పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సైన్యం తిప్పికొడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ లోని టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇరాన్.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ పై క్షిపణులతో దాడులు చేపట్టింది.
ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. జూన్ 14న ఇరాన్ పై క్షిపణులతో దాడులు చేపట్టింది ఇజ్రాయెల్. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి.
ఇరు దేశాల మధ్య పోరు భీకరంగా నడుస్తున్న నేపథ్యంలో ఇరాన్ లోని భారత దౌత్య కార్యాలయం ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను ప్రకటించింది. ఇరాన్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అనవసర ట్రావెల్స్ చేయొద్దని తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అత్యవసర ఫోన్ నెంబర్స్ +98 9128109115, +98 9128109109 ను ప్రకటించింది.
ఇరాన్ లోని ప్రజలు ఎప్పటికప్పుడు భారత దౌత్యకార్యాలయం, విదేశాంగ శాఖ ఎక్స్ అకౌంట్స్ ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపింది. స్థానిక అధికారులు ఇచ్చిన ప్రొటోకాల్ ప్రకారం ఇరాన్ లోని భారతీయ పౌరులు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో భాగంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లోని టార్గెట్ చేసిన అణు కేంద్రాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఇరాన్ లోని రక్షణశాఖ అధికారిక కార్యాలయంపైనా దాడులు చేపట్టినట్లు తెలిపింది. ఆయుధాల ఫ్యాక్టరీలను వదిలి వెళ్లాల్సిందిగా ఇరాన్ కు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆదేశాలు ఇచ్చింది.