Meditations Book by Marcus Aurelius
Marcus Aurelius ప్రఖ్యాత స్టోయిక్ తత్త్వవేత్తలలో ఒకరు. స్టోయిక్స్ తమపై తాము జీవితం పట్ల కన్సర్న్ కలిగి ఉండేవారు. ఫిలాసఫీకి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు అంతటి పురాతనకాలంలో. ముగ్గురు ప్రఖ్యాతులలో ఒకరైన Epictetus ఇతనికి గురువుగా ఉన్నాడు. మరో ప్రఖ్యాత స్టోయిక్ మరియు ప్రథముడు Seneca.
రాజకుటుంబంలో జన్మించిన మార్కస్ కుటుంబం అత్యంత ఉన్నంతమైంది. ఆ కుటుంబం అప్పట్లో విలువలకి ఇచ్చిన ప్రాధాన్యత, నేడు మన పాలకులు ఏ కాస్త ఇచ్చినా – ప్రజలు ప్రశాంతంగా సుఖజీవనం సాగిస్తారు. పుస్తకం ప్లేటో కొటేషన్, “రాజ్యాలు సంతోషంగా ఉండాలంటే, తత్త్వవేత్తలయినా పాలకులు కావాలి లేదా పాలకులైనా తత్త్వ వేత్తలు కావాలి” తో మొదలవుతుంది.
తన రాజ్యపాలన అత్యంత న్యాయంగా, విధిగా నిర్వర్తించాలని – తన జీవిత కాలంలో ప్రతిరోజూ, తనని తాను మెరుగుపరుచుకునే దిశగా అడుగులేస్తూ, రాత్రి సమయాలలో “తనతో తాను” చేసే కొన్ని ఆధ్యాత్మిక అభ్యాసాలను, ఇన్ సైట్స్ ని ఒక పుస్తకంలో పొందుపరుస్తూ ఉంటాడు. తనకి తాను సలహాలు ఇచ్చుకుంటూ, వాటిని ఒక జర్నల్ లో రాస్తూ ఉండేవాడు. ఈ పుస్తకం ప్రచురించే ఉద్దేశ్యంతో రాయలేదు. మార్కస్ ది అత్యంత పురాతన కాలం(క్రీస్తు శకం 100-200 మధ్యలో)(దాదాపు) అధికారంలో ఉంటాడు. అప్పటికి ఎన్నో అహేతుక విషయాలపై స్పష్టత లేక మూఢనమ్మకాలు ఉండేవి. ఆ కాలంలోనే రోమన్ రాజులు ఇంత గొప్ప వ్యక్తిత్వంతో జీవించడం, రాజ్యపాలన చేయడం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రాచీన పుస్తకం అయినప్పటికీ తక్కువగా చూసే అవకాశం లేదు. పుస్తంలోని పెద్దభాగం నేటికీ మనకు ఉపయోగపడేదే. ఇది ప్రసిద్ధిగాంచిన పుస్తకం కూడా – చాలామంది చరిత్రలో నిలచిన వ్యక్తులపై ఈ పుస్తకం ప్రభావం ఉంది.
మార్కస్ సాధారణంగా – మనిషి ఉనికి, మరణం, సద్గుణాలు, ప్రజలతో సంబంధాలు, హేతువు, విధి వంటి విషయాలపై మాట్లాడతాడు. మొత్తం 12 పుస్తకాలలో – ఒక్కొక్క పుస్తకం కొన్ని అంశాల గురించి ఫోకస్ చేస్తుంది. అన్నిటిలోనూ మార్కస్ తనకు తాను ఇచ్చుకున్న సలహాలు ప్రత్యేకమైనవి. ప్రతి పుస్తకం లేదా అధ్యాయం లోంచి కొంచెం పరిచయం చేస్తూ రాస్తున్నాను. పూర్తిగా పుస్తకాన్ని అధ్యయనం చేస్తే – దీనినుండి చాలా జ్ఞానాన్ని పొందవచ్చు. మార్కస్ తనకి తాను ఇచ్చుకునే సలహాలు, మనమూ పాటించాల్సినవే. మన నిత్య జీవితంలో, సద్గుణాలు(virtues) యొక్క పాత్రని ఈ పుస్తకం చెబుతుంది. ఒరిజినల్ గా గ్రీకులో రాయబడింది. Gregory Hays దీనిని ఇంగ్లీష్ లోకి అనువదించాడు.
పుస్తకం – 1
——————–
మార్కస్ తన జీవితంలో తనని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి చెప్తాడు. తనబాల్యం గురించి, నేపథ్యం గురించి చెప్తాడు. నిష్కల్మషంగా, అణకువగా, మితమైన కోపం కలిగి ఉండటం నేర్పినందుకు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతాడు. వినయంగా, శాంతంగా, ఏదైనా పొదుపుగా వ్యవహరించే మనస్తత్వాన్ని తన తండ్రినుండి, ఔదార్యంగా, మెటీరియల్ విషయాల పట్ల దూరంగా ఉండటం తన తల్లి నుండి, కష్టపడి పనిచేయడం, స్వయం- క్రమశిక్షణ, సమభావం, హేతుబధ్ధత, నిశ్చింతగా, సహనంగా, హాస్యస్పూరకంగా ఉండే మనస్తత్వాన్ని తన గురువుల నుండి నేర్చకున్నందుకు వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతాడు.
తన గురువుల నుండి అభౌతిక అంశాల గూర్చి కాకుండా “ప్రాక్టికల్ ఫిలాసఫీ”ని ఇష్టపడటం నేర్చుకున్నందుకు, తత్త్వాన్ని గ్రహించే విద్యను బోధించినందుకు వారికి రుణపడి ఉండాలని భావిస్తాడు. ఆప్యాయంగా ఉండటం నేర్పినందుకు తన భార్యకి కూడా కృతజ్ఞత తెలుపుకుంటాడు.
పుస్తకం – 2
——————–
మనం ప్రతిరోజూ కొంతమంది దారుణమైన వ్యక్తుల్ని కలుస్తుంటాం. మనలో కూడా దోషాలు ఉంటాయి, కాబట్టి మనం వాళ్ళపై కోపం చూపించకూడదు. మరణం అనేది భయపడవలసిన విషయం కాదు. అది మనల్ని బాధపెట్టలేదు.
మనలో చాలా ముఖ్యమైనది మన “మైండ్”. దానిని స్వార్థపూరిత తపనలకి బానిసని చేయకూడదు. నిత్యం విధితో పోటీ పడటం, ప్రస్తుతం పట్ల ఆతురత, భవిష్యత్తుకి భయపడకూడదు. పేరు ప్రఖ్యాతులని, ఐశ్వర్యాలకి మనం గ్యారంటీ ఇవ్వలేము. కానీ, మనం మన మైండ్ ని స్వేచ్ఛగా ఉంచుతూ, నియంత్రణలో ఉంచగలము.
పుస్తకం – 3
———————
ఇందులో మార్కస్ చిన్న చిన్న వాటి పట్ల “మైండ్ ఫుల్” గా ఉండమని చెప్తాడు. ఆకుల ఆకారము, దానిపైన ఈనెలు, రంగు వంటి వాటిని, జంతువుల యొక్క ముఖకవళికలని, వాటి ప్రవర్తనను గమనించమంటాడు. మనల్ని మంత్రముగ్దుల్ని చేసే ఎన్నో విషయాలు ప్రపంచంలో ఉంటాయి అంటాడు.
ఇతరులు చెప్పే లేదా చేసే విషయాలు, పనుల గురించి మనం మాట్లాడవద్దు. దాని బదులు మనం సిగ్గుపడకుండా విషయాలపైన శ్రద్ధపెట్టమంటాడు.
ఆలోచించడమైనా, మాట్లాడటమైనా – నిజాయితీగా, నిబద్ధతతో, ఉత్సాహంగా చేయాలి.
అలాంటి విషయాలలోనే మనిషిలోని దైవత్వం బయటపడుతుంది అంటాడు మార్కస్.
హేతుబద్ధంగా, నిజంవైపు, న్యాయంగా, ధైర్యంగా ఆలోచించడం కన్నా విలువయింది ఏమీ లేదు. ఎప్పుడూ మంచి వైపు అడుగేయాలని తీర్మానించుకోమంటాడు.
పుస్తకం – 4
——————-
మన మనసుకి ఏకాంతాన్నిచ్చేేందుకు ఎప్పుడూ సమయం కోసం వెతకాలి. మార్గాల కోసం వెతకాలి.
ఎప్పుడైతే మన మైండ్/మనసు తిన్నగా, నిర్మలంగా ఉంటుందో మనకు శాంతి, ఆనందం దొరుకుతాయి. ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారనేదానిమీద మనకి నియంత్రణ లేదు. మనపై మనకు మాత్రమే నియంత్రణ ఉంటుంది. అయినా, మనం ఇతరులనుండి నేర్చుకున్నప్పటికీ సద్గుణం ఎప్పటికీ సద్గుణంగానే ఉంటుంది.
మన జీవితం బుడగ లాంటిది. మనం బ్రతుకుతాము, కొంతకాలం తరువాత చనిపోతాము. కాబట్టి, వీలయినన్ని సద్గుణాలని మనం పెంపొందించుకుని, మనకున్న సమయాన్ని ఉపాయోగిస్తూ, సంతోషంగా ఉండాలి. ఎలాగూ ఒక చెట్టు నుండి ఆకులాగా, పండులాగా సమయమవగానే రాలిపోతామని చెప్తాడు మార్కస్.
పుస్తకం – 5
——————
ప్రతిరోజూ వేకువజామున్నే లేవాలి, మంచి పని చేయాలి. మన సమాజానికి మనవంతు కృషి చేయాలి. ఇతరులపట్ల దయ, జాలి కలిగి ఉండాలి. మంచిపనులు చేయడం ద్వారా డబ్బు ఆశించకూడదు. గొప్పతనం, గర్వం పొందకూడదు. నిస్వార్థంగా కృషి చేయమంటాడు. ప్రతిఫలితం మరేదో కాదు – అలా సద్గుణాలతో, విలువలతో ఉండటమే గొప్ప ప్రతిఫలమని చెప్తాడు.
పుస్తకం – 6
—————-
మనకి ప్రతీకారగుణం ఉండకూడదని చెప్తాడు మార్కస్. జరిగిన అపాయాన్ని, నష్టాన్ని – మనం అనుభవించి కూడా, ఇతరులకి మళ్లీ కలుగజేయాలి అనుకోవడం అవివేకం అంటాడు. మన పని మనం చేయాలి. చేసే పని సక్రమంగా చేయాలి. ఇతర విషయాల పట్ల డిస్టర్బ్ అవకూడదు, వాటిని అలా వదిలేయాలి. ఇంత పెద్ద విశ్వంలో కాలానికి, స్పేస్ కి ప్రాధాన్యత లేదని చెప్తాడు.
పుస్తకం – 7
—————–
ఇందులో ఎక్కువగా – ఓపికగా, సహనంగా ఉండటం గురించి మాట్లాడతాడు. సహజత్వం అనేది నిత్యం మారుతూ ఉంటుంది. కాబట్టి ఓపిక చాలా అవసరం. మీరు ఏం చేసినా, మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే, మనం సహనం వహించాలి అంటాడు. చెడ్డవాళ్ళు మన ఓపికని, సహనాన్ని పదే పదే పరీక్షిస్తారు. మనం వారికి ఎలా స్పందించాలి లేదా వదిలేయాలి అనేదాని మీద మన ఆనందం ఆధారపడి ఉంటుంది అంటాడు.
పుస్తకం – 8
——————-
ఇందులో మానవత్వం గురించి ప్రస్తావిస్తాడు. మానవత్వాన్ని దూరం చేసుకోవడం అంటే మన అవయవాలు మనమే నరికివేసుకోవడం వంటిదని అంటాడు మార్కస్. ప్రకృతితో, ఇతర వ్యక్తులతో ఎప్పుడూ కలిసిపోవాలి అని చెప్తాడు. మనలనెవరైనా శపిస్తే, అది మనల్ని ప్రభావితం చేయకూడదు. మన మైండ్ ని మనం నియంత్రణలో ఉంచుకోవాలి. మనం ప్రకృతిని, ఋతువులని శపిస్తే – అవి ప్రభావితం అవుతాయా? అని మార్కస్ ఇందులో అడిగిన ప్రశ్న బాగా గుర్తుండిపోతుంది.
పుస్తకం – 9
——————-
మరో వ్యక్తికి వ్యతిరేఖంగా నడుచుకోవడం అంటే, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడమే. ఇతరులపై కోపం చూపించకూడదు. ఒకవేళ అలా ఎవరిపైన అయినా చూయిస్తే, మనల్ని మనం నిందించుకోవాలి. అబద్ధం ఆడటం పాపముగా భావించమంటాడు. ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు మార్కస్.
సౌఖ్యాన్ని కోరుకునేవాళ్ళు, అన్యాయాలు చేయడానికి సిద్ధపడతారు, వాళ్ళు దుష్టులు. అదే సమయంలో మంచివారు న్యాయం పాటించే సమయంలో బాధకి గురవుతారు. ప్రకృతి అనేది సౌఖ్యానికి, బాధకి – చాలా తారతమ్యం చూపిస్తుంది. నిస్పక్షపాతంగా వీటి గుండా ప్రతి ఒక్కరూ ప్రయాణించాల్సి ఉంటుంది. తన శక్తినంతటినీ ప్రస్తుతంపై ఉంచి, మైండ్ ని బాధనుండి, సౌఖ్యం నుండి, ఇతర ప్రేరేపణలనుండి – ప్రశాంతతవైపు తీస్కెళ్లాలని చెప్తాడు. మనకు కేవలం అవసరమైన విషయాలు లేదా చాలామంది కి ఉపయోగపడే కామన్ గుడ్ పైన మాత్రమే ఫోకస్ చేయాలని తీర్మానించుకుంటాడు.
పుస్తకం – 10
———————
తన సిద్ధాంతాలకు తగ్గట్టు తాను జీవించగలనా లేదా, తనని తాను మెరుగుపరచుకోగలనా లేదా అని ప్రశ్నించుకుంటాడు. తన ప్రాకృతిక స్వభావాన్ని సంతృప్తి పరచుకుంటూ, సంఘజీవిగా జీవిస్తే అంతా బాగుంటుందని చెప్తాడు. విశ్వము మనకు అనుకూలంగానే ఉంటుందని, జరగాల్సింది జరుగుతూనే ఉంటుందని, మనం వాటిపై అసంతృప్తి చూపించాల్సిన పనిలేదని చెప్తాడు. అదృష్టాన్ని నమ్మేవాడు మార్కస్. మన శరీరం, మనసు – ఆహారం, విజ్ఞానము చేత జీవించబడతాయి అని చెప్తాడు.
కొన్నిసార్లు మార్కస్ తనతోతానే అసంతృప్తి చెందుతాడు, తన తాత్విక సిద్ధాంతాలని సరిగా అమలుపరచలేకపోతున్నందుకు. మరలా మరలా – ఆచరించాల్సిన వాటిని, చిన్నగా విడగొట్టుకుని తనని తాను మెరుగుపరుచుకునే ప్రయత్నం నిత్యం చేసేవాడు మార్కస్. ఫలితాలను తనకు తానుగా పరిశీలించుకునేవాడు. జీవితం పట్ల విషయాలని ఎప్పటికప్పుడు పాయింట్ అవుట్ చేస్తూ, మార్పుని అర్థం చేసుకోవాలని తనని తాను ఛాలెంజ్ చేస్కునేవాడు. అన్నిటిని ప్రకృతి సృష్టిస్తుందని, మనం దాని ఆక్సెప్ట్ చేసి, ముందుకు సాగాలని చెప్తాడు. ఇతరులు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటారు అనేది గమనించాలని సలహా ఇచ్చుకుంటాడు.
పుస్తకం – 11
——————–
ఇందులో రేషనల్ సోల్ గురించి వివరిస్తాడు. ఇది దానంతట అది, తనకు కావాల్సింది విశ్వంలో వెతుక్కుంటుందని, సహజంగానే చాలా మంచి లక్షణాలని కలిగిఉంటుందని చెప్తాడు. విషాదాలు, చెడు విషయాలు కూడా మనకు ఏ విధంగా మంచి చేస్తాయో గ్రహిస్తాడు. “ఉపయోగపడేది” ఎక్కడున్నా, గ్రహించాలి. మనం చేయాలనుకున్న పనుల పట్ల అడ్డొచ్చే అంశాల పట్ల, మనకి కోపం కలిగించే విషయాలపట్ల దృష్టి ఉంచాలని చెప్తాడు.
మన బలహీనతలపై, అవకాశాలపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని – మెరగుపర్చకునే ప్రయత్నాన్ని ఎప్పటికి వదిలేయకూడదనుకుంటాడు.
పుస్తకం – 12
———————
మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనపై ఇతరుల అభిప్రాయాలకన్న, మన అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇచ్చుకోవాలి. అలా కాకపోతే అది పెద్ద తప్పువుతుంది. మనకి నష్టం చేకూరుస్తుంది.
ఎవరు ఎంత గొప్పవారైనా, ఎవరెంత అధములైనా – అందరూ బూడిదగానే మిగిలిపోతారని, మన వ్యక్తిత్వం పట్ల అహం కలిగి ఉండటం, గర్వం కలిగి ఉండటం అర్థ రహితమని, హంబుల్ గా ఉండటానికి మించిన సద్గుణం లేదని చెప్తాడు మార్కస్. ప్రశాంతమైన మరణాన్ని కోరుకోమంటాడు.
మార్కస్ తన వ్యక్తిత్వాన్ని, నిర్విరామంగా ఎలా అభివృద్ధి చేసుకునేవాడు అనేది ప్రధానంగా ఈ పుస్తకం చెబుతుంది. తన జీవితాన్ని వీలయినన్ని సద్గుణాలు అలవర్చుకుంటూ, రాజ్యపాలన సమర్థవంతంగా నిర్వహించిన మార్కస్ జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం.


