ఒక్క సంవత్సరం తాము పండించిన ధాన్యానికి తామే ధర నిర్ణయించుకుంటామని రైతులు అంటే ఈ ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తాయా?
***
ఆ ఘోరం జరిగిన 9 రోజులకి అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంఘటనికి బాధ్యులుగా గుర్తించబడిన మిగతా అందరి కంటే ఆయన పాత్రే నిస్సందేహంగా పెద్దది. తన వంటి మాస్ స్టార్ సెలబ్రిటీ తగిన జాగ్రత్తలు లేకుండా బహిరంగంగా బైటకి వస్తే పబ్లిక్ ఎంతగా డిస్టర్బ్ అవుతుందో తెలియనంత అమాయకుడు కాదు. అప్పటికే ఏపీ ఎన్నికల సందర్భంగా ఆయనకొక చేదు అనుభవం వున్నది. విదేశీ గడ్డల మీద కూడా అంతర్జాతీయ క్రికెట్ మాచెస్లో విదేశీ ఆటగాళ్లు ‘తగ్గేదేలే” అనే మేనరిజం ప్రదర్శిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారంటే, ప్రధాని మోడీ కూడా “శ్రీవల్లి” పాటకి డాన్స్ చేస్తున్నట్లు మీంస్ క్రియేట్ చేశారంటే, దేశం మొత్తంలోని అన్ని “సినిమా వుడ్స్”లోనూ అత్యధికంగా 300 కోట్ల రూపాయిలు పారితోషికంగా తీసుకుంటున్నాడంటే… తాను ఏ స్థాయిలో పాపులరో, తానో మామూలు థియేటర్లో ప్రత్యక్షం ఐతే జనం ఎంత విరగబడతారో అల్లు అర్జున్ కి తెలియదా? తనని చూడటానికి జనంలో తొక్కిసలాట జరగాలని, ఓ మనిషి ప్రాణం పోవాలని, ఎందరో గాయపడాలని ఆయన కోరుకోకపోవచ్చునేమో కానీ బాధ్యతగా ఆలోచించి వుంటే ఆ దారుణం జరిగేదే కాదు. ఆ బాధ్యతారాహిత్యమే ఆయన చేసిన నేరం. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, పోలిసు వైఫల్యం కూడా ఖచ్చితంగా వున్నాయి. థియేటర్ యాజమాన్యం పోలిసులకు అల్లు అర్జున్ రాక గురించి ముందుగా సమాచారం ఇచ్చామంటున్నారు. సమాచారం ఇస్తే సరిపోతుందా? పోలీసులు తగినంత భద్రత కల్పించకపోతే అదే సమాచారం అల్లు అర్జున్ కి తెలియచేసి అతని రాకని నిరోధించి వుండొచ్చు. ఆ పని వారు చేయలేదు. కనుక వారి మీద క్రిమినల్ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఓ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లున్నారు. పోలీసులేమో తమకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటున్నారు. ఒకవేళ వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వున్నా కూడా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ల నైతిక బాధ్యత లేకుండా పోదు. తన భద్రతకి బాక్సర్లను పెట్టుకునే హీరో గారికి తనని చూడటానికి వచ్చే సామాన్య జనం పట్ల కన్సర్న్ వుండొద్దా? నిశ్శబ్దంగా సినిమా చూసి పోక థియేటర్లోకి వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేప్పుడు తన వాహనం సన్ రూఫ్ నుండి ప్రేక్షకులకు అభివాడం చేశాడాయన. ఆయన భద్రతా సిబ్బంది దారి కోసం జనాల్ని తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. భారీగా అభిమానులున్నారని, వెనక్కి వెళ్లాలని పోలీసులు చెప్పినా వినకుండా థియేటర్లోకి వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించి నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన అతన్ని ఎందుకు చట్టం నుండి మినహాయించాలి?
అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అనే పురస్కార గ్రహీత ఐన కారణంగా ఆయన అరెస్ట్ అన్యాయం అని కొందరు వాపోతున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. జాతీయ పురస్కార గ్రహీతలకి చట్టాల నుండి మినహాయింపులుంటాయా? ఇది చాలా అన్యాయమైన వాదన. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఐన మోహన్ బాబు మీద హత్యా యత్నం కేసు పెట్టారు. జాతీయ పురస్కారం ప్రకటించబడిన జానీ మాస్టర్ కూడా కేసులు ఎదుర్కొంటున్నాడు. ఆయనకి ప్రకటించిన పురస్కారాన్ని రద్దు చేశారు. పివి నరసింహారావు అంతటివాడే కోర్టు బోనులో నిందితుడిగా నిలుచున్నారు. ఏమిటి అల్లు అర్జున్ ప్రత్యేకత, గొప్పతనమూనూ? అభిమానులలో ఉన్మాదాన్ని నింపే సంఘ విద్రోహ శక్తుల కథల్ని ఉత్తేజభరితంగా చూపించే చిల్లర హీరో పాత్రల్ని వేసే వాడేగా అల్లు అర్జున్? మోహన్ బాబు, అల్లు అర్జున్ వంటి వారి దగ్గర నుండి పురస్కారాల్ని వెనక్కి తీసుకోవాలి. జానీ మాస్టర్ కి ఒక న్యాయం, అల్లు అర్జున్ కి ఒక న్యాయమా?
ఊరేగింపుల్లో, ప్రముఖుల మీటింగుల్లో తొక్కిసలాటలు సహజమేనని, కొంతమంది చనిపోతే ఆ ప్రముఖుల్ని ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నారు అల్లు వారి సమర్ధకులు. నిజమే అందరికీ స్వేచ్ఛగా కదిలే ప్రజాస్వామిక హక్కుంటుంది. సరైన సమాచారం లేకుండా సీబీఎన్, జగన్, రేవంత్ వంటి పొలిటిషియన్లు ప్రజల్లోకి వస్తారా? అల్లు అర్జున్ మామూలుగా సినిమా చూసి వెళ్లిపోలేదు. అంత ఇరుకైన ప్రదేశంలో ఓపెన్ టాప్ జీప్ నుండి జనాల్ని పలకరించడం అనుమతి లేని ర్యాలీ కిందకే వస్తుంది. ఐనా సినీ నటులకు వుండే క్రేజ్ రాజకీయ నాయకులకు వుండదు. మొన్న బెజవాడ వరదల్లో సిబిఎన్ తిరగ్గలిగినట్లు పవన్ కళ్యాణ్ తిరిగారా? సహాయక చర్యల సందర్భంగా ఆయనే తానెందుకు బైటకి రాలేదో స్వయంగా చెప్పాడు కదా!
అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే బీజేపీకి, బీఆరెస్, వైసీపి కి ఏమిటి అభ్యంతరం? ఆ అరెస్టుని వ్యతిరేకించడం ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు వీళ్లు? ఎంత దుర్మార్గమైన రాజకీయ వైఖరి ఇది! ఏం సినిమా హీరోలు చట్టాలకు అతీతులని ఈ పాలక వర్గ పార్టీల అభిప్రాయమా?
అసలెందుకు అల్లు అర్జున్ మీద సానుభూతి? ఆయనేమైనా సంఘ సేవ చేస్తున్నాడా? దేశానికి మేలు చేసే కార్యక్రమాల్లో వున్నాడా? బాలకృష్ణ “అన్ స్టాపబుల్” కార్యక్రమంలో డబ్బు మీద తన దృక్పథాన్ని ఎలా వివరించాడో మీకు గుర్తున్నదా? “నా దగ్గర డబ్బులున్నాయి కదాని ఒక పది రూపాయిల చాక్లెట్టుని వంద రూపాయిలు పెట్టి కొనను” అన్నాడాయన ఆ షోలో. కానీ అతను రెండు వందల రూపాయిల టిక్కెట్టుని పన్నెండు వందలకి అమ్ముకునే దురాశ బాచ్ కి లీడర్. అది నిర్మాతకి వెళుతుందని అమాయకంగా వాదించకండి. రిటర్న్స్ లో పెద్ద హీరోలకి వాటా వుంటుంది. అందుకే తమ డొల్ల సినిమాలకి ఓవర్ హైప్ ఇచ్చే మోసగాళ్లు మన సినిమా హీరోలు! ఓ నాలుగొందల కోట్ల ఖర్చుతో తీసే సినిమాలో మూడొందల కోట్ల ఖర్చు ఆయన పారితోషికానికే అవుతుంది. ఒక సినిమా ఖర్చులో మూడొంతులు పారితోషికాలకే ఖర్చవుతుంటే అది భారీ సినిమాగా చూపించి, ప్రభుత్వ ప్రత్యేక అనుమతుల ద్వారా టికెట్ల రేట్లని నాలుగు రెట్లు ఎక్కువకి అమ్ముకునే డబ్బు పిశాచులు కాదా మన అగ్ర హీరోలు? అల్లు అర్జున్ కూడా ఆ తానులో గుడ్డముక్కే కదా!
మృతురాలి కుటుంబానికి హీరోగారు పాతిక లక్షలు పరిహారం ప్రకటించినా కేసు విషయంలో తగ్గని మృతురాలి భర్త ఇప్పుడు అల్లు అర్జున్ని క్షమించి కేసు నుండి అతన్ని మినహాయించాడట. ఏం జరిగి వుంటుందో మనం వూహించలేమా? ఇప్పటికే హాస్పిటల్లో వున్న అతని కుమారుడికి ఏమైనా జరిగితే పరిహారం మరింత పెరగొచ్చేమో! డబ్బుతో ఏమైనా కొనవచ్చులే. అన్నట్లు ఈ నెగెటీవ్ ప్రచారం కూడా సినిమాకి మరిన్ని కాసులు కురిపించొచ్చు.
“అసలు టికెట్ల రేట్ల మీద ప్రభుత్వానికి అజమాయిషీ వుండకూడదు. ఇష్టం వున్నవాడే చూస్తాడు. లేనివాడు మానేస్తాడు” అని అర్జీవి వంటి దగుల్బాజీలో లేదా హీరోల కట్టప్పలో వాదనలూ చేస్తుంటారు. వ్యాపారస్తుల ధనాశకి కళ్లెం వేసి సామాన్యులు దోపిడీకి గురి కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది. ఇది మద్యం అమ్మకాలు వంటి వ్యసన రంగానికి, సినిమా వంటి వినోద రంగానికి ఖచ్చితంగా అన్వయించాలి. సెన్సార్ బోర్డ్ ఎంత ముఖ్యమో టికెట్ల ధరల మీద నియంత్రణ కూడా అంతే ముఖ్యం. అసలు ప్రభుత్వాలు ధరలు పెంచుకోడానికి అనుమతివ్వడమే అన్యాయం. ఈ హీరోలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలకు మద్దతివ్వక పోతారా అనే ఆలోచన ప్రభుత్వాన్ని నడిపే వారిలో వుండొచ్చు. కంటెంట్ పరంగా కాక హీరోల పారితోషికానికే డబ్బులెక్కువ ఖర్చు పెట్టి తమది భారీ బడ్జెట్టంటే ఎలా? అసలు సినిమాల ద్వారా ఏ సామాజిక ప్రయోజనానికి పూనుకుంటున్నారు ఈ భారీ బడ్జెట్ నిర్మాతలు? సినిమా వ్యాపారమే. కాదనడానికేం లేదు. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు టికెట్ల అధిక రేట్ల ద్వారా జనం సొమ్ముని లూటీ చేయమని చెప్పడానికసలు ప్రభుత్వానికేం అధికారం వుంది? ఒక్క సంవత్సరం తాము పండించిన ధాన్యానికి తామే ధర నిర్ణయించుకుంటామని రైతులు అంటే ఈ ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తాయా? ఈ సినిమా అధిక రేట్ల విషయమై ఎవరో హైకోర్టుకి వెళితే “అవునా? రేట్లు అంతగా పెంచారా?” అని ఆశ్చర్యపోయిన హైకోర్టు తదుపరి విచారణని ఈ నెల 17కో, 18కో వాయిదా వేసింది. అంటే అప్పటికి అధిక రేట్లు దాదాపుగా తగ్గిపోతాయి. సినిమాని కూడా చాలామంది చూసే వుంటారు. నిర్మాతలు, హీరో ప్రజల నుండి దండుకోగలిగినంత దండుకుంటారు. ఈ కేసులో కోర్ట్ వ్యవహరించిన తీరు కూడా అంతుపట్టడం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుంది.
సినిమా రంగానికి చెందిన ప్రముఖులు డబ్బిస్తే చాలు ఎంత చెత్త సరుకుకైనా, దివాలా తీసే సంస్థకైనా ప్రచారం చేసి పెడతారు. ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు వీరి మాటలు నమ్మి బోలెడంత డబ్బు, ఆస్తి కోల్పోయి బికారులయ్యారు. ఉదాహరణకు మహేష్ బాబు ప్రచారం చేసిన విజయవాడ దగ్గరలోని రియల్ ఎస్టేట్ వెంచర్ రామకృష్ణ వెనూజియాలో 40, 50, 60 లక్షల పెట్టుబడులు పెట్టి తమ కుటుంబాల్ని కొల్లేరు చేసుకున్న వారు వందలమంది వున్నారు. డైరెక్టర్ కె.విశ్వనాథ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విపరీతంగా ప్రచారం చేసిన ఓ స్థిరాస్థి సంస్థ వల్ల కూడా ప్రజలు నష్టపోయారట. ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలే. ప్రభుత్వం హీరోల దురాశని కట్టడి చేసేందుకు పూనుకోవాలి. తాము ప్రచారం చేసిన ఉత్పత్తులకు, సంస్థలకు తామే పూచీపడేలా చేయాలి. తమ ప్రచారం వల్ల ప్రజలు నష్టపోతే ఈ హీరోల్ని బాధ్యుల్ని చేయాలి.
***
సంధ్య థియేటర్ ఘోర సంఘటన అభిమానులకు కూడా కనువిప్పు కావాలి.