Saturday, 8 August 2026

తెల్లజాతి పై గాంధీజీ తిరుగుబాటు

THE MAKING OF THE MAHATMA
——————————————————-

శ్యాబెనెగల్‌ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. అలాంటి దర్శకులకి గనక ఐడియా వస్తే అదొక అపురూపమైన చిత్రం అయితీరుతుంది.

అటెన్‌బరో ఇండియా వచ్చి ‘గాంధీ’ తీస్తాడా! అదే పని నేను ఆఫ్రికా వెళ్ళి చేస్తా అని అనుకున్నాడో ఏమో! ఇంతలో ఢీల్లీలో ఇందిరాగాంధీపై ఒక అంతర్జాతీయ సెమినార్‌ జరిగింది. ఫాతిమా మీర్‌ అనే దక్షిణాఫ్రికా ప్రొఫెసర్‌ ఒకామె సెమినార్‌కి వచ్చింది. వాళ్ళ దేశంలో గాంధీజీ చేసిన పోరాటం మీద ‘అప్రెంటిస్‌షిప్‌ ఆఫ్‌ మహాత్మా’ అని ఆమె ఒక పుస్తకం రాసింది. సెమినార్లో కలిసిన శ్యాంబెనెగల్‌కి ఆ పుస్తకం బహుమతిగా యిచ్చింది. అది చదివిన తర్వాతే ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది అన్నారు శ్యాం. భారత, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలతో మాట్లాడాడు. నేను సినిమా తీస్తా అని బెనెగల్‌ అంటే ఎవరన్నా కాదనగలరా? భారత ప్రభుత్వం, సౌతాఫ్రికా బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ కోటాను కోట్ల రూపాయలు కుమ్మరించాయి. అప్పటికి అటెన్‌బరో ‘గాంధీ’ వచ్చి 12 ఏళ్ళు అవుతోంది.

1994లో శ్యాంబెనగల్‌ దక్షిణాఫ్రికా వెళ్ళాడు. ఫాతిమా మీర్‌ని కలిసి, మరికొంత పరిశోధన చేసి సినిమాకి తగినట్టుగా గాంధీకథ రాయమన్నాడు. ఇండియావచ్చి ఎం.ఎస్‌. సత్యు భార్య షామా జైదిని కలిసి చిన్నటీంతో ఇంకొంత పరిశోధన చేశారు. ఫాతిమా, షామా కలిసి స్క్రీన్‌ ప్లే రాశారు. అలా రాయడంలో శ్యాం పాత్ర చిన్నదేమీ కాదు. 1973లో అంకుర్‌ నుంచి నిషాంత్‌, మంథన్‌, భూమిక సినిమాల్తో భారతీయ సినీ ప్రేక్షకుల్నీ, పండితుల్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తినవాడు బెనెగల్‌. సినిమా తీయడానికి ముందు మరొసారి దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ కార్మికులు, తోటల్లో పనివాళ్ళు, ఇతర బాధితులతో గాంధీజీ ఒక లాంగ్‌మార్చ్‌ చేసివున్నారు. లాంగ్‌మార్చ్‌ జరిగిన నాటాల్‌, ట్రాన్స్‌వాల్‌ రాష్ట్రాల్ని చూశారు. మార్చ్‌ జరిగిన రూట్‌ని పరిశీలించారు. సినిమా షూటింగ్‌ మొత్తం దక్షిణాఫ్రికాలోనే జరగాలి. అక్కడి నటులు, సాంకేతిక నిపుణులు కావాలి. షూటింగ్‌ ఏర్పాట్లూ, వర్కర్లూ, మేనేజర్లూ, షెడ్యూళ్ళు…. ఇలా లెక్కలేనన్ని పనులు. అందరితో మాట్లాడి, అంతా ఖరారు చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు శ్యాంబెనెగల్‌.

* * *

మృణాల్‌సేన్‌ తీసిన ‘మృగయా’ సినిమా 1976 జనవరి ఒకటిన విడుదలైంది. మిథున్‌ చక్రవర్తి మొదటి సినిమా అది. విడుదలకి రెండు మూడు రోజుల ముందు మృణాల్‌ సేన్‌ విజయవాడ వచ్చారు. సినీ పండితులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల కోసం ఒక స్పెషల్‌ షో వేశారు. ఎస్‌ ఆర్‌ ఆర్‌ కాలేజిలో డిగ్రీ చదువుతున్న నేను అలంకార్‌ థియేటర్‌లో ఆ షోకి వెళ్ళాను. అది 1975 డిసెంబర్‌ 30 కావొచ్చు, బాల్కనీలో 150 – 200 మందిమి కూర్చుని వున్నాం. తెల్ల లాల్చి పైజమా, దళసరి కళ్ళద్దాలతో చురుగ్గా వున్న మృణాల్‌సేన్‌, కుర్చీల మధ్య నిలబడి ‘మృగయా’ నిర్మాణ విశేషాలు వివరంగా చెప్పారు. సేన్‌కి షేక్‌ హ్యాండిచ్చి, సినిమా చాలా బావుందని చెప్పాను. మర్నాడు ఆర్టిస్ట్‌ మోహన్‌ మృణాల్‌ సేన్‌తో మాట్లాడి ‘విశాలాంధ్ర’లో పెద్ద వ్యాసం రాశాడు.

1986లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భారీగా ఫిలింఫెస్టివల్‌ జరిగింది. అబిడ్స్‌లో ఒక థియేటర్లో ‘చిదంబరం’ అనే ప్రతిష్టాత్మకమైన మళయాళ ఆర్ట్‌ ఫిలిం వేశారు. దర్శకుడు జి.అరవిందన్‌తో కలిసి ఆ సినిమా చూశాను. పెద్ద గడ్డం, మీసాల్తో రుషిలా వున్నారు అరవిందన్‌.

1996 ఏప్రిల్‌, సికింద్రాబాద్‌:
బేగంపేటలో వున్న ఆనంద్‌ థియేటర్‌లో The making of the mahatma సినిమా వేస్తున్నారు. అపుడు సికింద్రాబాద్‌ ‘ఆంధ్రభూమి’ లో పనిచేస్తున్నాను. ప్రీమియర్‌షో, జర్నలిస్టులు హేపిగా వెళ్ళొచ్చు. ఉదయం 11గంటలకి షో. మిత్రులతో కలిసి వెళ్ళాను. కారిడార్‌లో, కొద్దిపాటి గెడ్డంతో, టక్‌ చేసుకుని శ్యాంబెనెగల్‌ కొందరితో ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నారు. ఆయన్ని చూడాలన్న అంకురం 1973లో మొకెత్తితే… శ్యాం మహా వృక్షంగా మారాక 1996లో ఆశ నెరవేరింది. సినిమా ఆయన్తో కలిసి చూశాం. అయిపోయాక బైటికి వెళుతుంటే బాల్కనీ టికెట్లు చించే గ్లాస్‌డోర్‌ దగ్గర ఆయననించొని వున్నారు. చాలామంది చెయ్యికలిపి అభినందిస్తున్నారు. నేనుకూడా బెనెగల్‌ భుజం తట్టి, పర్లేదు గురూ పైకొస్తావ్‌ అందామనుకున్నాను. ఆకాశమంత ఎత్తుగా వుండే అతని భుజం తట్టడం అసాధ్యం అని తెలుసు గనక… నవ్వి, షేక్‌ హాండిచ్చి నోరుమూసుకుని వచ్చేశాను.

సత్యజిత్‌రాయ్‌, శ్యాంబెనెగల్‌ లాంటి దర్శకుల్ని కలిసినపుడు మీ సినిమా చాలా బావుందనో, అదిరిపోయిందనో చెప్పడం అంత హాస్యం మరొకటి వుండదు కదా!

* * *

ఇంతకీ గాంధీ పాత్రధారి ఎవరు ?

సినిమాలో యువగాంధీ పాత్రలో నటించడానికి నసీరుద్దీన్‌షా కరెక్ట్‌గా సరిపోతాడని బెనెగల్‌ అనుకున్నారు. ఆ గొప్ప నటునితో మాట్లాడారు. ఆ పాత్ర పోషించడానికి కళ్ళు తిరిగి కిందపడేంత రెమ్యూనరేషన్‌ అడిగారు నసీరుద్దీన్‌. సినిమా వ్యాపార విద్యలో ఆరితేరిన శ్యాంబెనెగల్‌ ‘పోబే’ అని మనసులో అనుకుని లేచి వచ్చేశారు.

మరింకెవరు? 1992లో బెనెగల్‌ సూరజ్‌కాసాత్వా ఘోడా (సూర్యుడి ఏడో గుర్రం) అనే ఒక masterpiece తీశారు. ప్రేమ, మానవత్వం అనే శాశ్వత విలువల్ని ఆ తెల్లని ఆశల గుర్రాలే ముందుకు నడిపిస్తాయని చెప్పిన ఆ అరుదైన చిత్ర కథనాయకుడు రజత్‌కపూర్‌.

అతన్నే గాంధీపాత్రకి ఎంచుకున్నాడు. మరి కస్తూర్బా ఎవరు? అప్పటికే టివీ నటిగా ప్రేక్షకుల్ని మైమరిపిస్తోంది పల్లవి జోషి. సూరజ్‌కా సాత్వా ఘోడాలో ఒక పాత్ర వేసింది కూడా. ఆమెకే కస్తూరి తిలకం దిద్దాడు బెనెగల్‌. చదరంగం ఆట గెలిచే నైపుణ్యంతో ఫాతిమా, షామాజైదీలు స్క్రీన్‌ ప్లే సిద్ధం చేశారు. ఒక లైన్ ప్రొడ్యూసర్‌, ఒక కాస్ట్యూమ్‌ డిజైనర్‌, హీరో హీరోయిన్‌, కేవలం ఒక అసిస్టెంట్‌తో దక్షిణాఫ్రికా వెళ్ళడానికి విమానం ఎక్కాడు శ్యాంబెనెగల్‌.

* * *

ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కథ ఎలా వుంటుంది? ఒక హీరో, ఒక విలన్‌. సంపన్నుడైన విలన్‌ కూతురు గానీ, దగ్గర బంధువుగానీ … ఓ అందాలరాశి మన హీరోయిన్‌. హీరో పేదవాడు, నిరుద్యోగి, పోనీ రిక్షా తోక్కేవాడు, ఐనా మచ్చలేని వ్యక్తిత్వం. నిలువెత్తు నిజాయితీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కుతూహలం రేపే conflict వుండాలి. ఆమె రిక్షావాణ్ణి వొదులుకోలేదు. హీరో పవిత్ర ప్రేమకి బానిస. విలన్‌ గ్యాంగ్‌తో ఫైట్‌, పాట, క్లెయిమాక్స్‌… ఇదంతా కల్పించి కథ నడిపిస్తాం కదా!

అసలు గాంధీజీ జీవితంకంటే కమర్షియల్‌ స్టోరీ ఏముంటుంది? ఎన్ని షోలేలు తీసి, ఎన్ని బాహుబలులు ఇస్తే ఒక గాంధీ జీవితం అవుతుంది!

ఎన్నివందల సినిమా క్లైమాక్స్ లు కలిపితే ఒక స్వాతంత్య్ర పోరాటం అవుతుంది?

బాగా బట్టతల వున్న ఒక బక్కపల్చని పెద్దాయన. ఖద్దరు పంచె కట్టుకొని, చేతికర్ర పట్టుకొని
నడిచి వెళ్తుంటాడు. శక్తిమంతమైన బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల్ని ఈ దేశం నుంచి తరిమికొడదాం అంటుంటాడు. చ్లలని బీరు తాగడు. మూడు పెగ్గులేసుకోడు. మటన్‌ బిర్యానీ తినడు, పల్లీలు అంటాడు. మేకపాలు కావాలంటాడు. పైగా యుద్ధం చేస్తానంటూ వుంటాడు. సినిమా వాళ్ళు కోరే conflict అయితే ok వుంది కదా!

లాఠీ ఛార్జీలు, జైళ్లు! ఊరేగింపులు!
మరి మసాలా ఏది? ప్రేక్షకుడికి మాడు పగిలిపోయే మసాలా కావాలిగా, ఏది? అదే truth… సత్యం! నువ్వు లాఠీల్తో కొట్టు, తిరగబడం. జైళ్ళల్లో పెట్టు, కాదనం, సత్యమే చెబుతాం. దానికోసం పోరాడతాం. స్వాతంత్య్రం ఇప్పుడే కావాలి, ఈ క్షణంలోనే, మేం సత్యం మాట్లాడుతున్నాం. ఈ దేశం మాది.
క్విట్‌ ఇండియా… ఇది సత్యాగ్రహం!…
Virtuous anger ! నువ్వొక జలియన్‌ వాలాబాగ్‌తో దీన్ని క్లయిమాక్స్‌కి జేర్చు. భగత్‌సింగ్‌ని ఉరితీయ్‌. పతాక సన్నివేశాన్ని మేం మువ్వన్నెల జెండాతో పండిస్తాం. నిన్నూ నీ తొత్తుల్నీ తరిమేస్తాం. నీ జెండా పీకేస్తాం. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి శుభం కార్డు వేస్తాం.

గాంధీ దర్వకత్వం వహించిన, 50 కోట్లమంది నటించిన ఈ  సినిమాలో మహత్ముడే హీరో.

ఇలాంటి సినిమా ఎవరన్నా తీయగలరా?
దక్షిణాఫ్రికా అయినా, ఇండియా అయినా గాంధీకి ఒక్కటే. బాధితుల పక్షానే నిలబడతాడు. కరుణ కురిపిస్తాడు. అహింస ప్రవచిస్తాడు. విజయం సాధిస్తాడు, అయినా వినమ్రంగానే, నిరాడంబరంగానే, కన్నతండ్రిలానే వుంటాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

గాంధీలాంటి ఒక మహావీరుణ్ణి, విజనరీని, విప్లవకారుణ్ణి హీరోగా పెట్టి సినిమా తీయడమంటే షారూక్‌ ఖాన్నో, అమితాబ్‌ నో పెట్టి రక్తికట్టించడం కాదుగదా! శ్యాంబెనెగల్‌కి ఐనా, అటెన్‌బరోకి అయినా కళ, సృజనాత్మకత మాత్రమేకాదు,
ఒక సాహసం, ఒక నిబద్ధతతోపాటు, చిత్తశుద్ధి, నిజాయితీ పొంగిపొర్లుతుండాలి! దానికోసం సమస్త శక్తినీ వొడ్డి, బృందంలోని అందర్నీ సమాయిత్తం చేయగలగాలి. It’s a herculean task !

పకడ్బందీ అయిన ప్రణాళికతో జోహన్నెస్‌బర్గ్‌లో దిగాడు మన దర్శకుడు. అటు ఆరితేరిన భారతీయ అత్యుత్తమ ఫోటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా బృందంతో సిద్ధంగా వున్నాడు. శబ్దబ్రహ్మ వనరాజ్‌ భాటియా శ్రావ్యమైన, గంభీరమైన సంగీతం శ్యాంబెనగల్ని ఉత్తేజితుణ్ణి చేస్తోంది. సహజమైన గెటప్‌తో పల్లవిజోషి మధ్య తరగతి గృహిణిగా, కస్తూర్బాగాంధీగా రూపాంతరం చెందింది. యువ లాయర్‌గా రజత్‌ కపూర్‌ ఉత్సాహంగా వున్నాడు.

మొత్తం షూటింగ్‌ 39 షిఫ్టుల్లో జరిగిపోవాలి.
45 రోజుల్లోనే సినిమా పూర్తయిపోవాలి.
ఎక్‌స్ట్రా నటులుగా 700మంది ఆఫ్రికన్లు కావాలి.

ఫాతిమా చొరవతో కొందరు దక్షిణాఫ్రికా నటులు, సాంకేతిక నిపుణులు రెడీ అయి వున్నారు. ప్రభుత్వ సహకారం ఎలాగు వుంది.

ఇంగ్లండ్‌లో బారిష్టరు చదువు పూర్తి చేసుకున్న గాంధీ, ఇద్దరు సంపన్న ముస్లింల గొడవ పరిష్కరించడానికి దక్షిణాఫ్రికా వెళ్ళారు. కొన్ని నెలలు మాత్రమే అక్కడ వుండి ఇండియా వెళ్ళిపోవాలని గాంధీ అనుకున్నాడు. అప్పట్లో గనుల్లో, తోటల్లో, రైల్వేల్లో పని చేయడానికి వలస వ్యాపారులు ఇండియా నుంచి 30వేలమంది పనివాళ్ళని తీసుకెళ్ళారు. అయిదేళ్లు గనక పనిచేస్తే, కార్మికుల పిల్లల్ని చదివిస్తామనీ, భూములు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. మాట నిలబెట్టుకోకపోగా, కార్మికులపై వేధింపులు పెరిగాయి. ప్రతీ పనివాడు మూడేసి పౌండ్లు పన్ను కట్టాలని పాలకులు షరతు పెట్టారు. పనివాళ్ళ పెళ్ళిళ్ళు చెల్లవని, కనక వాళ్ళ పిల్లలకి సౌకర్యాలు వర్తించవనీ చట్టం చేశారు. దిక్కుతోచని కార్మికులకీ, వందల వేలమంది ఆడకూలీలకీ అండగా నిలిచాడు గాంధీ. అహింస ఆయుధంగా పోరాడాడు. కోర్టులో నిలబెట్టారు. తనకి వీలైనంత కఠిన కారాగార శిక్ష వేయాలని గాంధీ కోరారు. జైలు, విడుదల, మళ్ళీ జైలు… ఆగని పోరాటం! జాతి వివక్షపై తిరుగుబాటు, జాత్యహంకారంపై ధిక్కారం, 1893లో 24 ఏళ్ళ వయసులో గాంధీ దక్షిణాఫ్రికా వెళ్ళారు. ప్రతి దినమూ పోరాటంతో 21 సంవత్సరాలు ఆయన అక్కడే వుండిపోయారు. లాయర్‌గా అక్కడ అడుగుపెట్టిన కుర్రాడు నాయకుడిగా ఎదిగాడు. ప్రతిఘటనోద్యమ వీరునిగా రాటుదేలాడు. పెద్ద కొడుకుని పట్టించుకోడం లేదని గాంధీతో భార్య గొడవ పడింది. గర్భవతిగా వున్న కస్తూర్బాని ఈడ్చి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన గాంధీని, ఆ మామూలు మనిషి దురాగ్రహాన్ని ఎంతో సహజంగా పిక్చరైజ్‌ చేశాడు బెనెగల్‌.

సరైన టిక్కెట్‌ ఉన్నా నల్లవాడయిన నేరానికి గాంధీని ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌ నుంచి  ఫ్లాట్‌ఫాం మీదికి తోసేసిన ప్రఖ్యాత సంఘటనని ఎఫెక్టివ్‌గా తెరకెక్కించారు. మనకి చైనాలో మావో లాంగ్‌మార్చ్‌ తెలుసు. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం, దండి లాంగ్‌మార్చ్‌ తెలుసు. అయితే మొట్టమొదటి లాంగ్‌మార్చ్‌ దక్షిణాఫ్రికాలో గాంధీ నాయకత్వాన జరిగింది. అక్కడి భారతీయ కార్మికుల డిమాండ్లు ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో పాదయాత్ర జరపాలని గాంధీ నిర్ణయించారు. హిందువులు, ముస్లింలు, యూదులు, పార్సిలు, క్రిస్టియన్లు, గని కార్మికులు, స్త్రీలు, వ్యాపారులు అంతా ఇళ్ళు వొదిలేశారు. ఉద్యోగాలు మానేశారు. తిండిలేదు. పోలీసు దాడులు… దుర్భర జీవితం! ఆ శ్రమ జీవులందరిని సాహసంతో ముందుండి నడిపించాడు గాంధీ. న్యూకేజిల్‌ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది ట్రాన్స్‌వాల్‌ రాష్ట్రం. రెండువేల మంది నడక ప్రారంభించారు. అరెస్టులు, పోలీసు వేధింపులు… అయినా యాత్ర ఆగలేదు. జైలుకెళ్ళి వచ్చిన గాంధీ మళ్ళీ లాంగ్‌ మార్చ్‌లో కలిశారు. తెల్ల పాలకులు గడగడలాడిపోయారు. ఇటు ఇండియా నుంచీ లండన్ నుంచి  గాంధీ మద్దతు కూడగట్టారు, నరకయాతన పెట్టిన తెల్లజాతి అహంకారులు చివరికి దిగివచ్చారు. 1914లో కార్మికుల అన్ని డిమాండ్లు ఒప్పుకున్నారు. గాంధీ పట్టుదల, పోరాటపటిమ చూసి తెల్లవాళ్ళు భయకంపితులయ్యారు. ఈ ఉద్విగ్న సన్నివేశాల్ని, అహింసాయుత యుద్ధతంత్రాన్ని బెనెగల్‌ ఉత్తేజకరంగా చిత్రించారు.

* * *

1996 ఏప్రిల్‌లో ఇండియా అంతా విడుదలైంది
the making of the mahatma.

దక్షిణాఫ్రికా పోరాటాల్లో నిగ్గుదేలిన యువకుడు, పరిణతి చెందిన నాయకునిగా, అహింసని ఆయుధంగా మలిచిన భారత యోధునిగా, ఒక మహాత్మునిగా, 45 సంవత్సరాల గాంధీజీ ఇండియాకి తిరిగొస్తారు. భుజాన సంచితో
చేతిలో కర్రతో గాంధీజీ సముద్ర కెరటాలవైపు నడిచి వెళుతుండగా సినిమా ముగుస్తుంది. ఇక భారత స్వతంత్ర సంగ్రామమనే ఒక కల్లోల మహాసముద్రాన్ని గాంధీజీ జయించబోతున్నాడు అనే ప్రతీకాత్మక పతాక సన్నివేశం అది.

RESISTANCE WITHOUT VIOLENCE
CONFRONTATION WITHOUT ENEMIES
VICTORY WITHOUT LOOSERS

GANDHI MORE RELEVANT THAN EVER
ఇదే ఈ సినిమా సారాంశం.

అప్పటికి దక్షిణాఫ్రికాలో ఇంగ్లీషే అధికార భాష అయినందువల్ల, ప్రపంచమంతా విడుదల చేయడానికి ఇంగ్లీషు తప్పనిసరి అవ్వడం చేతా, ఈ సినిమాని ఇంగ్లీషులోనే తీశారు.

ఇంగ్లీష్ లో ఉత్తమ కథా చిత్రంగా the making of the mahatma – గాంధీ సే మహాత్మా తక్ – ఆ ఏడాది జాతీయ అవార్డు పొందింది.

1996లో జాతీయఉత్తమ చిత్రంగా స్పెషల్‌ జూరీ అవార్డు శ్యాంబెనెగల్‌కి ఇచ్చారు. 1996లో ఉత్తమ నటునిగా రజత్‌కపూర్‌ జాతీయ అవార్డు పొందారు.

అనేక ప్రతిష్టాత్మక ఫిలింఫెస్టివల్స్‌లో ఈ సినిమా శ్యాంబెనెగల్‌కి అంతర్జాతీయ కీర్తి ఆర్జించింది.

దక్షిణాఫ్రికాలో రెండు నెలలు జైల్లో వున్నప్పుడు గాంధీజీ ఒక చెప్పుల జత తయారు చేశారు. విడుదలై బయటికి వచ్చినప్పుడు అప్పటి సౌతాఫ్రికా హోంమంత్రి Mr. Smut కి వాటిని బహుకరించారు. వాటిని చాలా సంవత్సరాలు వాడిన Mr. Smut “Even though, I may feel that I’m not worthy to stand in the shoes of so great a man” అని అన్నారు.

శ్యామ్ బెనెగల్ వయసు 90 ఏళ్ళు. 1934 ఏప్రిల్ 14న సికింద్రాబాద్ లో జన్మించారు. 1991 లో పద్మ విభూషన్, 2005 లో జీవిత సాఫల్య పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందారు. ఆ మహా దర్శకుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు.

– తాడి ప్రకాష్

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు