Thursday, 19 March 2026

రాయలసీమ ప్రతిఘటనా స్వరం..

భూమనా! ఓ భూమనా!
————————————–
A Genius of Three Generations

భూమనా! ఓ భూమనా!
రాయలసీమనా! రగిలే భూమనా!
నిన్ను నడిపిస్తున్నది మన వేమనా?
పిలిస్తే పలికే ప్రేమనా?
కురిసే జ్ఞాపకాల వాననా! భూమనా!

నువ్వు చూడని ఎత్తుల్లేవు.
నువ్వెక్కని కొండల్లేవు.
నువ్వు నడవని ఉద్యమాల్లేవు.
ఇంకా ఎక్కడికి భూమనా ఈ అలుపు లేని పయనం?
ఏ దూరాలకి? ఏ తీరాలకి?
ఏ ఆత్మావలోకనపు లోయల్లోకి?
ఏ నీటి కెరటాల మీద వెల్తుర్ని వొడిసి పట్టుకోడానికి?
శాంతి లేనివాడా! విశ్రాంతి కోరనివాడా!
ఇంకా ఎక్కడికి? ఏ దిగంతాలకి?
వురికే జలపాతంలా ఏమిటా దూకుడు?
ఏ పురాతన శిలల గుండెచప్పుడు వినడానికి?
ఏ విశ్వమానవ మహాస్వప్నం అంచుల్లోకి?
ఏ కొత్త నక్షత్రలోకాల్ని డిస్కవర్ చేయడానికి?
అయినా తిరిగి చెడ్డవాడు లేడులే!

పెన్నేటి పాటలా ప్రవహించే భూమనా…
పెద్దాయనా! నీకు నా శుభకామన.
నీ మాటలకు పరవశించి, నీ ప్రసంగానికి ముగ్దులై,
నీ వాక్పటిమకు దగ్ధమై మూర్ఛిల్లిన వాళ్లు
నిన్ను వక్త అంటున్నారు.
వొట్టి వక్తవేనా? కాదు, నువ్వో శక్తివి.
రగులుతున్న రాయలసీమ విముక్తివి!

* * *

“బాగా రాస్తున్నారు మీరంతా” అని కొత్తతరం భుజం తట్టి దీవించి ప్రేమించిన తండ్రివి! మల్లెపూల
చెండు లాంటి నవ్వుతో మమ్మల్ని హత్తుకున్న
స్నేహితుడివి, భావుకుడివి!

నువ్వొక్కడివే కాదులే భూమనా!
ఆ రాయలసీమ రెడ్లలోనే ఏదో మేజిక్ వుంది!

ఎక్కడిదాకో ఎందుకు? మీ తమ్ముడే వున్నాడుగా కళ్ళెదురుగా! భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే, నికార్సయిన రాజకీయ నాయకుడు గాంధీజీ ఆత్మకథని ప్రచురించడం ఏమిటి? ఉచితంగా పంచడం ఏమిటి? “అధికార లాలసా రాజకీయాలలో జరిగిన అపచారాలకు కించిత్తు పాపపరిహారం కోసం గాంధీజీ ‘సత్యశోధన’ని ప్రచురించాను అనడం ఏమిటి? అదెంత నిజాయతీ! ఆ ఒక్కమాట నా లోపల ఎన్ని వేల వెలుతురు తలుపుల్ని తెరిచిందో ఎలా చెప్పడం?

ఐనా కరుణాకర్ రెడ్డి అనేవాడికి “కన్యాశుల్కం”తో ఏం పని? అంత శ్రద్ధగా, అంత అందంగా ప్రింట్ చేయడం… ఎంత పెద్ద మనసు. ఊరుకున్నాడా? అరచేతిలో పట్టే మహాప్రస్థానాన్ని ఏకంగా 10వేల కాపీలు ముద్రించడం, దాన్ని ‘జేబులో తుఫాన్’ అనడం, వందల మందికి పంచడం..
మరిచిపోగలిగే విషయమా అది?
శ్రీశ్రీనే వుంటే ఎంత ఆనందించేవాడు!

“మోహన్ కేం ప్రకాషున్నాడు” అని నన్ను కొందరు మెచ్చుకుంటూ వుంటారు. నీకేం భూమనా, కరుణాకర్ రెడ్డి వున్నాడు తిరుపతి కొండలాగా! తమ్ముళ్ళేమీ తక్కువనాయాళ్లు కాదుసుమా!

* * *

జర్నలిస్టుగా రేణిగుంటలో పనిచేసినవాణ్ణి.
తిరుమల కొండ మీద తెల్లవారుజామున
చల్లగాలిలో తేలుతూ వచ్చే కర్పూరం సుగంధాన్ని, ఎంఎస్ సుబ్బులక్ష్మి సుస్వరాన్నీ అనుభవించినవాణ్ణి. కర్నూలు కల్కురా హోటల్లో కాఫీ, కడపలో కారందోసే, అనంతపురంలో రాగిసంగటి – నాటుకోడి, పుత్తూరు స్పెషల్ వొక్కపొడి రుచులను మరిగినవాణ్ణి!
అడవిని జయించిన కేశవరెడ్డితో కలిసి తిరిగినవాణ్ణి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు భుజమ్మీద చేతులేసి నడిచినవాణ్ణి! గజ్జెల మల్లారెడ్డి ప్రేమని పొందిన అదృష్టవంతుణ్ణి. రాచమల్లు రామచంద్రారెడ్డి, బండి గోపాలరెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరామ్, సొదుం రామ్మోహన్, పి రామకృష్ణారెడ్డి, ఎం.వి రమణారెడ్డి లాంటి సృజనాత్మకమైన రచయితలతో, నిండైన మానవులతో రోజులు, వారాలు… నెలలు గడిపినవాణ్ణి. మొహమాటానికి ఈషణ్మాత్రమూ తావులేని వాళ్ళ సూటిదనమూ, రక్తమోడుతున్నా రాజీపడనితనమూ, జనం పక్షాన నిలిచే నిబద్ధతా చూసి మురిసిపోయినవాణ్ణి!

* * *

చిలుకూరి నారాయణరావు గారి పేరు విన్నారా? రాయలసీమ అనే పేరు పెట్టింది ఆయనే అని తెలుసా?

కర్నూలు జిల్లా బెలుం గుహల్లో పాత శిలాయుగం పనిముట్లు, దంతహారాలు, వంపుటెముకలూ దొరికాయని విన్నారా?

1835లో బళ్లారి నుంచి వచ్చిన “సత్యదూత” తొలి తెలుగు పత్రిక అవునా? కాదా?

తొలి పత్రికకూ, తెలుగు జర్నలిజానికీ పుట్టిల్లు రాయలసీమ అని మీకు తెలుసునా?

బ్రిటిష్ వాడిని తిడుతూ సంపాదకీయం రాసిన గాడిచర్ల హరిసర్వోత్తమరావుని రాజద్రోహం అంటూ మూడేళ్లు జైల్లో పెట్టారనే విషయం గుర్తుందా?

ఇలాంటివెన్నో విశేషాలు, రాజకీయాలు, రాయలసీమ వేదన, ఉద్యమం, కవిత్వం, ఒకనాటి విప్లవోత్తేజం అన్నిటినీ బిగువు సడలకుండా, వాక్యం వెంట వాక్యాన్ని పరిగెత్తిస్తూ మనకోసం, ముందు తరాల కోసమూ విలువైన వ్యాసాలుగా భద్రపరిచిన వాడు భూమన్. చరిత్ర అంటే గౌరవం, డీటెయిల్స్ పట్ల శ్రద్ధ, ఉద్యమ నేపథ్యం, రాయలసీమపై అవ్యాజమైన అనురాగం వ్యాసాల నిండా పూల పరిమళంలా పరుచుకుని వుంది. 520 పేజీలున్న ‘రాయలసీమ ముఖచిత్రం’ అనే భూమన్ వ్యాస సంపుటి
ఒక అధికారికమైన రికార్డు.
మనకో అరుదైన బహుమానం.

75 సంవత్సరాల వయసున్న భూమన్ తొలి తరం విప్లవకారుడు. శ్రీశ్రీ నుంచి త్రిపురనేని మధుసూదన రావు దాకా… “కదలిక” ఇమామ్ నుంచి ఎంవి రమణారెడ్డి దాకా ఎందరో సాహితీవేత్తలతో కలిసి తిరిగిన భూమన్ గత 60 సంవత్సరాల కమ్యూనిస్టు రాజకీయాలకి, రాయలసీమ ప్రజా ఉద్యమాలకీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచి వున్నారు.

* * *

పెనునిద్దర వదిలించిన లే, ఝుం ఝు..లాంటి
ఎర్రని కవి తా సంకలనాల్లో 50 ఏళ్ల నాడే
భూమన్ కవితలు చదివాను. అసలు పేరు
భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి అని, విద్యాధికుడని, అధ్యాపకుడనీ అప్పటికి నాకు తెలీదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం హైదరాబాదులో ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసుకి వచ్చినపుడు చూశాను భూమన్ని. సూటిగా వున్నది వున్నట్టుగా మాట్లాడే మనిషిని – నిజమైన సీమతత్వాన్ని!

మళ్లీ మొన్న (2022) ఎంవీ రమణారెడ్డి సంస్మరణ సభ… పొద్దుటూరులో కలవడమే. ఉదయం కాఫీ తాగుతున్నపుడు, “రమణారెడ్డీ, నేనూ చాలా తప్పులు చేశాం” అని నేరుగా చెప్పినపుడు ఆశ్చర్యంతో లోపల నరాలు తెగినా నవ్వుతూనే విన్నాను. ఆ తప్పులు ఏంటో కూడా దాచకుండా వివరంగా చెప్పారు భూమన్.

మైక్ ముందు ఉపన్యాసం అయినా, మనతో కూర్చుని మాట్లాడుతున్నపుడు అయినా, విషయం చెప్పడంలో – ఆ ప్రజెంటేషన్ లో ఒక అందం, ఆకర్షణ, పూలసుగంధం లాంటి ఒక ఆప్యాయత మనల్ని కట్టిపడేస్తాయి. ఒకనాడు అలాంటి irresistible attraction కుసుమకుమారి గారిని ఉక్కిరిబిక్కిరి చేసే ఉంటుంది.

* * *

సంఘటనాత్మకం కాని యవ్వనం, యవ్వనమే కాదంటాడు కవి. 48 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు భూమన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు ముషీరాబాద్ జైల్లో ఉన్న భూమన్ – కిష్టాగౌడ్, భూమయ్యలను కలిశాడు. మాట్లాడాడు.
అది ఎంత గొప్ప సందర్భం… వాళ్ళిద్దరినీ ఉరితీయడానికి కొద్దికాలం ముందు!

రాయలసీమలో నీళ్లు ఎండిపోయినట్టుగా కాలం కళ్ళముందే ఆవిరైపోయింది. రాజకీయాల్లో దొంగ వేషాలు పెరిగాయి. విప్లవోద్యమం నీరసపడింది. రాయలసీమ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. సీమ దాహం తీరనే లేదు. మైసూరారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎంవీ రమణారెడ్డి లాంటి నాయకులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. అపుడు మదనపల్లి నుంచి పోతిరెడ్డిపాళెం రెగ్యులేటర్ దాకా 614 కిలోమీటర్లు… పాదయాత్రలో భూమన్ పాల్గొన్నారు. 22 రోజుల నడకతో రాయలసీమని కదిలించారు. కవిత్వం, కమ్యూనిజం, కార్యాచరణ – భూమన్ని
ఒక true human గా తీర్చిదిద్దాయి.

ఈ సీమలో చినుకు రాలేదెప్పుడో?
ఈ బతుకులు చిగురించేదెప్పుడో?
అని ఆ మానవుడు కలత చెందని క్షణం లేదు.

* * *

“మనసా, ఇది మానవ సంఘమెట్లగునే” అని ప్రశ్నించిన లెజెండరీ విద్వాన్ విశ్వం
‘పెన్నేటి పాట’ని గుర్తుచేస్తూ,
“కోటి గొంతుల కిన్నెర మీటికొనుచు
కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు”
అంటూ రాయలసీమ కన్నీటి పాటని పాడి వినిపిస్తున్నారు భూమన్.
ఇంకా అన్నమయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కట్టమంచి రామలింగారెడ్డి, బండి గోపాలరెడ్డి, గుత్తి కేశవ పిళ్ళె, గాడిచర్ల, పెన్నేటి కథల పి రామకృష్ణారెడ్డి వంటి మహానుభావుల జీవనరేఖల్ని వాళ్ల హృదయ స్పందనలనీ ఉత్తేజకంగా రికార్డు చేశారు భూమన్.

తడారిపోయిన ఎడారి లాంటి రాయలసీమ బీడు భూముల్లో భార్యాభర్తల శ్రమ ఎలాంటిదంటే “విసుక్కోడానికి కూడా తీరికలేని కాయకష్టం వారిద్దరిదీ” అని గుర్తుచేస్తున్నారు.

74 సంవత్సరాలు దాటిపోయాయి, చాలిక… కృష్ణారామా అనుకుంటూ ఇంటిపట్టున వుండే రకం కాదు. జనాన్ని పోగుచేయడం, రోజూ కొండలెక్కడం, పెద్ద రాళ్లగుట్ట మీది నుంచి వాగుల్లోకి దూకడం,
ఈత కొట్టడం… భూమన్ కి ఇప్పుడు ట్రెక్కింగ్ ఒక దినచర్య. లోయల్లో, కొండల్లో, జలపాతాల్లో, నీలాకాశం కింద, ఆకుపచ్చని చెట్ల నీడల్లో జీవనానందాన్ని వెతుక్కుంటున్న భూమన్ అంటే అసూయ నాకు. స్వచ్ఛమైన చెరువుల్లోని
తేటనీటిని దోసిలితో జీవనామృతంగా
స్వీకరించే ఈ నవయవ్వనుడంటే ఈర్ష్య నాకు.

* * *

తొలి యవ్వనంలోనే గుడిపాటి వెంకటచలం రచనలు భూమన్ని అతలాకుతలం చేశాయి. నిద్రపట్టనివ్వకుండా చేశాయి. చలం తిరువన్నామలై లో ఉంటారని తెలుసుకుని విల్లుపురం ప్యాసింజర్ ఎక్కి కూర్చున్నాడు. టికెట్ లేదు. టిసి పట్టుకుంటాడన్న భయమూ లేదు. చలాన్ని చూడాలి, మాట్లాడాలి… అదే జీవితాశయం. చలం ప్రేమగా పలకరించారు. సౌరీస్, నర్తకి, చిత్ర, కృష్ణారావు అంతా అక్కడే వున్నారు. చలంతో భూమన్ ఈవెనింగ్ వాక్, కబుర్లు! నెలరోజులు చలం సమక్షంలో గడిపారు భూమన్! రెండోసారి చలాన్ని కలిసినపుడు, “నేను నక్సలైట్ ని అయిపోయాను. ఇక మీ దగ్గరికి రాను” అన్నారు. “నా దగ్గరికి కమ్యూనిస్టులూ, నక్సలైట్లూ వస్తుంటారు. నువ్వూ రావొచ్చు” అని చలం నవ్వుతూ అన్నారు. తర్వాత చలం ఎన్నో ఉత్తరాలు రాశారు భూమన్ కి.

రెండు తెలుగు సాహిత్య మహాశిఖరాలు – చలం,
శ్రీశ్రీ సన్నిహితంగా తెలిసిన, తరిమెల నాగిరెడ్డి, కేవీఆర్, బంగోరె, ఇమామ్, త్రిపురనేని మధుసూదనరావు, బి పాండురంగారెడ్డి, ఎం.వి.రమణారెడ్డి లాంటి ఎందరితోనో కలిసి బతికిన, ఒక వైస్ ఛాన్సలర్ కి భర్తగా, చదువుకున్న సంస్కారవంతుడైన ఒక ఎమ్మెల్యేకి అన్నగా వుండిన.. కవిగా, చదువరిగా, ఉద్యమ నాయకునిగా జీవితానుభవం పండిన భూమన్ సార్ కి… కానుకగా
ఏ పారిజాతాలు ఇచ్చుకోగలం?

అరమరికలు లేని ప్రేమని తప్ప!
తిరుమల కొండవాలుల్లో గాలికి వూగే కాసిని గరికపూలు తప్ప!

అయితేనేం, భూమన్ని మేం ఎలా గుర్తుపెట్టుకుంటామో తెలుసా భూమనా?
వొళ్లు పులకరించే చలం వచనానికీ, కళ్లు మిరుమిట్లుగొలిపే శ్రీశ్రీ మహత్తర కవిత్వానికీ పుట్టినబిడ్డగా!
తల్లి రాయలసీమ కన్న అరుదైన వరపుత్రునిగా!

– తాడి  ప్రకాష్ 

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు