దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జైన మతపరమైన ఆచారంలో భాగంగా ఉపయోగించిన అమూల్యమైన కలశం దొంగతనం జరిగింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2న చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బంగారం, వజ్రాలతో పొదిగిన ఈ కలశం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమానికి హాజరైన సమయంలోనే ఈ ఘటన బయటపడింది. వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ పూజ కోసం కలశాన్ని తీసుకువచ్చేవారని సమాచారం. కలశం మొత్తం 760 గ్రాముల బంగారంతో తయారు చేయబడింది. దానిపై సుమారు 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు అమర్చబడ్డాయి. ఇంత విలువైన వస్తువు దొంగతనం కావడంతో పెద్ద కలకలం రేగింది.
సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడి కదలికలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు నిందితుడిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. త్వరలోనే అరెస్ట్ చేసి, దొంగిలించిన కలశాన్ని స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. జైన సమాజం ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతున్న కలశ పూజలో(Kalasha Puja) ఈ దొంగతనం జరగడం ప్రత్యేక ఆందోళన కలిగించింది. ఇంతకుముందు కూడా ఎర్రకోట భద్రతపై ప్రశ్నలు లేవాయి. ఆగస్టు 2న స్వాతంత్ర్య దినోత్సవ రిహార్సల్ సందర్భంగా భద్రతా లోపాలు బయటపడిన విషయం తెలిసిందే. అప్పుడు మాక్ డ్రిల్‌లో ఉంచిన నకిలీ బాంబును పోలీసులు గుర్తించలేకపోవడంతో సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు విలువైన కలశం దొంగతనం జరగడం భద్రతా లోపాలపై మరోసారి దృష్టిని ఆకర్షించింది.


