బిహార్ ఓ వ్యక్తి నకిలీ పోలీసు స్టేషన్ ను ఏర్పాటుచేసి ఏడాదిపాటు యథేచ్ఛగా దందాలు చేసిన సంచలన ఉదంతమిది. పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్‌కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీసు స్టేషన్ తెరిచాడు. ఉద్యోగాల ముసుగులో ఆ గ్రామంలోని యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ల అక్రమ నియామకాలు చేపట్టాడు.
స్థానిక యువత నుంచి రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసి.. వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పాడు. వారికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చాడు. వారితో పెట్రోలింగ్, మద్యం అక్రమ రవాణాపై దాడులు వంటివి చేయించాడు.
వచ్చిన డబ్బులో సగం తాను తీసుకొని.. మిగతా సగాన్ని తన కింది ఉద్యోగులకు రాహుల్ పంచేవాడు. అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని.. లంచాలు తీసుకుని వాటిని మరలా వారికే ఇచ్చేసేవాడు. దాదాపు ఏడాదిపాటు ఇలా నకిలీ పోలీసుల ఆగడాలు సాగాయి. ఎట్టకేలకు గుట్టు బయటపడటంతో రాహుల్ పరారయ్యాడు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని
పోలీసులు తెలిపారు.