లోకం మొత్తానికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఓ సామెత! తెలుగు సమాజానికి ప్రాచీన హైందవ విశిష్టత గురించి, ఆర్ష ధర్మాల గురించి, సామాజిక నైతిక విలువల గురించి, వ్యక్తుల నడత గురించి, సమాజాన్ని వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సాంస్కృతిక ప్రభావాల గురించి పురాణాల కంటే ఎక్కువగా ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు అనే ప్రవచనకర్త మీద అతని మాజీ జీవన సహచరి కామేశ్వరి తీవ్రమైన నైతిక ఆరోపణలు చేస్తున్నారు.
గరికపాటి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన అవధాని మాత్రమే కాక తన ప్రవచనాల ద్వారా ఓ సామాజిక ప్రభావశీలి (సోషల్ ఇన్ ఫ్లూయన్సర్). చాలా సాధికారికంగానూ, తీర్పరితనంతోనూ ప్రవచనాలు చెబుతుంటాడీయన. ఈయన తన ప్రవచనాలను కావలనుకుంటే ఆధునికంగానూ లేదా సనాతనంగానూ ఎలాంటి ధోరణిలోనైనా చెప్పగలరు. ఎక్కువగా స్త్రీ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న ఈయన కావాలనుకుంటే స్త్రీల కోసం కన్నీళ్లు పెట్టుకోగలడు కూడా. ఆ రకంగా రకరకాల ప్రవచన విన్యాసాలతో విపరీతమైన ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడీయన. మొత్తానికి భారతీయ సంప్రదాయం, కుటుంబ వ్యవస్థ పటిష్టత ఆవశ్యకత గురించి, ఆ వ్యవస్థ పటిష్టత కోసం వ్యక్తులు పాటించవలసిన కౌటుంబిక, సామాజిక విలువల గురించి తన ప్రవచనాల్లో ఏకరువు పెడుతుంటాడు. అలాంటి గరికపాటి ఓ ముప్ఫై ఏళ్ల క్రితం తన అన్న భార్యనే తన స్వంతం చేసుకున్నాడని, ఓ దశాబ్ద కాలం కాపురం చేశాడని, ఇద్దరు పిల్లల్ని కన్నాడని ఇప్పుడు ఆ వదినగారే స్వయంగా తెలియచేయడంతో పాటు ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేయడంతో తెలుగులోకం మొత్తం ఉలిక్కిపడింది.
గరికపాటిగారి మాజీ వదినగారు, అనంతర కాలంలో ఆయన సహచరి ఐన కామేశ్వరిగారు చెప్పినదాని ప్రకారం గరికపాటి అన్నగారైన వెంకటేశ్వరరావు అనే ఆసామి భార్య ఐనటువంటి కామేశ్వరిని ఆమెలోని తెలుగు భాషా పాండిత్యాన్ని గుర్తించి, ఆమెతో అవధానాలు చేయిస్తానని, ఆమె ప్రతిభని లోకం గుర్తించేలా చేస్తానని చెప్పి, ఇంకా అనేక విధాలుగా ఆమెని ఆకర్షించి, ప్రలోభ పెట్టి, ఆమె భర్తతో విడాకుల పత్రం మీద సంతకం చేయించి ఆమెతో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిన వారు భార్యాభర్తలుగానే బతికారు. ఐతే ఈ క్రమంలో ఆయన తనతో చాలా దురుసుగా వ్యవహరించేవాడని, తాను పాడినా ఒప్పుకునేవాడు కాడనీ, తమ మొదటి కొడుకు గురజాడకి పాటలు నేర్పిస్తుంటే గోలగోల చేసేవాడని, ఏ ప్రేమ కోసం, గుర్తింపు కోసం తాను తన భర్తని వదిలేసి వచ్చిందో అవి తనకు దక్కలేదని, పైగా అన్నీ అవమానాలేనని, అసలు ప్రేమగా వ్యవహరించేవాడు కాదనీ, అనుమానించేవాడని, పాలు పోసే అతను ‘అదోలా’ చూస్తున్నాడంటే అందుకు ఆమే బాధ్యురాలనీ, తాను గురువుగారైన బేతవోలు రామబ్రహ్మం మీద పద్యం రాస్తే తన మీద ఎందుకు రాయలేదని గొడవ చేశాడని, ఆయనలో ‘సమర్ధత ‘ కూడా లేదని (గరికపాటి రెండో భార్యకి పిల్లలు లేరనే విషయాన్ని గమనించాలని ఆమె సూచించారు), తన ఆస్తులన్నీ తీసేసుకున్నాడని, వాళ్లమ్మ ఈమెని వదిలించుకోమని అంటున్నదని, ఆమె చచ్చిపోతే గంధపు చెక్కలతో శవదహనం చేయిస్తానని అన్నాడని, చివరికి ఆ ప్రేమ రాహిత్యపు వాతావరణంలో ఇమడలేక బైటకి వచ్చేసానని, తనకి నచ్చినవాడితో వెళ్లిపోయానని, గరికపాటి నుండి ప్రేమ దొరికి వుంటే తాను వెళ్లిపోయేదానిని కాదని, ఆయన అవమానాలు, ఛీత్కారాలు తట్టుకోలేకనే వెళ్లిపోయానని తాను చేసిన వీడియోలో చెప్పుకొచ్చారామె.
ఐతే ఇప్పుడే ఆమె ఆ వీడియో ఎందుకు చేశారనేది ప్రశ్న. సమాజంలోని బాధిత స్త్రీలందరూ బైటకి వచ్చి చెప్పుకోవాలని గరికపాటే అన్నారని, అందుచేత తాను బైటకి వచ్చానని ఆమె అన్నారు. ఏపి లో చాగంటికి సాంస్కృతిక సలహాదారు పోస్టు ఇచ్చినట్లు తెలంగాణలో కూడా గరికపాటికి కూడా అలాంటి పోస్టే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అది నచ్చని తెలంగాణవాదులు కామేశ్వరిగారితో ఈ వీడియో చేయిస్తున్నట్లు కూడా వార్తలు/ఊహాగానాలు వస్తున్నాయి. 2024 మార్చ్ నెలలో మొదట వీడియో చేయగానే పెద్ద కుమారుడైన గురజాడతో ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టించారు. అది ఆమెకి మరింత ఆగ్రహం కలిగించి మరిన్ని వీడియోలు చేసేలా చేసింది. తమ మధ్య ఏం జరిగిందనేది వీడియోల్లో తాను అన్నీ చెప్పుకోలేనని అన్నారామె.
తన పక్కన కూర్చోనిస్తే రేపు తన భుజం మీదనే చెయ్యేస్తుందనేది ఆయన భయమని ఆవిడ అన్నారు. ఈ మాత్రం చొరవని ఒప్పుకోలేని కురచ మనస్కులతో ఆత్మ గౌరవం వున్న ఎవరైనా తెగతెంపులే చేసుకుంటారు. నాకైతే ఈ ఉదంతం మొత్తం తన సహచరుడి నుండి ప్రేమని, ఆప్యాయతని పొందలేకపోగా అవమానాల్ని ఛీత్కారాల్ని ఎదుర్కొని, వాటి నుండి బైట పడటానికి ఓ మహిళ చేసిన డెస్పరేట్ ప్రయత్నంగా అనిపిస్తుంది.
ఈ పురుషాధిక్యపు సమాజంలో ఆమెని దోషిగా నిలబెట్టడం, గరికపాటికి పూర్తి సానుభూతి దొరకటం అసహజమేమీ కాదు. అందుకు విరుద్ధంగా జరిగితేనే మనం ఆశ్చర్యపోవాలి. ఇన్నేళ్లు మౌనంగా వుండి ఇప్పుడే ఎందుకు బైటపడాలనే ప్రశ్నకి అర్ధం లేదు. ఎప్పుడు, ఎలా బైటపడాలనేది బాధితులు తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. వెంటనే బైటపడటానికి పరిస్థితులు అనుకూలంగా వుండకపోవచ్చు. ధైర్యం చాలకపోవచ్చు. ఒక వ్యక్తితో పీడింపపడ్డ బాధితుల జీవితంలో కొత్త వ్యక్తులు వస్తే జీవితానికి సంబంధించిన నిర్ణయాలలో ఈ కొత్తవారి ప్రమేయం కూడా వుంటుంది. ఆ కొత్త వ్యక్తుల సానుకూలత, సహకారం లేకుంటే చేయగలిగిందేముంది? కామేశ్వరిగారి వెర్షన్ ప్రకారం ఆమె ఇప్పుడు పూర్తిగా ఒంటరి, స్వతంత్రురాలు, ఏ బంధంలోనూ లేదు. ఈ స్వతంత్ర భావన ఆమెకి తన గత కాలపు చేదు జ్ఞాపకాలని, గరికపాటి ద్వంద్వ ప్రవృత్తిని బైటపెట్టే వెసులుబాటు కలిగించి వుండొచ్చు. కాలం గడిచినంత మాత్రాన మనసు గాయాలు సమసిపోవు. అవి ఎప్పుడైనా బైటపడొచ్చు. కొందరు ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నారు. బ్లాక్మెయిలింగ్ ఓ రహస్య వ్యవహారం. అది ఏదైనా బట్టబయలు కాకమునుపు జరిగేది. సమాజం ముందు మొత్తం బహిరంగపరిచాక ఇంక బ్లాక్మెయిలింగ్ ఏముంది?
తన కంటే రెండేళ్లు చిన్నవాడైన తన మరిదికి బుద్ధి లేకపోతే తనకైనా వుండొద్దా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సమస్య ఆమె భర్త నుండి బైటకి వచ్చి గరికపాటితో సహజీవనం చేయడమా లేక గరికపాటి వల్ల కలిగిన అశాంతి, ఆశాభంగమా? అసలు ఆవిడ ప్రధాన ఆరోపణ ఏమిటి? తనకి గరికపాటి నుండి ప్రేమ దక్కకపోగా అవమానం, అశాంతే మిగిలాయని కదా ఆవిడ ఆరోపణ. తన వాదనకు ఊతంగా ఆవిడ కొన్ని ఉదంతాలు కూడా చెప్పారు. ఆమె మొదటి వివాహబంధం తెగతెంపులు కావటం మీదనే ఫోకస్ చేసే మోరల్ జడ్జెస్ ఆ తెగతెంపుల ఉదంతంలో గరికపాటి పాత్రని ఎందుకు విస్మరిస్తున్నారు? మనం ఇక్కడ చూడవలసింది ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని కాదు. వ్యక్తుల దృక్పథాల్ని బట్టి నైతికత అనైతికతలు, తప్పొప్పులు మారుతుంటాయి. తాము చేసేది తప్పు అని ఆ రోజు గరికపాటి, కామేశ్వరి అనుకొని వుంటే ఇద్దరూ కలిసి జీవించేవారే కాదు. అందుకే వారి మధ్యన బంధమేర్పడటం సమస్య కాదు. ఆ బంధం ఎలా కొనసాగిందనేది అసలు విషయం. ఒక పురుషాధిక్య వ్యవస్థలోని కరుడు కట్టిన బ్రాహ్మణ కుటుంబంలో గరికపాటి వంటి వారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. కామేశ్వరి తన ఆవేదనని, తాను ఏమి కోల్పోయానో చెప్పిన విధానంలో విశ్వసనీయత వుంది. గరికపాటి రెండో భార్య తన పిల్లలనిద్దరినీ తన కన్న బిడ్డల వలె బాగా చూసుకున్నదని, ఆమె ఒక దేవత అని కూడా కామేశ్వరి అనడం మనం గమనించాలి.
తాను నమ్మి తన జీవితంలో ఆచరించలేని సనాతన సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని జనం తేరగా దొరికారని ప్రవచనాలుగా చెప్పే హక్కు గరికపాటికి వుందా అని మనం ఆలోచించాలి. అతనికి ఖచ్చితంగా ఆ హక్కు లేదు. అతను ఇంకా ఓ ప్రవచనకారుడిగా కొనసాగితే అది జనం తప్పే. కాలానుగుణంగా వ్యవస్థలు మారుతుంటాయి. ఆ మార్పుకి అనుగుణంగా విలువలూ మారుతుంటాయి. వాటిని వివేచించి వివరించేవాడు ఆలోచనాశీలి. పాత వాటినే పట్టుకొని వేలాడండి అని చెబుతూ తాను మాత్రం మరో రకంగా బతికేవాడు ప్రవచనకారుడు. అవధానం తరహా విద్వత్తు ఓ సాహిత్య వినోద కార్యక్రమం. ఒక స్టాండప్ కమెడియన్ కి అతనికీ ఏమీ తేడా లేదు. ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతకు మించిన ప్రాధాన్యత తీరిక వర్గానికి చెందిన ఓ అవధానికి లేదని మనం గుర్తించాలి. పురాణాల్ని వల్లెవేసి, నాలుగు పద్యాలు కట్టి, పాలకుల్ని ఓ వంద పొగడ్తలతో ఆకర్షించి శాలువాలకి, సత్కారాలకి, పురస్కారాలకి, పదవులకి ఆరాటపడే వాళ్లే వీరంతా! వీరి ప్రతిభ పాలివ్వని ఓ అజాగళ స్తనం (మేకపోతు మెడ కింద వేలాడుతుంటాయి).
ఇంత జరిగినా కామేశ్వరి ఇంక తనలోని వైరుధ్యాల్ని పట్టించుకోవడం లేదు. “మేం బ్రాహ్మణులం. మా దగ్గర విద్వత్తు వుంటుందే కానీ ధైర్యం వుండదు” అని చెప్పడంలో దురహంకారమే వుంది. తన జీవితంలో మానవ సహజాతాలను అనుసరించి ధైర్యంగా వెళ్లిపోయిన ఆవిడ తన కులాన్ని మాత్రం భుజాన వేసుకునే మాట్లాడుతున్నది. ఏ వ్యవస్థీకృతమైన పురుషాధిక్యపు విలువల వల్ల తాను బాధపడిందో వాటికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడటం లేదు. ఆవిడ కోపం మొత్తం ఒక్క వ్యక్తి మీదనే. అతడు తనకి అన్యాయం చేశాడనేదే ఆవిడ ఆరోపణ. పైగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ ఈ తరం యువతులకు ఇస్తున్న సందేశమేమంటే “మీరు తల్లిదండ్రులు చూసిన సంబంధాలను మాత్రమే చేసుకోండి. ప్రేమ వివాహాలొద్దు. ఎందుకంటే సంప్రదాయ వివాహాలలో ఇబ్బందులెదురవుతే మీకు మీ కుటుంబం అండంగా వుంటుంది. ప్రేమ వివాహాలలో మీకు ఆ మద్దతు దొరకదు.” ఆవిడ తాను పెద్దలు చేసిన సంప్రదాయ వివాహం నుండి బైటపడే గరికపాటితో కొత్త ప్రయాణం మొదలుపెట్టిందనే విషయాన్ని మరిచిపోయింది. ఎంత వైరుధ్యం? ఏ పెద్దలు ఆవిడకి అండగా నిలిచారు?