NEET పీజీ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.. పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15న జరగనున్న నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనికి బదులుగా, పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది..జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎస్ఈబీ వినిపించిన వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని అభిప్రాయపడింది.
NEET పీజీ అనేది భారతదేశంలో వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా అనేక వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను ఎన్‌బీఈ నిర్వహిస్తుంది. దీని ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు, సీట్లు కేటాయించబడతాయి. ఈ ఏడాది, నీట్ పీజీ 2025 పరీక్షను జూన్ 15న నిర్వహించి, జులై 15న ఫలితాలు ప్రకటించాలని ఎన్‌బీఈ ప్రకటించింది..గతంలో నీట్ పీజీ 2024 పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించారు. ఈ రెండు షిఫ్ట్‌లలో వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండడం వల్ల, ఒక షిఫ్ట్‌లోని ప్రశ్నలు సులభంగా, మరొక షిఫ్ట్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విభిన్న కఠినత స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎన్‌బీఈ నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగించింది. అయినప్పటికీ, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ పారదర్శకత లేకపోవడం, స్కోర్లలో అసమానతలు రావడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా, చాలా మంది విద్యార్థులు తమ ర్యాంకులు ఊహించిన దానికంటే తక్కువగా వచ్చాయని ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, నీట్ పీజీ 2025ను కూడా రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న ఎన్‌బీఈ నిర్ణయాన్ని విద్యార్థులు, వైద్య సంఘాలు వ్యతిరేకించాయి, కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్న NBE, ఫలితాలను జూలై 15లోపు విడుదల చేయనున్నట్లు తెలిపింది.