Friday, 7 August 2026

డంప్ చేయించాడు “డోనాల్డ్ డంప్”

మత విద్వేషపూరిత సో కాల్డ్ దేశభక్తులు తప్ప దేశం పట్ల అభిమానం, గౌరవం వున్నవారెవరైనా అమెరికా 104 మంది భారతీయుల్ని యుద్ధఖైదీల్లా బంధించి చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేసి, తమ యుద్ధ విమానాల్లో తరలించి, అమృత్ సర్ లో డిపోర్ట్ చేసి తిరిగి వెళ్లిపోవటాన్ని అంగీకరించలేరు. ఆ నూటా నాలుగుమంది నిజానికి అమెరికాలో బతికిందీ లేదు. అక్కడ నేరాలు చేసినవారసలే కారు. గ్వాతిమాలా, మెక్సికో, పనామ వంటి దేశాల గుండా అత్యంత ప్రమాదకరమైన దారుల వెంట అమెరికాని చేరగానే అరెస్ట్ చేసి తమ యుద్ధ విమానాల్లో కుక్కి భారత్ లో డంప్ చేయించాడు “డోనాల్డ్ డంప్”. ఈ డోనాల్డ్ తెంపరి చవక ధరలకే తమ శారీరిక శ్రమని అందించి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకి తోడ్పాటు అందించిన విదేశీ వలసదారుల్ని “ఏలియన్స్”, “క్రిమినల్స్” అని సంబోధిస్తున్నాడు.
ఒక దేశానికి ఖచ్చితంగా తన దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని తిరిగి వారి స్వదేశానికి పంపే హక్కు వుంటుంది. కానీ దానికో దౌత్య ప్రక్రియ వుంటుంది. అలా తిరిగి పంపటాన్ని యుద్ధ ప్రక్రియగా మారిస్తే ఖచ్చితంగా అది అభ్యంతరకరమే. ఈ 104 మందినీ సంకెళ్లతో బందీలు చేసి, యుద్ధ విమానాల్లో భారత్ గడ్డ మీద వదిలేయడం ఖచ్చితంగా యుద్ధ చర్యే. అంటే అమెరికాకి చెందిన ఒక మిలటరీ విమానం మన గడ్డ మీద దిగటం మన దేశ సార్వభౌమాధికారానికి భంగమే. ట్రంప్ ప్రభుత్వం ఇలా చేయబోతున్నట్లు మన ప్రభుత్వానికి ముందే తెలియచేసినా అలా చేయాల్సిన అవసరం లేదని, మనమే మన విమానాల్లో వారిని తెచ్చుకుంటామనీ మన ప్రభుత్వం అనలేదు. చిన్న చిన్న దేశాలు చూపించిన తెగువలో, ఆత్మగౌరవ ప్రకటనలో వందో వంతు ప్రతిఘటనైనా మన నుండి లేదు. ఈ వలసదారులందరూ భారత్ ని సక్రమంగానే వదిలారు కదా? వారు దేశాన్ని వదిలే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడలేదు కదా? మరి వారిని మర్యాదగానే ఈ గడ్డ మీద దింపుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అనే ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి.
ఒక వ్యక్తికే కాదు ఒక దేశానికైనా ఆత్మగౌరవరాహిత్యాన్ని మించిన దుర్గతి, దుస్థితీ మరొకటి లేదు. భారత్ కి సంబంధించినంతవరకు ఈ దుర్గతి, దుస్థితి విదేశాంగ శాఖా మనత్రి జైశంకర్ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటనలో కనిపించింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇది చాలా మామూలు విషయమని, అమెరికా 2009 నుండీ ఇలా సంకెళ్లు వేసే పద్ధతిని అమల్లోకి తెచ్చిందనీ సెలవిచ్చాడాయన. అమెరికా అలా తన అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తే దానికి ఆమోద ముద్ర వేయటం తప్ప మరో గత్యంతరం లేదా? జైశంకర్ మాటల్లో కనీస విచారం లేదు. ఒక యజమాని చర్యని బానిస కళ్లప్పగించి చూసినట్లే వుంది. ఈయనకి “మామూలు అంతర్జాతీయ వ్యవహారం”గా కనబడినది మరి కొలంబియా వంటి చిన్న ప్రాణ దేశాలకు ఎందుకు మామూలుగా కనబడలేదంటే వారి ఆత్మాభిమానం ధనోన్మాద, వర్ణోన్మాద ట్రంప్ కన్నా పెద్దది కనుక! పైగా భారతీయుల్ని సంకెళ్లు వేసి తీసుకురాలేదని, మీడియాలో చూపించినది గ్వాతిమాలా వలసదారులని మన ప్రభుత్వం బుకాయిస్తే, అదేం కాదు వారు భారత వలసదారులేనని అమెరిక ఆధారసహితంగా అధికారిక వీడియోని విడుదల చేసి గాలి తీసింది.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు మన ప్రధాని స్వయంగా అమెరికా వెళ్లి ట్రంప్ తరపున దాదాపుగా ఎన్నికల ప్రచారం చేసినంత పని చేశారు. ట్రంప్ తన ఆత్మీయ మిత్రుడు అని ప్రకటించారు. అంతకు ముందు కరోన ఊపందుకుంటున్న సమయంలోనే “నమస్తే ట్రంప్” పేరుతో ఇండియాలోఏ అహ్మదాబాద్లో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. అప్పుడు కూడా ట్రంప్ ని మోడీ తన “మిత్రుడు”గా పరిచయం చేశారు. కానీ అదే “మిత్రుడు” కోవిడ్ సమయంలో అదేదో ఔషధం (టెట్రాసైక్లిన్ అనుకుంటా)ని భారత్ తమ దేశానికి పంపకపోతే ప్రతీకార చర్యలుంటాయని బెదిరించాడు. మన దేశం వెంటనే ఆ ఔషధం పంపింది. అసలు ట్రంప్ తో మోడీకి కానీ, అమెరికాతో భారత్ కి కానీ వున్న అనుబంధం ఏమిటి? మిత్రుల మధ్య స్నేహ సంబంధమా లేక యజమాని బానిసల మధ్య సంబంధమా? వ్యక్తిగతపరంగా కానీ దేశపరంగా కానీ స్నేహమనేదే వుంటే సంప్రదింపులకి ఆస్కారం వుంటుంది కదా! ఎందుకు ఇంత వెన్నెముక లేకుండా వ్యవహరించాలి?
అసలు వేరే దేశాలవారిని అక్రమ వలసదారులని అమెరికా అనడమే హాస్యాస్పదం. స్థానికి తెగల్ని మట్టు పెట్టి క్రమంగా ప్రస్తుత అమెరికాని పరిపాలిస్తున్న తెల్ల జాతే అతి పెద్ద వలసదారు. ఎన్ని దేశాల్లో అమెరికాకి మిలటరీ బేస్ ల పేరుతో వలస క్యాంపులున్నాయి! ఎన్ని దేశాల్ని ఆక్రమించింది! ఎన్ని ప్రభుత్వాల్ని కూలదోసింది! మరొకరిని అక్రమ వలసదారులుగా పేర్కొనే నైతిక హక్కు ఆ దేశానికి లేదు.
ప్రపంచం మొత్తానికి మారక ద్రవ్యంగా తన దేశ కరెన్సీ డాలర్ ని కలిగి వున్న అమెరికా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఆ దేశ కరెన్సీ మీద అన్ని దేశాల ప్రజలకూ ఆశ పుట్టడం, చీప్ లేబర్ కి ఊతమిచ్చే పరిస్థితులు అమెరికాలో వుండటం…ఇవన్నీ సక్రమమో, అక్రమమో వలసలకి దోహదం చేస్తుంది. వలసలు దేశాల మధ్య సమస్యగా భావించి దౌత్యపరంగా పరిష్కారాలకు ప్రయత్నించాలే తప్ప ట్రంప్ తన తెంపరితనంతో ఇలాగే ఓరల్ డయేరియాతో రంకెలేస్తూ, వీరంగంతో గంతులేస్తే ప్రయోజనం లేదు. ఎందుకంటే అమెరికా వంటి దేశాలకు వలసలు పోవడం వెళ్లేవారికి ఎంత అవసరమో, ఆ వలసదారుల అవసరమూ ఆ దేశాలకూ అంతే అవసరముంటుంది. ఎందుకంటే ఆర్ధికంగా బలిసిన దేశాల ప్రజలు తమ ‘సీట్ల’ను తక్కువ వేతనాలకి కదల్చరు మరి!.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు