సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటి శ్రేయ ధన్వంతరితో పాటు టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తదితర సినీ ప్రముఖులు సెన్సార్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. మలయాళ సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు జానకి అని ఉండటం వల్ల అది సీతా దేవికి మరో పేరు అని ఆ పేరు తొలగించాలని సెన్సార్ బోర్డు కోరింది.
దీంతో, సెన్సార్ బోర్డును తప్పుబడుతూ పలువురు విమర్శలు గుప్పించారు. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఫిలింమేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ… కథలు రాసేటప్పుడు పురాణాల్లోని పేర్లను ఉపయోగించవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీని గురించి మనం ఆలోచించాలని… బతికున్న వ్యక్తుల పేర్లను పాత్రలకు ఎలాగో పెట్టలేము… ఇక మన పాత్రలకు XYZ, 123, ABC అనే పేర్లు పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు మహారాష్ట్రలో ఉంటుందని… అక్కడ కూర్చున్న వారికి హిందీ సరిగా అర్థంకాదని… దీంతో కొన్ని పదాలను వారు తప్పుగా అర్థం చేసుకుని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంటారని చెప్పారు.