ముంబయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల (Mumbai Rains) కారణంగా రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) ముంబయికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 250కి పైగా విమానాలు (Flight Affected by Rains) ఆలస్యమయ్యాయని లేదా రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 9:50 గంటల మధ్య 8 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు, సగటున 45 నిమిషాల ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసి, సంబంధిత వెబ్సైట్లలో విమాన సమయాలను తనిఖీ చేయాలని సూచించింది.
ఇండిగో, స్పైస్‌జెట్, అకాసా ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. వరదలతో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయల్దేరాలని సూచించాయి. రైల్వే పట్టాలు నీటమునిగిన కారణంగా ముంబయి లోకల్ రైళ్లు కూడా రద్దయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేయాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) విజ్ఞప్తి చేసింది.
గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. విఖ్రోలి ప్రాంతంలో అత్యధికంగా 255.5 మి.మీ. వర్షం కురిసినట్లు IMD తెలిపింది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


