హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఒక బస్సులో మహిళా కండక్టర్, ఓ ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బస్సు ఎక్కడపడితే అక్కడ ఆపలేమని కండక్టర్ చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ప్రయాణికురాలు, బస్సు దిగిన తర్వాత కండక్టర్‌పై బూతులు తిడుతూ పిడిగుద్దులతో దాడి చేసింది. ఈ ఘటన అక్కడి ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. దీంతో ఆర్టీసీ సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల్లో రద్దీ పెరిగి, బస్సుల మధ్య సరైన సమన్వయం లోపించడం ఈ దాడులకు ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బస్సుల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటం, మహిళలు సీట్ల కోసం వాదులాడుకోవడం, దీనిపై కండక్టర్లు జోక్యం చేసుకోవడం వంటివి కూడా ఈ సంఘటనలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం, ఆర్టీసీ కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. అలాగే, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు భవిష్యత్తులో ఇలాంటి పనులకు పాల్పడకుండా ఒక హెచ్చరికగా ఉంటుంది. బస్సులలో భద్రతను పర్యవేక్షించడానికి మార్షల్స్ వంటివారిని నియమించడం కూడా ఒక పరిష్కారంగా చెప్పుకోవచ్చు.


