షేక్ మసూద్ బాబా (Sheik Masood Baba) నాకు శివసాగర్ మూలంగా వొనకూరిన జ్ఞాపకం. అవి శివసాగర్ చివరి మజిలీ రోజులు హైదరాబాదులో ఉంటే కొందరి మిత్రుల దగ్గర విశాఖపట్నంలో శివుని చిన్నమ్మాయి శ్రీదేవి, విజయవాడలో మసూద్ బాబా ఇంట్లో. పదిహేను ఏళ్లకింద ఏదో పనిమీద విజయవాడ వెళితే మొగాల్రాజపురం సున్నం బట్టీ సెంటర్ లో ఉన్నా కలువు అన్నాడు. ఆయన కవిత్వ శకలాలను ఒక దగ్గరకు ఏరి కూర్చే క్రమంలో విశాఖలో ఆయన కూతురు ఇంట్లో, విజయవాడలో బాబా ఇంట్లో తరుచూ కలిసేవాణ్ని. కలిసిన ప్రతి సంధర్భం లో ఎన్నో ముచ్చట్లు చర్చల్లో కదిలేవి. గుంబనంగా శ్రద్దగా వింటూ బాబా. నాటి నుండి మసూద్ బాబా శివసాగర్ పోయాక కూడా మిగిలిన ఒక ఘనీభవించిన జ్ఞాపకం. మధ్య మధ్యలో ఎప్పుడయినా కొడుకు ఆజాద్ బిడ్డ అయేషా చదువు గురించో ఆరోగ్యం గురించో మా ఇద్దరి మధ్య మాటలు కలిసేవి. సహకరించని ఆరోగ్యం తో బాబా పంటి బిగువున బ్రతుకుని సాగదీసాడు. అప్పుడప్పుడూ గుండె మొరాయిస్తే ఖమ్మం స్పందన హాస్పిటల్ లో కలవడం. ఎంతో వీరోచితమైన గతాన్ని మోస్తున్నా ఆ తలపుల భారంతోనే పోయాడు తప్ప చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోలేదు. కడదాకా సడలని విశ్వాసాల తోనే బ్రతికాడు. గతం వర్తమానం ఏదీ కాసిన్ని గంజినీళ్ళు కూడా పోయలేదు. కానీ నిలువెత్తు సడలని విశ్వాసాలని జావలాగా తన కుటుంబానికి పోసి సాకాడు. డెబ్బై రెండేళ్ళ బాబా ఈ ఆగస్ట్ ఐదో తారీకున నిశబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.
దేశానికి అధికార మార్పిడీ జరిగాక, ఎన్నికల తంతులో అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం. ఇంటా బయటా, విద్యార్ధి మేధో వర్గం ప్రత్యామ్నాయ సాయుధ రాజకీయాలవైపు చూస్తున్న దశ అది. సిలిగురిలో రాజుకున్న అగ్గి శ్రీకాకుళంలో దావాలం అయ్యింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్య రాజకీయాల కొనసాగింపే అని, తెలంగాణ సాయుధ పోరాట విరమణ పరిణతి లేని అవివేకమమయిన పని అనీ, దాని కొనసాగింపు నక్సల్బరీలో ఉందనీ శ్రీకాకుళ సాయుధ పోరాటానికి సన్నద్ధం అవుతున్న దశలో మైదాన ప్రాంతం నుండి దానికి సంఘీభావంగా వెళ్లిన మొదటి తరం విప్లవ చైతన్యం మసూద్ ది. విజయవాడలో జరిగిన ఒక హత్య కేసులో ఆరోపణలు ఉన్న మసూద్ బ్రతుకు భవిష్యత్ 1969 జనవరిలో ఏజెన్సీలోకి మారింది. ఉద్యమ విస్తరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీకి వెళ్ళిన ఆయన 1970 ఆగస్టులో కడలూరు లో అరెస్ట్ అయ్యా అని చెప్పేవాడు.
నాటి వలసపాలకుల మొదలు నేటి పాలకులదాకా ప్రత్యామ్నాయ రాజకీయాలలో ఉన్న వారిమీద అనేక కుట్ర కేసులు బనాయించారు. మీరట్ కుట్రకేసు మొదలు పెషావర్, కాన్పూర్, లాహోర్, రాంనగర్, సికింద్రాబాద్ దాకా జిల్లాకొక కుట్రకేసు నమోదు అయ్యింది. అందులో పార్వతీపురం కుట్రకేసు అతి పెద్దది . దాదాపు నూటా నలభై మంది ముద్దాయిలు, ఎనిమిది వందల తొంబై ఏడుగురు సాక్షులు గా సుధీర్గ కాలం విచారణ పేరుతో ఆరేళ్ళపాటు కొనసాగిన పార్వతీపురం కుట్రకేసులో నాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆందోళనలో బాగం అయి అరెస్ట్ కాబడిన అనేక మంది మీద బనాయించి నిర్భందించారు.
నాటి విప్లవనాయకులు, చౌదరి తేజేశ్వరరావు, చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి, రవూఫ్ లాంటి ఎంతోమంది మీద కుట్రకేసులు బనాయించారు. నాటి పార్వతీపురం కుట్రకేసులో అనేకమంది నాయకులతో బాటు షేక్ మసూద్ బాబా కూడా అరెస్ట్ అయ్యారు. విచారణ పేరుతో కోరాపూట్, జయపూర్, మల్కన్ గిరి, విశాఖపట్నం, విజయవాడ, బందరు జైల్ లలో దాదాపు ఎనిమిది ఏళ్ళకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన విశాఖ జైలులో శివసాగర్ తో కలిసి జైలు శిక్ష అనుభవించాడు. ఏడెనిమిది ఏళ్ళ నిర్భంధం తర్వాత విడుదల అయిన మసూద్ బాబా ఏ నిర్మాణంలో పనిచేశాడో నేను అడగలేదు. ఆయన చెప్పుకోనూ లేదు. కానీ పందొమ్మిది వందల తొంబై ల దాకా విప్లవ సానుభూతిపరుడిగా ఆ తర్వాత కాలం లో శివసాగర్ తోనే తన రాజకీయ కార్యాచరణ లో ఉన్న ఆయన టాక్సీ నడుపుకుంటూ తనకు చేతనైనంత మేరకు నిర్మాణాలకు సహకరిస్తూ అత్యంత నిరాడంబరంగా బ్రతికాడు. తాను బ్రతకడమే కష్టం అయినా శివసాగర్ ని కలవడానికి వచ్చిన మిత్రులనూ సాకిన ఔదార్యం బాబా కుటుంబానిది. మొన్న ఆగస్ట్ ఐదో తేదీన బాబా ఇక లేడని కబురు. ఆయన డైరీ లో ఉన్న నా ఫోన్ నెంబర్ కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు.
డెబ్బై రెండేళ్ళ సుధీర్గమైన కష్టాలూ కన్నీళ్ళ మధ్య విజయవాడలో చనిపోయిన బాబా పూర్వీకులది గుంటూరు జిల్లా నరసరావు పేట రొంపిచర్ల ప్రాంతం. ఈ దేశ స్వాతంత్రానికి ఉన్న వయసు బాబాది. అమీనాబీ, మస్తాన్ బాబా లకు పందొమ్మిది వందల నలభై ఆరులో పుట్టిన ఆయన కుటుంబం విజయవాడకు వలస వచ్చింది. ఆయన బాల్య యవ్వనాలు విజయవాడలోనే గడిచాయి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణలో రూపుదిద్దుకొన్ని ఆయన చైతన్యం సూర్యారావు పేట బెల్లం శోభనాద్రి గ్రంధాలయం లో సోవియట్ పుస్తకాల్లో బొమ్మలు చూడడానికి వెళ్తూ క్రమంగా కమ్యూనిస్ట్ సాహిత్యం చదవడానికి అలవాడు పడ్డా అని చెప్పేవాడు. పార్వతీపురం కుట్రకేసు నుండి విడుదల అయ్యాక ఖమ్మం జిల్లా తొండల గోపవరం కు చెందిన సౌదామిని తో జరిగిన పెళ్ళికి కొల్లా వెంకయ్య అధ్యక్షుడు. ఆయనకు ఆయేషా,ఆజాద్ ఇద్దరు పిల్లలు.చదివిన కొద్దిపాటి చదువుకి దొరికిన ఉపాధిలో బ్రతుకీడుస్తుంది. శ్రీకాకుళ పోరాటం లో భాగం అయిన బాబా దశాబ్దాల జీవితం విప్లవ కార్యచరణలోనే గడిచింది. జైలు నుంచి వచ్చాక సున్నపు బట్టీ సెంటర్ లో చిన్న కుటీరంలోనే ఉండేవాడు, టాక్సీ ఆయన బ్రతుకు ఆదరువు. అప్పడప్పుడూ ఏదన్నా చెప్పాలి అనిపిస్తే నాకు ఫోన్ చేసేవాడు. రెండేళ్లుగా ఆయననుండి ఏ కబురూ లేదు నిష్క్రమణ గురించి తప్ప. ఆయనొక జ్ఞాపకాల తుట్టె కదిలిస్తే ఎన్ని పేజీల లోనయినా నింపగల నిండైన నిలువెత్తు ఆదర్శం.
ఆరేళ్ళ కింద కందులపాడులో అమరత్వం పొందిన శివసాగర్ మృతదేహాన్ని విజయవాడ బాబా ఇంటికే తరలించారు. కందులపాడులో కానీ, బాబా ఇల్లుకానీ కనీసం నలుగురు కూర్చొనే అంతస్థలం కూడా సంపాదించుకోలేని బ్రతుకులు వాళ్ళవి. సందర్శకుల సౌకర్యార్ధం విజయవాడ కృష్ణాజిల్లా స్వతంత్ర సమరయోధుల భవనంకు తరలించిన శివసాగర్ అంతిమ యాత్ర లో చూడడం మినహా ఆయన గురించి ఇంకే సమాచారమూ లేదు. డెబ్బై ఏళ్ళ వొడుదుడుకుల, వొత్తిడి జీవితాన్ని భరించిన బాబా గుండె, ఊపిరితిత్తులు మొరాయించాయి. దశాబ్దాల ఉద్యమ నేపధ్యం ఉన్న బాబా రాజకీయ జీవితం వాళ్ళ నాన్న ఫోటో లాగానే అదృశ్యం అయ్యింది. ఆయన పోరాటం లో ఉన్న కాలంలో తరచూ పోలీసుల దాడుల మధ్య బాబా కుటుంబ సభ్యులు బాబావి ఆయన తండ్రివి ఫోటోలు కాల్చి వేసారు. శత్రువుకి ఏ ఆధారాలూ దొరకకూడదు అని ఇంట్లో వాళ్ళు ఆపని చేసారు. “మా తాత ఎలా ఉంటాడో కనీస ఆధారం మాకు లేదు” అనేది బాబా బిడ్డ ఆయేషా, ఆయేషా తాత తండ్రుల చరిత్రకాదు కదా వాళ్ళ బ్రతుకు ముద్రలూ ఎప్పుడో చెరిగిపోయాయి. విజయవాడ మొగల్రాజపురం సున్నం బట్టీ సెంటర్ చుట్టూ అనేక సాహిత్య, రాజకీయ కాల్పనిక గాధలు మన మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో మసూద్ బాబా లాంటి బడుగుజీవుల ప్రస్తావనే ఉండదు.
శివసాగర్ ‘అంబేద్కర్ సూర్యడు’ పుస్తకం దగ్గరుండి దానికి సంబందిచిన పుస్తక సామాగ్రి రాసుకునే వెసులుబాటు కల్పించిన అతి కొద్ది మంది మిత్రులలో బాబా ఒకడు. చిన్న మంచం కూడా పట్టని మూడు గదుల రేకుల గదిలో ఈగల దోమల, కలిమి లేముల మధ్య జీవం పోసుకున్న ఆ పుస్తకం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో బాబా చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. జీవితాంతం నిర్భందాల మధ్య విప్లవ రాజకీయ అచంచల విశ్వాసాల మధ్య గడిచిన బాబా జీవితం శివసాగర్ జీవితం రాజకీయాలతో కలగలిసి నడిచింది. శివసాగర్ రాష్ట్రం లో ఎక్కడ తిరిగినా సున్నం బట్టీ సెంటర్ ఆయన జంగమ స్థావరం గా ఉండేది. సుదీర్ఘమైన స్నేహం వాళ్ళది, గౌరవ పలకరింతలకు స్థానమే లేదు వాళ్ళిద్దరి మధ్య ఆజాద్,ఆయేషా వాళ్ళ తాతను శివసాగర్ లో చూసుకున్నారు. అందుకే కడసారి శివసాగర్ ను బాబా ఇంటికే తరలించారు. వాస్తవానికి బాబా బ్రతికి ఉండగానే ఆయన జ్ఞాపకాలు రాయించి ఉండాల్సింది. అది రాస్తే యాభై ఏళ్ళ నిర్భంధ చరిత్ర అయ్యేది. వైయుక్తిక త్యాగాలను సామూహిక చేతనలో భాగం చేసే క్రమంలో ఎందరో చరిత్రలో కనబడకుండా వినబడకుండా పోయారు. ప్రత్యామ్నాయ విలువలకోసం మహోన్నతమైన పోరాట గమనానికి తమ చెమటనూ నెత్తురునూ సాకబోసి నిశబ్దంగా మాయం అయిపోతున్నారు. భావోద్వేగాలను నిశితంగా, నిష్పాక్షికంగా అక్షరీకరించే పని తెలుగు సమాజాన ఇంకా మొదలే కాలేదు. అది జరగనంత కాలం విప్లవ నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీలలాంటి మసూద్ బాబా లాంటి బ్రతుకు ఆవవాళ్ళు కూడా మిగలవు.
“ప్రజారంగంలో సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి మరణించినప్పుడు సమీక్షలు జరగవలసింది వర్తమానంలో, తక్షణ గతంలో ఉన్న సంఘటనల ఆధారంగా కాదు. మొత్తం జీవితం ఆధారంగా జరగాలి” అని ఒక మేధావి సూత్రీకరణ చేసాడు. విప్లవ కార్యాచరణలో అత్యంత నిష్పాక్షికంగా మానవీయంగా ఉండాల్సిన మేధావి వర్గంలోని అగ్రకుల శక్తులు శివసాగర్ పట్ల తక్షణ గత శల్య పరీక్షలు జరిపి ఆయన ప్రాసంగికతను పాతరపెట్టే పనిచేసింది. ఆ విషాదంలో మసూద్ బాబాలాంటి బడుగుజీవుల బ్రతుకు ఎంత? విప్లవ చరిత్రలో ఇలా కొందరు విస్తాపితులుగా మిగలడమే ఈ కాల విషాదం. ఆయన ఆశయాల కొనసాగింపే ఆయనకు మనమిచ్చే నివాళి. జోహార్ కామ్రేడ్ బాబా .
డా.గుఱ్ఱం సీతారాములు.


