గోల్కొంట కోటలో బోనాలు మొదట ప్రారంభించే సంప్రదాయం కులీకుతుబ్‌షా కాలం నుంచి వస్తుంది. అప్పట్లో కులీకుతుబ్‌షా నిర్వహించగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేస్తుంది. బోనాలు ఉత్సవాలకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీజగదాంభిక ట్రస్టు బోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టింది.
నెలరోజుల జాతర
గురువారం నుంచి జూలై 24వతేదీ వరకు తెలంగాణలో బోనాల జాతర జరుగనుంది. నెలరోజుల పాటు ఇక్కడ తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. వీరికోసం గోల్కొండ కోటలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు, బాడిగార్డ్స్ లైన్స్ ప్రాంతాలు సిద్ధం చేస్తున్నారు.
లంగర్‌హౌజ్ నుంచి తొట్టెల ఉరేగింపు
పూజల ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. చోటాబజార్‌లోని ఆలయం పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘట్టం ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇవన్నీ గోల్కొండ కోటపైకి చేరిన తర్వాత ఆలయం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, బోనం అమ్మవారిక సమర్పిస్తారు.
ఆది, గురువారం ఎంట్రీ ఫ్రీ
కోటలో బోనాల జాతర జరుగనుండడడంతో గోల్కొండ కోట పాలన చూస్తున్న కేంద్ర పురావస్తు శాఖ పలు మార్పలు చేయనుంది. బోనాలు జరిగే ఆదివారం, గురువారం రోజుల్లో ఉచిత ప్రవేశం కల్పించారు. కోటలో ప్రతీ రోజు రాష్ట్ర పర్యాటక సంస్థ రెండు లైట్ అండ్ సౌండ్ షోలు నిర్వహిస్తుంది. ఆదివారం, గురువారాలు మొదటి షోను రద్దు చేస్తారు. రెండవ షో 8 గంటల నుంచి యధావిధిగా ఉంటుంది.
సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలో..
బోనాలు సంప్రదాయం ప్రకారం ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో ప్రారంభం కావడం ఆనవాయితీ. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో ఆమావాస్య తర్వాత వచ్చే గురువారం, లేదా ఆదివారం బోనాలు ప్రారంభవవుతాయి. అయితే, ఈ నెల బుధవారం అమవాస్య కావడంతో ఆ తర్వాత రోజు గురువారం బోనాల జాతర మొదలుకానుంది.
బోనాల షెడ్యూల్డ్ ఇదీ..
జూన్ 26న మొదటి పూజ
జూన్ 29న రెండవ పూజ
జూలై 3న మూడవ పూజ
జూలై 6న నాల్గవ పూజ
జూలై 10న ఐదవ పూజ
జూలై 13న ఆరవపూజ
జూలై 17న ఏడవ పూజ
జూలై 20న ఎనిమిదవ పూజ
జూలై24న తొమ్మిదవ పూజ