రవాదం కన్నా ఏ విధంగా తక్కువ? యాభైమంది కార్పొరేట్లకి 68 వేల కోట్ల రూపాయిల ఋణ మాఫీ చేసారట. ఆయుధ ఉగ్రవాదం కన్నా ఆర్ధిక ఉగ్రవాదం మరీ ప్రమాదకరం. దానికి రాజకీయుల అండ వుండటం దేశానికి మరింత హానికరం. కార్పొరేట్ డిఫాల్టర్స్ తో జాతీయ నాయకులే చెట్టపట్టాల్ వేసుకు తిరుగుతుంటే నోరు పెగలక పోవటం దేశభక్తా? అందుకే మరోసారి చెబుతున్నా దేశభక్తి అనేది కార్యాచరణతో సంబంధం లేని, ఖర్చు లేని రిస్కు లేని ఆదర్శం!
దేశం గురించి మన అవగాహన అప్ గ్రేడ్ కావాలి. అందుకు కృత్రిమ దేశభక్తి అనే ఈ భావజాలమే పెద్ద అడ్డంకి. దేశం యొక్క ప్రాచీన సాంస్కృతిక వారసత్వం గురించి పొంగిపోయే ముందు ఇప్పుడున్న పరిస్తితి నుండి ఎలా ఉన్నతీకరించబడేలనే అవగాహన పెరగాలి. దేశంలోని అత్యధిక భాగం పేదరికంలో మగ్గుతున్నప్పుడు, నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు, రైతులు ఆత్మహత్యలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నప్పుడు మనదైన ఘన ప్రాచీన వారసత్వం ఎంతవరకు పనికొస్తున్నది? మనల్ని మనం తృప్తి పరుచుకున్నంత కాలం మనలో ఎదుగుదల వుండదు. మనల్ని మనం పొగుడుకోవటం ఆత్మవంచన. మనకి కావలిసింది దేశం పట్ల కార్యాచరణతో కూడిన నిబద్ధమైన ప్రేమ. బాధ్యతలు నిర్వర్తించటం ముఖ్యం. బాధ్యతలంటే కేవలం రాజ్యాంగంలో నిర్వచించిన విధులని నిర్వహించటం కాదు. ఇక్కడ బాధ్యత అంటే సామాజిక బాధ్యత. వాణిజ్య ఒప్పందాల పేరుతోనో లేదా మరో ఒడంబడిక పేరుతోనో మన దేశ సర్వసత్తాక, సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాల పట్ల జాగరూకత పెరగాలి. దేశం సర్వ సమగ్రాభివృద్ధి దిశగా వెళ్లాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. దేశాన్ని ఆర్ధికంగా కుదేలు చేసే కుంభకోణాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పర్యావరణ స్పృహ కలిగి వుండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక హక్కుల పట్ల అవగాహనతో కూడిన చైతన్యం వుండాలి. ప్రభుత్వాల్ని నిలదీయగలగాలి. కులం వంటి సాంఘీక అంతరాల్ని ప్రశ్నించగలగాలి. వాటి నిర్మూలనకి కృషి చేయాలి. జెండర్ దృక్పథంలో మార్పులు రావాలి. ఈ దేశ ప్రగతికి పాటు పడే ప్రతి పన్ను చెల్లింపుదారుడి పట్ల జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ జెండర్, కుల, మత, జాతి, రంగు వంటి ప్రాతిపదికల ఆధారంగా ఎదురయ్యే సమస్త సాంస్కృతిక, అస్తిత్వ వివక్షలన్నీ నశించాలి. ఇన్ని చేసి ప్రభుత్వాలు నిజంగా సంక్షేమ ప్రభుత్వాలు కాగలిగినప్పుడు, దేశం సాంకేతికత హరించని మానవీయతతో అభివృద్ధి చెందినప్పుడు, సాధనాసంపత్తిలో స్వావలంబన సాధించగలిగినప్పుడు, ఇతర దేశాలకు ఒక గైడింగ్ ఫోర్స్ గా వుండగలిగినప్పుడు….అప్పుడు ప్రజల్లోని సామూహిక చేతనకి ఏ పేరు పెడతారో ఆ పేరు పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు.
ఒప్పుకుంటారా?
-అరణ్యకృష్ణ