అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే అగ్రరాజ్యంలోని భారతీయ విద్యార్థులతోపాటు అమెరికాకు వెళ్లాలనుకునేవారికి సైతం వెన్నులో వణుకు పుట్టక తప్పదు. అమెరికాలోని ఎయిర్ పోర్టులో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు. అమెరికాలోని న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం దిగిన ఓ భారతీయ యువకుడ్ని ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి దారుణంగా హింసించారు.
ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే ఎన్ఆర్ఐ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. హృదయ విదారకంగా భావించానని.. ఇది ఒక మానవ విషాదం అని ఎక్స్‌లో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు షాక్ కు గురవుతున్నారు. అమెరికాలో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఈ ఘటన జూన్ 2025లో జరిగినట్లు తెలుస్తోంది, మరియు ఇది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై ఆందోళనలను మరింత పెంచింది. అయితే, ఈ సంఘటనకు సంబంధించి అధికారిక వివరాలు లేదా భారత రాయబార కార్యాలయం నుండి స్పష్టమైన ప్రకటన ఇంకా అందుబాటులో లేదు.