ఫెంగ్ అంటే గాలి. ష్వె అంటే నీరు. ఈ రెండూ సమృద్ధిగా ఉండే పరిసరాలలో ఇంటి నిర్మాణాల గురించి చెప్పే ఒక శాస్త్రం ఫెంగ్ ష్వె. ఇది చైనా ‘వాస్తు’ అనుకోవచ్చు. మనం సినిమాలలో, వార్తల్లో తూర్పు దేశాల ఇంటి నిర్మాణాలు – బాహ్యంగా ప్రత్యేక ఆకారాలలో ఉండటం గమనించవచ్చు. అవి ఈ వాస్తు విధానం ఆధారితంగా నిర్మించినవే.
ఇక్కడ మన వాస్తుశాస్త్రం లాగే ఫెంగ్ ష్వె కూడా పురాతనమైనది. 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పురాతన శాస్త్రం ప్రకారం – ఇంటిని, ఇంట్లో వస్తువులని సరైన పొజిషన్లలో ఉంచడం వల్ల, ఇంటి యజమాని యొక్క అదృష్టం మారుతుందని, ఆ ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా, అన్ని విషయాలలోనూ అభివృద్ధి సాధిస్తారని నమ్ముతారు.
ఈ శాస్త్రం Yin-Yang ఫిలాసఫీ పై ఆధారపడి ఉంటుంది. యాంగ్ – పురుష స్వభావం కలిగి ఉంటే, యిన్ – స్త్రీ స్వభావం కలిగి ఉంటాయని, అన్ని జీవరాశులకి యిన్, యాంగ్ అనే శక్తులే బాధ్యత వహిస్తాయని, ఈ రెండు శక్తుల కలయిక వల్ల ‘ఛి’ అనే ఎనర్జీ ఉత్పన్నం అవుతుందని ఈ ఫిలాసఫీ చెబుతుంది.
ఈ ‘ఛి’ ఎనర్జీని చిన్న చిన్న మొక్కలు, వేలాడే అద్దాలు, కొన్నిరకాల రంగు రాళ్ళు, వెదురుతో చేసిన వస్తువులు ప్రభావితం చేస్తాయని భావించి, వాటిని ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా ఎక్కువగా వాడతారు. ఇంకా, తలుపులు ఏ రంగులో ఉండాలి.. కింద చిత్రంలో చూపినట్టు, ఏ దిక్కు/మూల లలో ఏ పెయింట్ వేయాలి అనేది కూడా ఫెంగ్ ష్వె నిపుణులు చెప్తారు.
ఇక్కడ వాస్తు శాస్త్రజ్ఞుల లాగే, అక్కడ ఈ
ఫెంగ్ ష్వె నిపుణులు — వాతావరణంలో ఈ ఎనర్జీ ప్రసరించే మార్గాలని గుర్తించి ఏది ఎక్కడ ఉండాలో, ఎంత ఎత్తులో, ఎంత పరిమాణంలో ఉండాలో కూడా చెప్తారు. వీళ్ళకు చాలా డిమాండ్ ఉంటుంది. వీళ్ళు ఫీజు కింద వసూలు చేసే డబ్బు కూడా అధిక మొత్తంలో ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు చేయడం ద్వారా, ‘ఛి’ ఎనర్జీ ఆ ఇళ్ళంతా ప్రసరించి, అక్కడ నివసించే వారికి మంచి ఆరోగ్యం, సంతోషం, సంపదలు చేకూరుతాయని ఈ వాస్తు విధానాన్ని పాటించేవారి నమ్మకం.
పెన్న్ & టెల్లర్ అనే ఇద్దరు వ్యక్తులు సూడో సైంటిఫిక్ విషయాలపై ఒక టీవీ షో నిర్వహించేవారు. ఈ షోలో రకరకాల సూడో సైంటిఫిక్ విషయాలని పరిశోధించి, పరీక్షించి అవి నమ్మదగినవా.. కావా.. అనేది నిర్ధారించడం ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించేవారు. అలా వాళ్ళు ఫెంగ్ ష్వె పై నిర్వహించిన ఒక టెస్ట్ లో.. ముగ్గురు ఫెంగ్ ష్వె నిపుణులకి, ఒకే లివింగ్ రూం ఇచ్చి — వాళ్ళని అక్కడ వస్తువుల్ని అరేంజ్ చేయమన్నప్పుడు, “వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ విభిన్నంగా ఉండటం”తో.. ఫెంగ్ ష్వె అనే ఈ విధానానికి ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు అంటూ ఏమీ లేవని, ఇదొక ‘అబద్ధపు సైన్స్’ అని తేల్చింది.
ఈ వాస్తు విధానాన్ని అప్పటి కాలంలో, ముఖ్యంగా రాజకుటుంబీకులు వారి బంధుమిత్రులు మాత్రమే అనుసరించేవారనీ, ఈ శాస్త్రం వారివారి మధ్యే రహస్యంగా ఉంచబడిందని చెప్తారు. కానీ తర్వాతి కాలంలో ఈ శాస్త్రానికి గుర్తింపు పెరిగి – అమెరికా, యూరోప్ దేశాలలో కూడా అనుసరిస్తున్నారు. ఎక్కువగా అనుసరించేది మాత్రం చైనా, జపాన్, కొరియా, థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేసియా వంటి తూర్పు దేశాలలో. మనదేశంలో కూడా అక్కడక్కడ – ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాలలో నివసించేవారు దీనిని పాటిస్తుంటారు. చుట్టుపక్కల పరిసరాలలో గాలి, నీరు వంటివి సరిగా లేకపోతే.. ఇంటీరియర్ డిజైనింగ్ లో ఫెంగ్ ష్వె ని పాటిస్తుంటారు.
పలురకాల సూడో-సైన్స్ లలో ఇదీ ఒకటి. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు సహజంగానే కొన్ని విధానాలు పాటిస్తారు. గాలి, వెలుతురు వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవన్నీ సైన్స్ పరిధిలోకి వచ్చేవే. కానీ ఫెంగ్ ష్వె వంటి శాస్త్రాలు అతీంద్రియ శక్తుల్ని ప్రస్తావిస్తాయి. వాటిని ఎలా నియంత్రించాలో చెప్తాయి. అయితే, ఆ శక్తుల ఉనికిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవు. కేవలం హైపోథెటిక్ వివరణలు మాత్రమే.
పురాతనకాలంలో మొదలైన ఈ అహేతుక శాస్త్రాలు, ఆధునికత సంతరించుకుని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ఇప్పటికీ పాటిస్తుండటం, దీనిని భోధించే నిపుణులకి అధిక డిమాండ్ ఉండటం గమనించాల్సిన విషయం. ఎక్కడి వాస్తు విధానాలలోనైనా శాస్త్రీయతకు చోటు లేదు.. వాటిని ప్రచారం చేయటం వల్ల, వాస్తుని టీచ్ చేసే వాళ్ళకు వ్యాపారం జరుగుతుంది తప్ప మరే ఇతర ప్రయోజనాలూ వాస్తు నమ్మకస్థులకి కలగవు. అశాస్త్రీయతని పెంచి పోషించేవారికీ, పాటించేవారికీ ఒకే కామన్ డ్రైవ్ అది ఏంటంటే “దురాశ”.


