కర్ణాటకలోని చిత్రదుర్గంలో జరిగిన డిగ్రీ విద్యార్థిని వర్షిత (19) హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు దిగ్భ్రాంతికరమైన మలుపులు తిరుగుతోంది. జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్ బండారు శుక్రవారం (ఆగస్టు 22, 2025) వెల్లడించిన సమాచారం ప్రకారం, వర్షిత హత్య సమయంలో ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. నిందితుడు చేతన్ (21), చిత్రదుర్గానికి చెందినవాడు. అతను కొప్పళ జిల్లా గంగావతిలో ఒక నెట్‌వర్కింగ్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని పని ఉపాధి కోరుకునే వారిని సంస్థకు పరిచయం చేయడం.
ఏడాది క్రితం చేతన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ సంబంధిత వివరాలు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన వర్షిత అతన్ని సంప్రదించింది. ఇలా వారి పరిచయం ప్రారంభమైంది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వారు పట్టణ వీధుల్లో కలిసి తిరుగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సంతోషంగా గడిపారు. అయితే, ఈ ప్రేమ ఆమెకు శాపంగా మారింది. వర్షిత తన గర్భం గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయింది. వారం క్రితం ఆమె హిరియూరులోని తన పినతల్లి ఇంటికి వెళ్లి సహాయం కోరింది. పినతల్లి చేతన్‌ను సంప్రదించి, వర్షితను వెంటనే పెళ్లి చేసుకోవాలని హెచ్చరించింది.
ఈ సమయంలో వర్షితకు చేతన్‌కు ఒక తీవ్రమైన వ్యాధి ఉన్న విషయం తెలిసింది. దీంతో ఆమె కలత చెందింది. చేతన్‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో పాటు, వర్షిత మరొకరితో సన్నిహితంగా ఉందనే అనుమానం కూడా అతనిలో బలపడింది. ఈ నేపథ్యంలో చేతన్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు. ఆగస్టు 18న మాయమాటలతో వర్షితను బైపాస్ మార్గంలోని ఒక హోటల్ వద్దకు రప్పించి, అక్కడ ఆమెను హత్య చేశాడు. ఆనవాళ్లు లేకుండా చేయడానికి ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ వివరాలను గుర్తించారు.
శుక్రవారం చేతన్‌ను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి మహజరు నిర్వహించారు. వర్షిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.


