సూర్యపేటలో మరో కుల ఆధారిత పరువు హత్య జరిగింది. వడ్లకొండ కృష్ణ అనే దళిత యువకుడు భార్గవి అనే బిసి కులానికి చెందిన యువతిని తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే అతన్ని ఈ నెల 26న దారుణంగా హతమార్చారు.
ఇది సుపారీ హత్య కాదు. భార్గవి కుటుంబ సభ్యులే తమ స్నేహితులతో కలిసి కృష్ణని చంపేశారు. ఈ హత్యలో భార్గవి అన్నలతో పాటుగా ఆమె నానమ్మ, నాన్న కూడా పాల్గొనటం విస్తుగొలిపే అంశం. ఒక కుటుంబంలోని మూడు తరాలు కలిసి చేసిన దారుణ నేరమిది. మొదటి తరానికి హత్య చేయడానికి కూడా వెరవనివ్వని కులోన్మాదం పోలేదు. రెండో తరానికి తామూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో బాధితులమేనన్న జ్ఞానం లేకపోగా తమ కంటే ఒక మెట్టు కిందనున్నవాడి పట్ల తన పైనున్న వాడు తన పట్ల ఎంత కర్కశంగా ఉంటాడో అంతే కర్కశంగా ఉండకూడదన్న ఇంగితం లేదు. ఇంక మూడో తరానికి సమాజానికి అవసరమైన నాగరిక విలువలు, చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం, మానవ సంబంధాలలో ప్రజాస్వామిక సంస్కారాలు వంటపట్టలేదు.
మన సమాజం శ్లాఘించే దుర్మార్గ విలువల్లో కులం చాలా ముఖ్యమైనది. ఏ మనిషైనా ఒకే రకంగా పుడతారు. ఒకే రకమైన శారీరిక వ్యవస్థతో బతుకుతారు. కానీ కొన్ని కులాల్లో పుట్టిన శరీరాలు గొప్పవై పోతాయి. దోపిడీ నిరంతరాయంగా అమలవ్వాలంటే తిరుగుబాటు గురించిన ఊహ కూడా భయపెట్టాలి. ఈ హత్య అనే కాదు కులాంతర, మతాంతర వివాహాల సందర్భంగా జరిగే ప్రతి హత్య వెనుక కేవలం పరువే కాదు, అంతకంటే మిన్నగా జెండర్ కోణం వుంటుంది. స్త్రీ ఒక మనిషిగా కాక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిగత ఆస్తిలా భావించబడే లైంగిక వివక్ష వుంటుంది. ఆమె ప్రేమించినవాడో లేదా పెళ్లాడినవాడో తమ ఆస్తిని తన్నుకుపోతున్నవాడిలా కనబడతాడు. అందుకే ఇలాంటి కేసుల్లో ఆమె ప్రేమించిన, పెళ్లాడినవాడే హత్య చేయబడతాడు. నిచ్చెనమెట్లల్లో అట్టడుగున వుండేది దళితులే కనుక వారే హత్యకి గురవుతుంటారు. ఇది వాస్తవం. కనుకనే కులం ప్రమాదకరం, ప్రాణాంతకమనే స్పృహ అట్టడుగున ఉన్న బాధితులకే ఎక్కువ వుండాలి. వారే ఎక్కువ అప్రమత్తంగా వుండాలి. మంథని మధుకర్, మిర్యాలగుడ ప్రణయ్, సూర్యాపేట కృష్ణ… ముగ్గురి జీవితాలే ఇందుకు ఉదాహరణ. అలాగని వారు నిచ్చెనమెట్లలో పైనున్న కులాల యువతులను వివాహం చేసుకోవద్దని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పై కులాల్లో ఉన్న ఉన్మాదులను నమ్మకూడదు.
హంతకులు దాష్టీక కులాలకి చెందినవారు కాకపోవడంతో “కుల/మత ఆధారిత సేనలు/వాహినులు” హంతకులకు మద్దతుగా లేవు. రిజర్వేషన్ల మీద దాడులూ లేవు.
పోలీసులు ఇవాళ ఆరుగురు హంతకుల్ని అరెస్ట్ చేశారు. హత్య జరిగినప్పటి నుండి తన కుటుంబ సభ్యులే కృష్ణని చంపారని భార్గవి మొత్తుకుంటూనే వున్నది. ఆమె అంటున్నదే నిజమైంది. ప్రణయ్ హత్యానంతరం అమృత ఎంత స్థిరంగా, నిర్భయంగా ఉన్నదో కృష్ణ హత్యానంతరం భార్గవి కూడా అంతే స్థిరంగా, నిర్భయంగా ఉన్నది. ఇద్దరూ కూడా తమ పుట్టిళ్లతో కాకుండా కడుపుకోతని ఎదుర్కొంటున్న తమ భర్తల కుటుంబాలతోనే కలిసి ఉంటామని ప్రకటించారు. ఇద్దరూ బలహీనతలకు లోనుకాకుండా పోరాట దృక్పథాన్ని ప్రదర్శించారు. ఇది వారి నిజాయితీని సూచిస్తున్నది. ఈ తరం ప్రదర్శించే ప్రత్యామ్నాయ ప్రగతిశీలతకి వారిద్దరూ ఉదాహరణలు.