ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ గెలుచుకుంది. శనివారం ఫిలిప్పీ చార్టర్ కోర్టు వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో రెండో సీడ్ గాఫ్.. 6-7 (5/7), 6-2, 6-4తో టాప్ సీడ్ అరీనా సబలెంకపై విజయం సాధించి తన కెరీర్‌లో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచ నెంబర్ 1, 2 మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో తొలి సెట్ ఓడినప్పటికీ తర్వాత పుంజుకున్న ఈ అమెరికా అమ్మాయి.. 2015లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ నుంచి ఈ టోర్నీలో విజేతగా గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో గాఫ్.. మొదటి సెట్ ఆరంభంలో కాస్త వెనుకబడ్డా తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. సబలెంక జోరుతో 4-1తో వెనుకబడ్డ ఆమె.. ఆ సెట్‌ను 6-7తో ముగించడంతో టైబ్రేక్‌కు దారితీసింది.
టైబ్రేక్ మొదట్లో 4 పాయింట్లు గెలిచినా.. సబలెంక తర్వాత పుంజుకోవడంతో గాఫ్‌కు నిరాశ తప్పలేదు. కానీ రెండో సెట్ నుంచి దూకుడు పెంచిన ఆమె.. ఆ సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. 32 నిమిషాల్లోనే ముగిసిన రెండో సెట్‌లో వెనుకబడ్డ సబలెంక.. ఆ తర్వాత మ్యాచ్‌పై పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. గాఫ్ జోరుతో ఆమె పదేపదే తన కోచింగ్ సిబ్బంది వైపు చూస్తూ అసహనానికి లోనైంది. మరోపక్క ప్రశాంతంగా ఉంటూ వరుసగా పాయింట్లను రాబట్టిన గాఫ్.. మూడో సెట్‌నూ తన ఖాతాలో వేసుకుని కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది.
2022లో ఇదే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ఓడిన గాఫ్.. మూడేండ్ల తర్వాత మళ్లీ ఇక్కడే ఎర్రమట్టి కోర్టు మహారాణిగా నిలవడం గమనార్హం. ఇక టోర్నీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా నిలిచి సెమీస్‌లో పటిష్ట ప్రత్యర్థి ఇగా స్వియాటెక్‌ను ఓడించిన సబలెంక.. ఫైనల్‌లో మాత్రం గాఫ్ జోరు ముందు తలవంచక తప్పలేదు. మ్యాచ్‌లో 70 అనసవర తప్పిదాలు చేసిన ఆమె.. అందుకు భారీగా మూల్యం చెల్లించుకుంది.