Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త రైల్వే చార్జీలు
  • జులై 8 కంటే ముందే భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటన
  • ట్రంప్ నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా
  • 70 ఏళ్లు దాటిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
  • కార్న్‌వాల్‌లో 93 ఏళ్ల మహిళను హత్య చేసిన కేసులో 65 ఏళ్ల వ్యక్తి అరెస్టు
BTJBTJ
Tuesday, July 1
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»Book Reviews

‘జీవితాదర్శం’

February 25, 2025No Comments16 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అష్ట దిగ్బంధనాల ప్రేమ భావోద్వేగాలు కాదు
శాంతిని మించిన ‘జీవితాదర్శం’ లేదని నిరూపించిన లాలస!

“జీవితాదర్శం” చలం రాసిన ఎనిమిదో నవల. 1948లో రాసిన ఈ నవల ఆయన చివరి నవల కూడా. రాసింది 1948లో ఐనా కథాకాలం 1930వ దశకం. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా గాంధీ భారతీయ సమాజాన్ని ఊపేస్తున్న కాలం ఈ కథా సందర్భం. అసలు మనిషికి జీవితాదర్శం అంటూ ఒకటుండాలా? వుంటే అది ఏమిటి? అసలు మనిషి దేనికోసం బతకాలి? ఎలా బతకాలి? సమస్త జీవన ఘర్షణల అంతిమ సారాంశం అహం తృప్తి పరుచుకోవటమా లేక సుఖ పడటమా లేక అంతూ పొంతూ, దరీ దాపూ లేని ఉద్రేకపూరితమైన కోరికల వెల్లువలో అగమ్యంగా ప్రయాణించటమా? జీవితంలో కళలు, సారస్వతం పాత్ర ఏమిటి? ఈ నవలలో చలం డీల్ చేసిన విషయాలివి. డబ్బు, ఆస్తుల సంపాదన, సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ చాలామందికి జీవిత లక్ష్యాలు కావచ్చు. కానీ అసలు జీవితాదర్శం ఏమిటనేది నవల ముఖ్య విషయం.

చలం నవలలన్నింటిలోకెల్లా తాత్వికంగా అత్యంత లోతైన నవల “జీవితాదర్శం”. కథా వస్తువు, కథన శైలి రీత్యా చూస్తే ఈ నవల ఎంతో ఆధునికమైనది. మానసికంగా అభివృద్ధి చెంది, ధైర్యవంతులు, సంస్కారవంతమైన మనుషుల మధ్య ఒక తాత్విక ఘర్షణగా నవలని ఓ సాహిత్య కళాఖండంగా రూపుదిద్దడంలో చలం చూపించిన పరిణితి, వెళ్లిన లోతు, అద్దిన గాఢత, కథనంలో సస్పెన్స్ ఎలిమెంట్ ని చొప్పిస్తూ ప్రదర్శించిన రచనా నైపుణ్యం అమోఘమైనవి. శిల్ప రీత్యా చూస్తే కూడా చలం ఫ్లాష్ బాక్ టెక్నిక్ తో దేశికాచారి భార్య లాలసేనా అనే విషయంలో పాఠకుడిలో కూడా సందిగ్దతని కొనసాగిస్తూ ఆసక్తికరంగా చదివించేలా రాశాడు. చలం నవలల్లో సస్పెన్స్ ఎలిమెంట్ వున్న ఏకైక నవల “జీవితాదర్శం”.

కథ:
అనంతపురానికి చెందిన కుర్ర వకీలు లక్ష్మణ్ సింగ్, అతని యువ స్నేహితుడు నరసింహారావు భీమిలీ సముద్ర తీరం, అక్కడి కొండలు, అడవితో కూడిన ప్రకృతి సౌందర్యం గురించి విని కొంతకాలంపాటు భీమిలీలో వుందామని వస్తారు. ఐతే భీమిలీ వచ్చాక వాళ్లకి అంతా చప్పచప్పగా కనిపిస్తుంది. బోర్ కొట్టి అటూఇటూ తిరుగుతున్నప్పుడు ఎత్తుగా, లావుగా వున్న యాభై ఏళ్లు పైబడ్డ ఓ వ్యక్తి నెత్తి మీద ఈవెనింగ్ ఇంగ్లీష్ టోపీ, సూటూ బూటూ, గాలికి ఎగురుతున్న టై, మెలి తిరిగిన మీసాలు, చేతిలో కేన్ (బెత్తం)తో తారసపడతాడు. మాటలో అమితమైన ఉత్సాహం, స్నేహభావంతో తెలిసిన వారిని, తెలియని వారిని “గుడీవినింగ్” అంటూ పలకరిస్తూ వుంటాడు. మొదటి రెండు రోజులు అతను వారిని పట్టించుకోడు. మొత్తానికి మూడో రోజున అతనితో వారు పరిచయం చేసుకోగలుగుతారు. వెంటనే వారి కష్టసుఖాలు అడుగుతాడు. వారికి భోజనం సరిగ్గా అమరడం లేదని తెలుసుకొని అక్కడున్న ఓ కాఫీ హోటల్ కు వెళ్లి “దేశికాచారి” పంపాడని చెప్పమంటాడు. అతనిలో వారికి సానుభూతి, దయ, ఇబ్బందిని అర్ధం చేసుకునే హృదయం వున్నదని గమనిస్తారు. అతని మాటల్లో కనబడే ఉత్సాహం, హాయి, అనుభవం చూసి వారిద్దరూ తెల్లబోతారు. చాలా తొందరగా స్నేహితులైపోతారు. అతని “మనో విశాలత్వం, ఆతిథ్య దృష్టి, తనలోకి ఎవరినైనా ఆకర్షించే శక్తి” వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను ఆంగ్లంలో మాట్లాడితే ఆంగ్లేయుడిలా అనిపించాడు వారికి.

ఐతే వారికి దేశికాచారి అనే పేరు ఎక్కడో విన్నట్లుగా, తెలిసినట్లుగా అనిపిస్తుంది. వీరు అతను ఎవరు, ఎక్కడివాడని, ఏం చేస్తుంటాడని వాకబు చేస్తే ఎవరూ చెప్పలేకపోతారు. అతను తన సారస్వత జ్ఞానంతో వాళ్లిద్దరినీ నోరెళ్లబెట్టేలా చేస్తాడు. “ఏమిటి ఇంకా ఎడ్గార్ వాల్లాస్ చదువుతున్నారా? పీటర్ చే ని చదవండి. నాలుగైదు పుస్తకాలు భరించవచ్చు. కథలు బావుంటాయి కానీ ఇప్పుదు సైన్స్, ట్రావ్ల్, హిస్టరీ కూడా కథల కన్నా ఆకర్షణగా రాస్తున్నాడు. చూశారా! రెండో ప్రపంచయుద్ధం రియాక్షన్స్ ఇంగ్లీష్ వారి వాంగ్మయం మీద ఎట్లా వొచ్చాయంటారు? ఇంగ్లాండులో కన్నా అమెరికాలో స్పష్టంగా కనబడుతున్నాయి.” అంటాడు.”చలం కన్నా శరత్తు ఎందుకు ఎక్కువ ఆదరణ పొందుతున్నాడో తెలుసా మీకు?” అని కూడా అడుగుతాడు. మాటల్లో “మనుషులకు స్నేహం చాలా అవసరం. కానీ నా బోటి వాడికి మనుషులనే వాళ్లు లేకుండా బతకడం నేర్చుకోవాల్సిన అవసరం పడుతుంది” అంటాడు. “ఇంత మానవ ప్రియుడికి అట్లాంటి గతేమిటి?” అని మిత్రులిద్దరూ ఆశ్చర్యపోతారు.

లక్ష్మణ్ సింగ్ కి, నరసింహారావుకి భీమిలీ అందాలను ఎలా చూడాలో చెబుతాడు. కొండరాళ్ల మధ్య నిలువున్న నీళ్లలోని నాచుని, వాటి రంగు, మెత్తదనం, ఎండతో ఎన్నెన్ని విధాల మారేది వివరిస్తాడు. కొండరాళ్లల్లోని నీటి మడుగుల్ని, హోరు పెట్టే సముద్రాన్ని మరిచిపోయి ఆ గుంటే జీవితమనుకొని రాళ్ల కింద నీడల్లో వుండిపోయిన నాచులోంచి ఈదుతున్నప్పుడు ఎన్ని విచిత్రాలు, అందాలు చూడగలరో వివరిస్తాడు. అప్పటి నుండి వారికి భీంలీ అందంగా కనబడటం మొదలవుతుంది. “ఏం లేదు, మన మనసుల మీద మూతల్ని దేశికాచారి తీసేశాడు. తక్కిన పని భీంలీ చేస్తున్నది” అనుకుంటారు వాళ్లు. ఐతే వారికి మనసులో సందేహం కొడుతూనే వున్నది. పైగా అతను వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు కూడా. తనే వచ్చి తీసుకెళతాడు. కొండ మీద ఓ బంగళా అతని ఇల్లు. ఇంటి ముందు చిన్న తోట, ఎదురుగా సముద్రం. లోపల దేశికాచారి ముసలి భార్య వున్నట్లుగా తెలుస్తున్నది కానీ ఆమె బైటకి రాదు. మాటల సందర్భంలో తాను ఒక పబ్లిక్ ఫ్రాడ్ చేసి జైలుకెళ్లొచ్చిన సంగతి చెబుతాడు. డబ్బుని సరిగ్గా జీవితాన్ని అనుభవించడానికి కాక దేవుళ్లకి, పెళ్లిళ్లకి, మర్యాదలకి, భేషజాలకీ, యాత్రలకి, మూఢత్వాలకి ఖర్చు చేసే వారి సొమ్ముని ఎగేస్తే ఏం పాపం లేదనీ, తాను చేసిన ఫ్రాడ్ మనీతో అర్హులకి దానాలు చేశానని, తానూ అనుభవించాననీ చెబుతాడు. అతన్ని చూసి తమని ఏదో విధంగా ఇరికిస్తాడని వారిద్దరూ భయపడతారు. అయితే వారిద్దరి పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించి ఆ రాత్రి ఆ కొండ మీద బంగళా నుండి ఊరి మొదటిదాకా దింపి వెళతాడు. కానీ వారిద్దరికీ అతని కేరక్టర్ పట్ల ఇంకా సంశయమే. తమని ఎక్కడో ఓ చోట మోసం చేస్తాడని, జాగ్రత్తగా వుండాలనుకుంటారు.

మళ్లీ మరుసటి రోజు మిత్రులిద్దరూ ఊరంతా దేశికాచారి గురించి అడిగి చూస్తారు. అతని చరిత్ర తెలిసిన వారు కూడా అతని గురించి చెడ్డగా చెప్పరు. ఎవరి జోలి, ఎవరి సంగతి, ఊరి వ్యవహారాలు, అపవాదులతో పని లేని అతను ఏ అన్యాయం చెయ్యడు సరికదా ఎక్కడెక్కడ తాను ఏ చిన్న ఉపకారం చెయ్యడానికి వీలున్నా అక్కడ హాజరవుతాడని తెలుసుకుంటారు. అందరికీ అతని పట్లా ప్రేమా, గౌరవం వుండటం గమనిస్తారు. ఒక మోసగాడు అంతలా ఎలా మారిపోయాడో అని ఆశ్చర్యపోతారు. ఆ రోజు రాత్రి సింగ్ కి విపరీతమైన చెవి పోటు వస్తే మందు కోసమని నరసింహారావు దేశికాచారి ఇంటికి వెళతాడు. అప్పుడు వరండాలో స్తంభాన్నానుకొని కూర్చొని వుంటాడు. అప్పుడు సముద్రం వంక చూస్తూ, అతని రొమ్ము మీద తల పెట్టుకొని, అతని భుజం చుట్టూ చెయ్యేసి, వెన్నెలని అనుభవిస్తూ వెల్లకిలా పడుకొని వుంటుంది అతని భార్య. వారిద్దరి అన్యోన్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు నరసింహారావు. తప్పనిసరి పరిస్థితుల్లో అతడు వారిని డిస్టర్బ్ చేసి మందు తీసుకొని వెళతాడు. మరుసటి రోజు రాత్రి వేళ సముద్రం ఒడ్డున మిత్రులిద్దరూ చిన్న ప్రమాదంలో పడతారు. అప్పుడు ఓ పాతికేళ్ల మహిళ వారిని రక్షిస్తుంది. ఆమెని చూసిన లక్ష్మణ్ సింగ్ ఆమె లాలస అని భావిస్తాడు. కానీ ఆమె ఏమీ ఎరగనట్లు వెళ్లిపోతుంది.

లక్ష్మణ్ సింగ్ కథని ఫ్లాష్ బాక్ లో చెబుతాడు చలం. లాలస అతనికి కొన్నేళ్ల క్రితం దూరమైపోయిన అతని భార్య. అతను మద్రాసులో న్యాయ శాస్త్రం చదువుకుంటున్న సమయంలో అతనికి పరిచయమవుతుంది. తన ప్రత్యేకమైన ప్రవర్తన అతనికి అంతుపట్టకపోయినా అతను ఆమె ఆకర్షణలో పడిపోతాడు. ఐతే ఆమె మాత్రం ఏడంస్ అనే వైద్య విద్యార్థి పట్ల అనురక్తి కలిగివుంటుంది. అతను కొన్నాళ్లు కనబడకపోతే లక్ష్మణ్ సింగ్ నే మధ్యవర్తిగా వాడుకుంటుంది. ఏడంస్, లాలస ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు కూడా. కానీ ఎవరికి తెలియని కారణాలతో ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ తరువాత సింగ్ తనని పెళ్లి చేసుకోమని లాలసకి ప్రతిపాదిస్తాడు కానీ ఆమె “పాపం, నిన్నా?” అంటూ తిరస్కరిస్తుంది. చదువైపోవటంతో అతనికి దూరమైపోతుంది. ఆమె అతనికి ఓ జ్ఞాపకంగా మారిపోతుంది. కానీ కొన్నాళ్ల తరువాత సముద్రం ఒడ్డున గాంధీగారి పిలుపు మేరకు ఉవ్వెత్తున ఎగిసిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటూ కనిపిస్తుంది. లాలసని పోలిసులు అరెస్టు చేస్తారు. లాలస కోసమే అతనూ ఆ రోజు ఆ ఉద్యమంలో దూరి లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడి దేశభక్తి కుటుంబానికి చెందిన మదాలస అనే యువతి సంరక్షణలోకి వెళతాడు ఆ రాత్రి. మదాలస అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నించినా అతనికి లాలస మీద వున్న ప్రేమ చేత వుండలేక అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించినందుకు లాలసకి తొమ్మిది నెలల జైలు శిక్ష పడుతుంది. లాలస జైలులో వుండగా వెళ్లి ఆమెని కలుస్తాడు సింగ్. విడుదల అనంతరం తనని వివాహం చేసుకోమంటాడు. ఐతే ఆమె తాను ఉద్యమానికే అంకితమయ్యానని అంటుంది. జైలులో నిరాహారదీక్ష చేయడం వల్ల ఆమెకి మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష పడుతుంది. ఆ తరువాత జైలు నుండి విడుదలైనా ఆమె అతన్ని కలుసుకోదు. “దేశ సేవా నిమగ్నమైన ఆమె మనసులో తనపైన ఎందుకు అంత బలమైన స్థానం వుండాలి? ఆమె త్యాగం ముందు తన బతుకు ఎంత అల్పం?” అని తనని తాను సమాధానపరుచుకుంటాడు సింగ్.
అలా దగ్గరగా వచ్చి మళ్లీ దూరమైపోయే లాలస ఒకసారి హఠత్తుగా రైల్లో వచ్చి అతన్ని కలుసుకుంటుంది. సింగ్ వాళ్ల ఊరు వెళ్లి పెళ్లి చేసుకుందామంటుంది. “చూడు, నిన్ను పెళ్లి చేసుకుంటాననుకో. కాని నిన్ను తరువాత డిజప్పాయింట్ చేస్తే నన్నేమనకూడదు. నాలో ఏవేవో అద్భుత మహిమలున్నాయని, చాలా గొప్ప సౌధం కట్టి, దాంట్లో నన్ను పెట్టి పూజ చేస్తున్నావు. అవేం నాలో లేవు. నేను నీకు ఆదర్శమైన స్త్రీని అనుకుంటున్నావు. కాను. నమ్మవు సరే. నువ్వు మాత్రం నాకు ఆదర్శమైన పురుషుడివి కావు. మరి ఎందుకు నిన్ను పెళ్లి చేసుకుంటున్నాననా? ఆదర్శమైన పురుషుడు భూమి మీద లేడని నాకు స్పష్టమైంది కనుక. నువ్వే నెక్స్టు బెస్టు. ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ నేనొకతెను వున్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక. నువ్వు నన్ను డిజప్పాయింట్ చెయ్యలేవు. నేను నిన్ను తప్పకుండా డిజప్పాయింట్ చేస్తాను. ఆనాడు ఈ మాటలు నీకు జ్ఞాపకం వుండవు. కానీ చెబుతున్నాను” అని సింగ్ తో సీరియస్ గా చెపుతుంది. అతని పట్ల ప్రేమ వుందో లేదో తనకేం తెలియదంటుంది లాలస. కానీ ఎవరి పట్లా లేని ఇష్టం మాత్రం అతని పట్ల వుందంటుంది. అన్నీ నిశ్చయంగా తేల్చుకున్నాకనే ఏదైనా చేయాలంటే ఏదీ జరగదనే ఉద్దేశ్యంతో “నిశ్చయం అయిందాకా కాచుకుని వుంటే ఏదీ చెయ్యలేం చచ్చిందాకా. జీవితం అంటేనే రిస్కు తీసుకోవడం. ఒక్క చావే ఏ ప్రయత్నం, ఏ సందేహం, ఏ రిస్కు లేకుండా నిశ్చయమైన విషయం జీవితానికి. పద పెళ్లి చేసుకుందాం” అని అంటుంది.

అనంతపురంలో పెళ్లి అనంతరం వారి కాపురం బాగా సాగుతుంటుంది. లక్ష్మణ్ సింగ్ కుటుంబ సభ్యులందరికీ ఆమె ప్రేమ పాత్రురాలవుతుంది. అనంతపురానికి మాల్వంకర్ అనే గొప్ప సంగీతజ్ఞుడు వస్తాడు. ఏ సంగీత వాయిద్యాన్నైనా అవలీలగా వాయించడం, పాడడం చేయగలడు మాల్వంకర్. “భక్తి, శృంగారం, దేశభక్తి ఏదైనా అతను పాడుతూ వుంటే శ్రోతలని తన కౌగిలిలోకి, హృదయంలోకి పిలుస్తున్నట్లుగా వుంటుందని, అతన్ని ఆ సమయాన ప్రేమించకుండా వుండలేరని” చలం వర్ణిస్తాడు.ఆ ఊరిలో రోజూ ఎక్కడో ఓ చోట అతని సంగీత కచేరీ జరుగుతుంటుంది. సన్మానాలు అందుకుంటుంటాడు. అతని సంగీతానికి అతుక్కుపోతుంది లాలస. ఆమెలోని ఆ ఆకర్షణని గమనించిన మాల్వంకర్ మరుసటి రోజు సింగ్ లేని సమయంలో వారింటికే వెళ్లి ఆమె కోసం ప్రత్యేకంగా కచేరీ చేస్తాడు. సింగ్ తమ్ముళ్లు, తల్లి ఏం చేయలేకపోతారు. లాలస మాల్వంకర్ని నివారించదు. క్రమక్రమంగా ఆమె దీపం చుట్టూ పరిభ్రమించే శలభంలా మాల్వంకర్ గానాకర్షణలో పడుతుంది. సింగు ఆమెకి చెప్పి చూస్తాడు. సింగు, లాలసల మధ్య దూరం పెరుగుతుంది. మాల్వంకర్ పట్ల ఆమెకున్న ఆకర్షణ కారణంగా దూరం పెరగడమనేది సింగ్ వైపు నుండి జరిగేదే. ఆమె సింగుతో శృంగారానికి నిరాకరించదు. సింగే ఆమె తన నుండి దూరం వెళ్లిపోవాలని అంతరంగంలో ఆశిస్తాడు. నిజానికి మాల్వంకర్ అసభ్య వర్తనుడు. ఏ మాత్రం సంస్కారం లేని వ్యక్తి. అతను లాలసకి ఏ మాత్రం గౌరవం ఇవ్వడు. ఆమె పరిస్థితిని లెక్క చేయడు. కానీ అతనిలోని కళ వల్ల అతనంటే ఒక వ్యసనమవుతుంది ఆమెకి. ఏం జరుగుతుందనేది ఏ మాత్రం ఆమెకి అర్ధం కాదు. జీవితంలో సాంఘిక బంధం, ఇరుగుపొరుగుల మర్యాద, బంధువుల్లో పరువు వంటి విషయాల కన్నా హృదయం కోరుకున్న అనుభవమే గొప్పది అని నమ్మిన ఆమె సింగ్ తనకి ఎంత నచ్చ చెప్పినా కుదుటపడదు. అన్ని వేళలా తన హృదయానికే ప్రాముఖ్యమిచ్చిన ఆమె మాల్వంకర్ తో వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోతుంటే సింగ్ ఆమెకి అడ్డు చెప్పడు. ఆమెకి ఆటంకం కలిగించొద్దని తన కుటుంబ సభ్యులను ఆదేశిస్తాడు. అతనికి పెళ్లి ముందు తనని డిజప్పాయింట్ చేస్తానని అన్న ఆమె మాటలు గుర్తొస్తాయి సింగ్ కి. మూడు నెలల తరువాత ఆమె మాల్వంకర్ని వదిలేసిందని అతనికి తెలుస్తుంది. అప్పుడే అతనికో ఉత్తరం రాస్తుంది తాను ఇబ్బందుల్లో వున్నానని, అతను అంగీకరిస్తే తిరిగి వస్తానని ఆమె రాస్తుంది. కానీ అతను స్పందించడు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ఆమె భీంలీ సముద్రం ఒడ్డున అతనికి తారసపడుతుంది.

ఐతే మరుసటి రోజు దేశికాచారి వాళ్లిద్దరిని క్రితం రాత్రి తన భార్యే రక్షించిందని చెప్పగానే ఆమె లాలస కాదనీ, తాను పొరపాటు పడ్డానని సింగ్ అనుకుంటాడు. ఐనా అతనిలో సందేహం. లాలసని నిలుపుకోలేని తన బలహీనత మీద అతనికి లోలోపల బలమైన అసంతృప్తి వుంది. అందుకే లాలస మళ్లీ కనబడిందనుకోగానే అతను స్తిమితంగా వుండలేకపోతాడు. దేశికాచారి లేని సమయం చూసి ఏ విషయమూ తేల్చుకుందామని వెళతాడు. ఆమె తాను లాలసని కాదని గట్టిగా చెబుతుంది. సింగ్ తిరిగి వచ్చేస్తాడు. దేశికాచారినే నేరుగా, గట్టిగానే ప్రశ్నిస్తాడు ఆమె గురించి. దేశికాచారి ఆమె గురించి తనకి ఏమీ తెలియదంటాడు. తను లేనప్పుడు తన ఇంటికి వెళ్లి తన భార్యని ఇబ్బంది పెట్టాడని తెలుసుకోగానే సింగ్ కి హెచ్చరిక జారీ చేసి వెళ్లిపోతాడు దేశికాచారి. దేశికాచారే ఏదో మాయ చేసి ఆమెని తనతో వుంచుకున్నాడనుకుంటాడు సింగ్. ఇంక తాను ఆమెని చూడలేనుకుంటాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు దేశికాచారి, అతని భార్య వారి గదికి వస్తారు. వారి సంభాషణల్లో అతనికి లాలస పట్ల ప్రస్తుతం ఎలాంటి దృక్పథం వుందో తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తారు. ఆమె మీద తనకి ఇప్పటికీ ప్రేమ వుందంటాడు సింగ్. అలా నిజంగా ప్రేమ వుంటే ఆమెని వదులుకునే వాడు కాదంటాడు దేశికాచారి. తాను ప్రజాస్వామికంగా ఆమె భావాల్ని గౌరవించానని, అందుకే వెళుతుంటే అడ్డుపడలేదంటాడు సింగ్. మాల్వంకర్ దుర్మార్గుడైనప్పుడు, అతనితో ఆమె సుఖపడలేదని తెలిసినప్పుడు, ఆమె మీద ప్రేమ వుంటే తన ప్రిన్సిపుల్స్ ని పక్కన పెట్టలేనితనం ప్రేమ రాహిత్యమంటాడు దేశికాచారి. ఆమె తిరిగి వస్తే ఆమెని అంగీకరిస్తానని అంటాడు సింగ్. ఈ సందర్భంగా వారి మధ్య జరిగే సంభాషణ గొప్పగా వుంటుంది. ఈ సంభాషణల్లో కొన్ని చోట్ల ఆమె లాలసే అనుకుంటాడు. మరికొన్ని చోట్ల ఆమె లాలస కాదేమో అనుకొని సందేహిస్తాడు.

ఆ తరువాత కూడా ఆమెకి, సింగుకి మధ్యా దాగుడుమూతలాట జరుగుతూనే వుంటుంది. సింగ్ మాత్రం ఆమే లాలస అని నిర్ధారించుకుంటాడు. ఆమెని తనతో వచ్చేయమంటాడు. ఆమె ఒప్పుకోదు. తాను లాలస కాకపోతే తన మీద ప్రేమ వుండదా, తనతో తీసుకెళ్లడా అని అడుగుతుంది. తన మీద ప్రేమ వుంటే తానే ఇక్కడ వుండిపోవచ్చుగా అని కూడా ప్రశ్నిస్తుంది. ఆమె నిజంగా దేశికాచారి భార్య అయితే ఆమె మీద ప్రేమ లేనట్లేనా అని అడుగుతుంది. మరో కుటుంబంలో సంక్షోభం సృష్టించననని, అది “లా” ఒప్పుకోదనీ అంటాడు. అంటే అతని ప్రేమని “నీతి” డామినేట్ చేస్తుందని అంటుందామె. అతనికి మాల్వంకర్ దుర్మార్గుడనీ తెలుసు. ఐనా అతనితో లాలస వెళ్లేలా చేశాడు. ఇప్పుడు దేశికాచారి మీద కూడా సదభిప్రాయం లేదు. అతనో మోసగాడని, ఆమెని ఏదో మాయ చేశాడనీ నమ్ముతాడు. రెండు సందర్భాల్లోనూ అతని ప్రిన్సిపుల్స్ అతని ప్రేమకి అన్యాయం చేశాయి. కొన్ని సందర్భాల్లో హాని చేసే ప్రిన్సిపుల్స్ ని వదులుకోలేని చాదస్తం నీతికి సంబంధించిన కుత్సితమైన అహాన్ని తృప్తి పరిచేవేనని ఆమె భావిస్తుంది. అందుకే లాలస “నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ కావచ్చు. కానీ నీతి గట్టిగా మనసుకి పట్టిన మనుషులు అందానికి అంధులౌతారనడంలోనే వుంది నీతిలోని నీచత్వం. ఎందుకంటే దేవుడే వుంటే అతను నీతి కన్న అందానికి చాలా దగ్గర. సృష్టి అంతా అందం. ఒక్క కుత్సితపు మానవుడిలోనే ఈ నీతి.” అని అంటుంది. ఒక సంక్లిష్ట సత్యాన్ని ఇంత సులువుగా చెప్పడం చలానికే సాధ్యం.

సింగ్, నరసింహారావు తిరిగి అనంతపురం వెళ్లిపోడానికి సిద్ధమైపోతారు. చివరిసారి తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించవలసిందిగా దేశికాచారి వారిని అభ్యర్ధించడంతో సింగ్, నరసింహారావు అతని ఇంటికి మరోసారి వెళతారు. అప్పుడు దేశికాచారి తన కథ చెప్పడంతో పాటు ఆమె లాలస అవునా కాదా అనే సస్పెన్సుకి తెర దించుతాడు. తాను బ్యాంకుని మోసం చేసి జైలుకెళ్లే ముందు తన మిత్రుడైన మాల్వంకర్ దగ్గర ఆ డబ్బు దాచానని, జైలు నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ సొమ్ముని అవసరంలో వున్న వారికి పంచానని, మాల్వంకర్ తన భార్యగా పరిచయం చేసిన లాలసని అప్పుడే చూశానని, ఆమెకి ఒక మిత్రుడిగా వ్యవహరించానని, తానే ఆమె భర్త (సింగ్)కి ఉత్తరం రాయించానని, ఆ తరువాత ఆమె తనతో వుండిపోయిందనీ చెబుతాడు. ఆమె భర్త సింగ్ అని ఈ రోజే తెలిసిందనీ చెబుతాడు. సమస్యని వారిద్దరే పరిష్కరించుకోవాలని సూచిస్తూ, తాను తిరిగి వచ్చే సమయానికి ఆమె వస్తే లాలసని తీసుకెళ్లిపొమ్మని లేదా వదిలేసి పొమ్మని చెప్పి నరసింహారావుని తీసుకొని బైటికెళతాడు. లాలసని తనతో రమ్మని సింగ్ అడిగితే లాలస ఏమి జవాబిచ్చిందో, అతనితో వెళ్లిపోయిందో లేదో మీరే నవల చదివి తెలుసుకుంటే బాగుంటుంది. ఆమె నిర్ణయంతో నవల అయిపోతుంది.
**

చలం మిగతా సాధారణ నాయకల్లా “జీవితాదర్శం”లో లాలస కూడా సాహసవంతురాలే. ధిక్కార స్వభావే. ముక్కుసూటి మనిషే. జీవితమంటే హృదయానికి నచ్చిన అనుభవాల కోసం చేసే అన్వేషణ అనుకునే మనిషే. జీవితం అన్నాక ప్రేమించే మనుషులు, ప్రేమించబడే వారు, వారితో అనుబంధం, మధుర జ్ఞాపకాలు…అన్నీ వుంటాయి. ఐతే అంతకు మించి స్వీయ అస్తిత్వానికి విలువ ఇవ్వడమనేది కూడా వుంటుంది. ఆ విలువ తనకి తాను ఇచ్చుకున్నంత మాత్రాన ఇతరుల పట్ల ప్రేమ పోవలనేం లేదు. కానీ ఆ ప్రేమల్ని నిలుపుకోవాలంటే తన విలువని త్యాగం చేయాలన్న డిమాండ్ ఎదురవుతుంటుంది. ఐతే లాలస తన ప్రేమల్ని, అనుబంధాల్ని నిలబెట్టుకోడానికి తన స్వీయ అస్తిత్వాన్ని ఒక ధరగా చెల్లించే బలహీనతకి లేదా ఆలోచనారాహిత్యంకి లేదా మొహమాటానికి గురి కాదు. ఆమె తన జీవితాదర్శం శాంతి అని, అది మరొక వ్యక్తితో ప్రేమలో కంటే మానసిక ఐక్యతలో దొరుకుతుందనీ, ప్రేమకి అనేక పరిమితులుంటాయని, ఐక్యత లేని మోహ భావోద్వేగాలు జీవితంలో శాంతిని హరిస్తాయని, దుఃఖభాజనం చేస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది.

లాలస వ్యక్తిత్వం చాలా దృఢమైనది. ఆమె అభిప్రాయాలకీ ఆచరణకీ తేడా వుండదు. లక్ష్మణ్ సింగ్ తో మాటల సందర్భంగా కరుకుగా కనిపించే ఆమె హాస్యంలో కూడా ఆమె వ్యక్తిత్వం ద్యోతకమవుతుంటుంది. తనని పెళ్లి చేసుకోమని సింగ్ అడిగినప్పుడల్లా “పాపం, నిన్నా?” అని అడుగుతుంది. ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఒకసారి వెళ్లి ములాకత్ లో కలుస్తాడు. “లాలసా, ఏమిటి ఇట్లా ఏ చాన్సు వల్లనో కలుసుకొని విడిపోవడమేనా?” అని అడిగితే “అంతకన్నా ఏం చేద్దామంటావు?” అని సూటిగా ప్రశ్నిస్తుంది. అతనితో అంతకు మించి ఏం జరిగే ఆస్కారమున్నట్లుగా ఆమెకి తోచదు అప్పుడు. ఆమె ఎక్కడా లేనిది ఊహించుకోదు. భావోద్వేగాల్ని డ్రమటైజ్ చేయదు. తన హృదయం చెప్పినట్లే మాట్లాడుతుంది, ఒక ఖచ్చితత్వంతో వ్యవహరిస్తుంది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకుల, కార్యకర్తల అవకాశవాద వైఖరి, అవినీతి గమనించి, అలాంటివారు చేసే ఉద్యమాలు నిష్ప్రయోజనమని నమ్మి ఆ ఉద్యమానికి దూరమవుతుంది. ఆమెకి జీవితం, అదిచ్చే విలువైన అనుభవాలు, అనుభూతులు ముఖ్యం. ఒక అలవాటైన, సాంప్రదాయక ఆలోచనలకి, సంభాషణలకి ఆమె దూరం. లాలసలోని జీవన లాలస తత్వాన్ని దృష్టిలో పెట్టుకునే చలం లాలస అని పేరు పెట్టి వుండొచ్చు. ఆమెలోని ప్రతి ఆలోచన, ఉద్వేగం, అభిమానం ఆమె ముఖంలో, శరీర భాషలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

సింగ్ ని వదిలేయడం లాలస తప్పు కాదా? ఆమె తన దారి తాను చూసుకోవడం సరైనదేనా అనే ప్రశ్నలు తీర్పరి దృష్టితో వేసే వాళ్లు ఆమెని ఖండించక వుండరు. కానీ ఆమె తత్వం అసాధారణమైనది. జీవితానికి అనుభవమే అర్ధం, పరమార్ధం అనుకునే మనిషి ఆమె. తన హృదయాన్ని కదిలించే వ్యక్తుల వైపు, పరిస్థితుల వైపు ఆమె వెళ్లిపోతుంది. లక్ష్మణ్ సింగ్ తో వివాహానికి ముందే ఆమె మనస్తత్వాన్ని, జీవితం పట్ల ఆమె దృక్పథాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు చలం. జీవితం మరొకరి కోసం కాదు, దాన్ని స్వేచ్ఛగా, అనుభవ ప్రధానంగా, తన నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తూ గడపాలన్నది లాలస వైఖరిగా కనబడుతుంటుంది. లాలస మాల్వంకర్ తో సన్నిహితంగా వుండటాన్ని లక్ష్మణ్ సింగ్ అంగీకరించలేడు. అతను లాలస తనకి మాత్రమే నిబద్ధమై వుండాలని అనుకుంటాడు. ఇది లోకంలో ఏ మగవాడైనా కోరుకునేదే కావొచ్చు. ఐతే లోకం అంగీకరించిన విషయాలన్నీ అన్ని సందర్భాలలో సముచితమైనవి కావాలని లేదు. ఆమె ఏ రకమైన భిన్నమైన ఆలోచనలున్న మనిషో, ఆమె స్వభావమేమిటో, తనకు ఇష్టం వచ్చినదాని కోసం ఎలా ఎంత దూరమైనా వెళుతుందో లక్ష్మణ్ సింగ్ కి ముందే తెలుసు. ఐనా ఆమెని కోరుకొని, తపించి మరీ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తరువాత ఆమెలో మార్పు రాలేదు. ఆ వచ్చిన మార్పు నిజానికి లక్ష్మణ్ సింగ్ లోనే వుంది. అతనిలోని ఆమె మీది ప్రేమ ఆమె మీద నియంత్రణగా మారుతుంది. అతనికి ఆమె కంటే కుటుంబ పరువు, మర్యాద ముఖ్యమైపోతాయి. తన మీద ప్రేమ అంటే తనకి మాత్రమే కట్టుబడి వుండటమని, అలా వుండలేకపోతే తనకి ఆమె అవసరం లేదన్నట్లుగానే వ్యవహరిస్తాడు. ఆమె తనని విడిచి వెళ్లిపోవాలనే అంతరంగంలో కోరుకుంటాడు. ఆమె వెళ్లిపోయిన కొన్నాళ్ల తరువాత ఆమె తాను కష్టాలలో వున్నానని, అతను అంగీకరిస్తే తిరిగి వస్తానని ఉత్తరం రాస్తే కనీసం సమాధానం కూడా ఇవ్వడు. లాలసతో తన ప్రేమని ఎంతో బలంగా వ్యక్తీకరించిన సింగ్ నిజానికి తన ప్రేమకి తాను కట్టుబడి వున్నాడా? ప్రేమంటే ఇవ్వడమే ఐతే, ప్రేమంటే సహనమే ఐతే, ప్రేమంటే అర్ధం చేసుకోవడమే ఐతే సింగ్ లోని ప్రేమికుడి స్థాయి ఎంతటిదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తాను ప్రేమిస్తున్నాననుకునే వ్యక్తి హృదయాన్ని, కోరికల్ని, మనస్తత్వాన్ని, ప్రవర్తనని అర్ధం చేసుకోకుండానే తనలోని బలీయమైన ఆకర్షణని రకరకాలుగా వ్యక్తీకరించి, దగ్గరై, ఒక పరీక్షా సమయంలో చల్లబడిపోయే సాధారణ వ్యక్తి సింగ్. చిత్రం ఏమిటంటే లోతుగా ఆలోచించకపోతే సింగ్ పట్లనే పాఠకులలో సానుభూతి కలుగుతుంది. అతనికి అన్యాయం చేసిన మనిషిగా లాలస భావించబడుతుంది. ఎంతైనా లోకం తీరు ఇదే కదా?

దేశికాచారి ద్వారా చలం ఒక సంక్లిష్ట వాస్తవికతని తన రచనలో ఆవిష్కరిస్తాడు. సాధారణంగా సమాజం పట్ల ఎలాంటి అపచారం, ఫ్రాడ్ చేయనివారు తమ నిత్య జీవితంలోని మానవ సంబంధాలలో ఆ నిజాయితీని చూపించలేక పోవచ్చు. అదే విధంగా సమాజం పట్ల ఫ్రాడ్ చేసేవారు వ్యక్తుల పట్ల నిజాయితీగా వుండొచ్చు. మానవ సంబంధాలకి ప్రాముఖ్యత ఇవ్వొచ్చు. ఇది ఖచ్చితంగా ఒకే పద్ధతిలో జరుగుతుందని చెప్పలేం. కానీ నీతి, నిజాయితీ అనేవి స్థల, కాల, సందర్భాలని బట్టి వుంటుంది. మాల్వంకర్ సంగీతంలో ఎంతటి ప్రతిభావంతుడైనా అతను తనని అభిమానించే వ్యక్తుల పట్ల ధూర్తుడుగానే వుంటాడు. తనని ఆరాధించే వారిని నిరాశ పరచడంలో, బానిసలుగా చూసి అవమానించడంలో దొరికే తృప్తి డబ్బులో దొరకదు అతనికి. అందుకే దేశికాచారి తన దగ్గర దాచిన అవినీతి సొమ్ముని అతను జైలు నుండి వచ్చాక తిరిగి ఇచ్చేస్తాడు. నిజాయితీ వుండటం, నిజాయితీ లేకపోవడం ఒకే వ్యక్తిలో అన్ని విషయాల పట్ల ఒకే రకంగా వుండదు. అదే విధంగా ఏకశిలా సదృశమైన నిజాయితీ కూడా అందరిలో కనిపించదు. ఇది చలం ఆవిష్కరించిన సంక్లిష్ట సత్యం.

చలం సాహిత్యంలోకెల్లా అత్యంత విలక్షణమైన కేరక్టర్ దేశికాచారి. మనుషుల పట్ల నిజాయితీగానూ, గతంలో వ్యవస్థ పట్ల మోసపూరితంగానూ వున్నవాడు. అతనికి అపారమైన జ్ఞానం వుంది. విశ్వ సాహిత్య పరిచయం వుంటుంది. మానవ సమబంధాలు, రాజకీయాలు, ఉద్యమాలు, కళలు, ఆర్కిటెక్చర్, ప్రకృతి పట్ల అవగాహన… ఇలా మనుషులకు, సమాజానికి సంబంధించిన అనేక విషయాల పట్ల అనర్గళంగా సంభాషించగల చాతుర్యం వుంది. ఎన్నున్నా అతను తామరాకు మీద నీటిబొట్టులా వుంటాడు. తనకి పరిచయమున్న ప్రతివారి పట్ల బాధ్యతగా వుంటూనే ఎవరి పట్లా అధికారాన్ని, నియంత్రణని కోరుకోనివాడు. అతగాడు వ్యక్తుల మంచి చెడుల విశ్లేషణలకు పూనుకొని తీర్పరితనం చూపించనివాడు. చాలా ధైర్యవంతుడు. ఒక మనిషి మీద తన జీవితానందాన్ని మోపనివాడు. అవతలి వ్యక్తి స్వేచ్ఛలో తనని తాను చూసుకునేవాడు. ఏ వత్తిళ్లకు గురికానివాడు. మంచైనా, చెడైనా అన్నీ తెలిసే చేస్తాడు. అందుకే లాలసని, లక్ష్మణ్ సింగ్ ని వంటరిగా వదిలేసి తాను తిరిగి వచ్చే సమయానికి ఆమె వస్తే లాలసని తీసుకెళ్లిపొమ్మని లేదా వదిలేసి పొమ్మని చెప్పి బైటకి వెళ్లిపోతాడు. “ఆమె వెళ్లడం బాధే. కానీ వెళ్లాలనుకుంటే ఆమెని ఏ విధానో, ఏ కృతజ్ఞతనో బోధించి వుంచుకోడం నాకు బాధే కాదు – అసహ్యం, నీచం. స్త్రీ ఎడల ప్రేమ గలిగిన మనిషి చేసే పని కాదు అది.” అంటాడు. ఇది నిజమైన ప్రేమ. “జీవితాదర్శం శాంతి. ఆ శాంతిని భగ్నం చేసే ఏ సుఖమూ, ఏ గొప్పతనమూ, ఏ శృంగారమూ నా జీవితానికి చాలా విరోధం. అంటే శాంతిని భగ్నం చేసేది సుఖమూ కాదు. గొప్పతనమూ కాదు, శృంగారమూ కాదు” అని జీవితం పట్ల తన పరిపక్వమైన తాత్విక దృక్పథాన్ని చెబుతాడు.

అతి సామాన్యుడిగా పరిచయం చేసిన లక్ష్మణ్ సింగ్ నవల ముందుకెళుతున్న కొద్దీ ఒక గొప్ప ప్రేమికుడిగా, ప్రజాస్వామికవాదిగా మనకి కనిపిస్తుంటాడు. అతనికి లాలస అంటే గొప్ప మోహం, ఆకర్షణ, ప్రేమ. ఎల్ల కాలమూ, ఎల్ల వేళలా ఇద్దరూ ఒకరికొకరు కనెక్ట్ అయివుండాలని బలంగా కోరుకుంటాడు. “ఈ ప్రపంచంలో ఆదర్శ పురుషుడు అంటూ ఎవరూ వుండరు. కానీ మిగతావారితో పోలిస్తే నువ్వు నాకు దగ్గరగా వుండగలవు. అందుకే నిన్ను చేసుకుంటున్నా.” అని లాలస అంటుంది. వివాహంలో వ్యక్తుల ఎంపిక అనేది నిజానికి ఆదర్శం, భావాల, అభిరుచుల కలయిక ప్రాతిపదికగా వుండకూడదు. అది ఇద్దరి మధ్య అనుకూలత (కంపేటిబిలిటీ) ప్రాతిపదికగా వుంటేనే జీవితం శాంతిమయం కాగలదు. ఈ విషయంలో లాలస స్పష్టంగా వుంటుంది. ఆదర్శమనేది చాలావరకు వ్యక్తిగతం. అది భిన్న స్థాయిలలో వ్యక్తుల మధ్య భిన్న స్థాయిలలో ఆచరణలో వుంటుంది. అందుకే “ఆదర్శ స్త్రీ కూడా వుండదు.” అని లాలస తేల్చి చెప్పగలుగుతుంది. అసలు ఆదర్శం అనేదానికి ఓ నిర్దిష్టమైన అర్ధం వుందా? తనంటే వెర్రి ప్రేమ వున్నప్పటికీ సంఘనీతిని ఆదర్శంగా నెత్తికెత్తుకున్న లక్ష్మణ్ సింగ్ తో ఆమెకి సహజీవనం సాధ్యం కాలేదు. సంఘాన్ని మోసం చేసి జైలుకెళ్లినా తన పట్ల ఆ వెర్రి ప్రేమ లేకుండా కేవలం కన్సర్న్, అనుకూలత, మానసిక ఐక్యత కలిగి వున్న దేశికాచారితో ఆమెకి శాంతితో కూడిన సహజీవనం లభ్యమవుతుంది. అందుకే లక్ష్మణ్ సింగ్ తో లాలస దేశికాచారి గురించి “ఆయనలో ప్రేమకి అతీతమైన శాంతి. ఎందుకంటే ఆయనకి కోర్కెలూ భయాలూ లేవు. బాధని తప్పించుకోవడంలో నేర్పరి. కానీ బాధని చూస్తే భయం లేదు. ఆయన హృదయంలో శాంతి ఆకాశంలోమల్లే” అంటూ దేశికాచారి అసలు హృదయాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ అంటుంది. అంతేకాదు దేశికాచారి, సింగులని పోలుస్తూ “మీకూ నాకూ మధ్య గొప్ప ప్రేమా, శృంగారము. నాకూ ఆయన(దేశికాచారి)కి మధ్య ఎన్నడూ ప్రేమ లేదు. విడువలేనితనం, ఆశా, ఉద్రేకం ఇవేవీ లేవు. కానీ మధ్య గొప్ప ఐక్యం, శాంతి. ఎందుకంటే ఆయన ఏ పట్టూ, ప్రెజుడిసెస్ లేకుండా జీవితాన్ని మధించి, సుఖపడే రహస్యాన్ని కనిపెట్టారు.” అంటుంది.

ఈ నవల చదువుతున్నంతసేపూ మనకి భీమిలీ సముద్ర హోరు, కెరటాల చప్పుడు, కొండగాలి వినబడుతుంటాయి. ఇంకా ఆ చుట్టుపక్కల ప్రకృతి అందాలు మన ముందు ప్రదర్శనగా కనబడతాయి. భీమిలీ అందాల్ని దేశికాచారి ద్వారా చలం ఇలా చెప్పిస్తాడు “వరసగా సముద్ర తీరమంతటా వున్న ఈ చిన్న రాళ్ల వల్ల నిరంతరమైన ఆకర్షణ ఈ సముద్రానికి. యిలా కూచుంటే ఎండలో నీళ్లు రాళ్లకి తగిలి పైకెగిరినప్పుడు చాలా రంగులతో మెరుస్తుంది. ఆ తుప్పర ప్రతి దినమూ ఆ రాళ్లని ముంచెయ్యడమూ మళ్లీ వొదిలి దూరంగా వెళ్లడమూ. అదేదో గొప్ప లీల. ఒకనాటి తీరం ఇంకోనాటిలా వుండదు. పైగా ఆ నది. ఆ నదిని దాటారా? దాటండి రేపు. ఒక్క నిమిషంలో ఏదో నిర్జనమైన తీరానికి వెళ్లిపోయినట్లు అవుతుంది. ఎదురుగా ఆ కొండ. ఆ కొండ మీద ఆ నీటి కొలనులు చూశారా? వాటిలో పువ్వులు, ఈ నిర్మలాకాశం. ఇంత ఎండాకాలంలోనూ మంచు కొండల మీద నించి వస్తున్నట్లు చల్లగాలి. నది ముందు మెట్ల మీద మర్రి చెట్టు కింద కూచున్నారా?” చలం భీమిలీ అందాల్ని ఆస్వాదించడమే కాదు, మనకి కూడా తన అక్షరాల ద్వారా ఇలా ఆ అనుభవాన్నిస్తాడు. అంతేకాదు, ప్రకృతితో దేశికాచారి మమేకత అతని పరిపక్వ మనస్తత్వానికి ఎంతో దోహదం చేసిందని కూడా అర్ధం అవుతుంది. ప్రకృతిలో వుండే సహజత్వం, సౌందర్యం, తాత్వికత అతని వ్యక్తిత్వంలో కూడా కనబడుతుంది. అందుకే ఓ చోట “ఆనందం ఎంత సులభం, ఎంత సహజం? మనుషులకు ఎందుకు వుండవో కళ్లు?” అని దిగులుగా అంటాడు దేశికాచారి.
**

మీరు ఓ ప్రపంచ స్థాయి తెలుగు పుస్తకం చదవాలనుకుంటే నిస్సందేహంగా “జీవితాదర్శం”ని ఎంచుకోండి.

~ అరణ్య కృష్ణ

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Book Review chalam story book
Previous Articleభార్యలొస్తున్నారు జాగ్రత్త!
Next Article AN EXTRAORDINARY ARTIST FROM BENGAL
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త రైల్వే చార్జీలు

india news July 1, 2025

భారతీయ రైల్వే శాఖ జూలై 1, 2025 నుంచి కొత్త రైల్వే ఛార్జీలను అమలు చేస్తోంది, ఇవి జూన్ 30,…

Add to Bookmark Bookmark

జులై 8 కంటే ముందే భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటన

July 1, 2025

ట్రంప్ నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా

July 1, 2025

70 ఏళ్లు దాటిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా

July 1, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.