ఇరవై నాలుగేళ్ళ దొంతం చరణ్ రెండో కవితా సంపుటి ఇది. మొదటి కవితా సంపుటి “మట్టి కనుగుడ్ల పాట”. November 2020 లో వచ్చింది. మూడేళ్లలో రెండు కవితా సంపుటులు. Prolific. గొప్ప ధార వున్న కవి. ఇప్పటి ఈ కవుల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. భయం వేస్తుంది. ఏ పాలస్తీనా భూభాగంలో నుంచొని కవిత్వం రాస్తున్నట్టుగా వుంటుంది. కవిత్వమంతా యుద్ధ వాతావరణమే. అక్కడి యుద్ధంగాదు, ఇక్కడి యుద్ధం. మన చుట్టూ జరుగుతున్న యుద్ధం. యుద్ధ విధ్వంసాలు. ప్రపంచమంతా యుద్ధంలో, యుద్ధ వాతావరణంలో మునిగిపోయివుంది. దీనికి logic లేదు, తర్కం లేదు. దాడి మాత్రమే నిజం. ఎంత మంది స్త్రీలు, ఎంత మంది చిన్నపిల్లలు చనిపోతే మాత్రం ఏమిటి. అణగారిన వర్గాల పిల్లల, స్త్రీల రక్తంతో ఈ భూమి స్నానమాడుతుంది. ఇక్కడ అక్కడని లేదు. ప్రపంచమంతా రక్త మోడుతుంది. ఆధిపత్యాన్ని establish చేయటానికి నీతి, నియమం, మానవీయత ఏ సూత్రాలు లేవు. అంతటా విధ్వంసం. ఇక్కడ విధ్వంసం గురించి కవి మాట్లాడుతున్నాడంటే సర్వేసర్వత్రా వెల్లివిరుస్తున్న విధ్వంసాన్ని గురించి మాట్లాడుతున్నట్లే. దొంతం చరణ్ కవిత్వం గురించి మాట్లాడటమంటే ఇక్కడి భూభాగంలో జరుగుతున్న విధ్వంసాన్ని గురించి అమానవీయత గురించి మాట్లాడటం.
ఒక్క దొంతం చరణే కాదు. ఏ కవిని ముట్టుకున్నా నెత్తురోడుతున్న మన జీవితాల్ని మన ముందు పెడతాడు. ఈ ఏజ్ గ్రూప్ కవుల గురించి మాట్లాడటానికి కొంచం గట్స్ కావాలి. కొంచం ప్రేమ కావాలి. ఒక యుద్ధ వాతావరణాన్ని మనసులో నింపుకొని మాట్లాడాలి. ముఖ్యంగా దొంతం వస్తువు వేరు. Treatment వేరు. వర్తమానాన్ని ఈ రకంగా కూడా చూడవచ్చా! కవితామయం చేయవచ్చా! అని అనిపిస్తుంది.
దొంతం చరణ్ మామూలుగా మనం మాట్లాడుకునే general poet కాదు. a kind of war poet. ముక్కలు ముక్కలైన బహిరంతరాల జీవితాల్ని చూయిస్తాడు.
మొదటి పుస్తకానికి ముందుమాట లాంటి నాలుగు వాక్యాలున్నాయి చూడండి.
“అమరవీరుల మృతదేహాల మీద, స్థూపాల మీద
ప్రేమగా రాలుతున్న ఆకుల చప్పుడ్లన్నీ
పాడుతున్న పక్షుల కిలకిలారావాలన్నీ
రెండవ శబ్దంగానే పరిగణించబడతాయి
ఈ నేలపై గుట్టలపై కొండలపై సముద్రాలపై
ఎల్లకాలము అమరత్వమే మొట్టమొదటి
జీవశబ్దంగా వుంటుంది కాబట్టి.”
ఆ పుస్తకానికి inner cover లోన ఒక కవితకు ముగింపు ఇలా వుంటుంది.
“సమాధులతో, స్థూపాలతో కలిసి సంఘీభావంగా కూర్చోవడమంటేనే పేగులకు పాటలు నేర్పడం, కనుగుడ్లతో పోరాటపాటలు పాడటం, పొద్దును ప్రేమగా కౌగిలించుకోవడం, నువ్వూ నేనూ అందరికందరం అనేక పొద్దులుగా మారిపోవటం.”
దొంతం చరణ్ లాంటి కవుల్ని ముట్టుకోవటమంటే వాళ్ళతో కలిసి “రక్త చలన సంగీతాన్ని పాడటం”.
నేనూ, నా 80 ఏళ్ళ జీవితం. లేదు. ప్రవహించి. గత, వర్తమాన, భవిష్యత్తులను కలిపి కుడుతూనే వున్నాను. ‘Time Past, Time Present, Time Future’ అని Elliot గీతలు గీశాడు గాని, సతతం దొర్లుతూనే, సతతం పరిపూర్ణమవుతూనే వున్నా.. అయినా వీళ్ళ దగ్గరికొచ్చినప్పుడు, నేనేదో miss అయ్యానన్న భావన కలుగుతుంది.
అసలు ఈ కవులు కాలాన్ని ఎలా conceive చేస్తారు. సంభావిస్తారు. విస్తారమైన కాలంలో ప్రదేశంలో వీళ్ళ priority అంతు లేని, అంచు తెలియని యుద్ధ రంగమేనా..! నేనందుకున్నట్టుగా జీవితాన్ని వీళ్ళు అందుకోవటం లేదా, వీళ్ళ వర్తమానం భిన్నమైందా, భిన్నమైన ప్రదేశంలో భిన్నమైన కాలంలో పుట్టి మూలమైన లోలకాల్ని అందుకోటానికి ఒక ఆగ్రహ వ్యక్తీకరణ చేస్తున్నారా.. వీళ్ళు భిన్నం. వీళ్ళ వస్తువు భిన్నం. వ్యక్తీకరణ భిన్నం. పరిపూర్తిగా ఇది నూతన కవిత్వం. భయోద్విగ్న సమర శీల కవిత్వం.
‘గుండె సంచి’ అంటాడు. ‘మనమంతా విల్లంబుల ద్రోహులం’ అంటాడు. వోలె సోయింక పద్యాన్ని కోట్ చేస్తూ
“వ్యవస్థగా మారిన కుటుంబంతోనో
వ్యవస్థగా మారిన రాజ్యంతోనో
ఒక మనిషి రాజీపడుతున్నాడంటే
ఆ మనిషి మనిషిగా చచ్చిపోతున్నాడని అర్థం”
సహజంగానో, అసహజంగానో చనిపోతున్న వారి గురించి- అన్యాయంగా చంపబడుతున్న వాళ్ళ గురించి- ఇతనికి దుఃఖాగ్రహం. మొదటి పుస్తకం ‘మట్టి కనుగుడ్ల పాట’, రెండో పుస్తకం ‘ఊహ చేద్దాం రండి’ కలిపి ఒకేసారి చదివితే గుండె ఝల్లుమంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం మారిపోతుంది. దిగులేస్తుంది. కోపమొస్తుంది. నువ్వొక ఆయుధంగా మారటానికి సిద్ధమవుతున్నావా అనేది కూడా కనపడుతుంది.
వీళ్ళ ఊహ గొప్పది. జీవితంలో లోలోతుల్లోకెళ్ళి భూమి అట్టడుగు పొరల్లోకెళ్ళి విస్ఫోటనం చెందే ఒక పదార్ధాన్ని దేన్నో అందుకొని పద్యంలో చూపిస్తారు. అదొక మాంత్రిక శక్తితో మహత్తర గొప్ప లోకాన్ని దేన్నో సృష్టించి ప్రతిఫలిస్తుంది.
“నేను రైతుని కాదు
కాని నాది కొడవలి భాష
నేను కార్మికుడిని కాదు
కాని నాది నిప్పుల భాష
సంకెళ్ళు తెంచడానికి
ఎప్పుడూ ఒక భాష మిగిలే వుంటుంది చూడు
అదే నా భాష!”
ఇతని కవిత్వం మొత్తం దుర్మార్గం అవుతున్న వ్యవస్థల్ని రద్దు చేయాలని ఒక కొత్త భాష కనుక్కున్నాడు. చుట్టూ వున్న మామూలు అతి సామాన్య వస్తువుల నుంచి, సందర్భాల నుంచి, నడుస్తున్న చరిత్ర నుంచి ఒక కొత్త డిక్షన్ సృష్టించుకున్నాడు. వస్తువు మారినప్పుడు భాష మారటం సహజం. కాలానుగుణంగా వస్తువు మారుతుంది. దీర్ఘకాలంగా గడ్డకట్టుకుపోయిన భాష మారదు. వస్తువెప్పుడూ విప్లవాత్మకమే. భాషే reactionary. వస్తువుతో పాటు అప్పటిదాకా ఉన్న diction భాషను, బహుశా outdate అయిన భాషను బద్దలు కొట్టి కొత్త భాషను నిర్మించుకోవాలి. కొత్తగా కవిత్వం రాసే భాష మనకు అర్ధం కాకపోవడానికి కారణం blasting language ని వీళ్ళు invent చేస్తున్నారు. సుగమంగాను, కర్ణ పేయంగాను ఉండదు. పరమ హార్ష్ గా ఉంటుంది. అయితే అది అంతకు ముందు లేని సత్యాన్ని పలుకుతుంది. ప్రతి కవి తనదైన భాషను సృష్టించుకోకపోతే నిలవడు. ప్రపంచాన్ని, జీవితాన్ని కొత్తగా చూడాలి, కొత్త కోణాన్ని ఆవిష్కరించాలి.
ఎక్కడో ఎన్నో పొరల కిందో ఉన్న సత్యాన్ని బద్దలు కొట్టి బయటకు తీయాలి. అది దేదీప్యమానంగా వెలగాలి. ఆ వెలుగులో మన మూలాల్ని కొత్తగా చూస్తాం.
బహుశా చరణ్ రొటీన్ కవి కాదు. గొప్ప అశాంతితో కొట్టుకుపోతూ చిద్రమయినదాన్నుంచి కొత్త సృష్టికి పురుడు పోస్తున్నాడు.
చరణ్ కవిత్వాన్ని ఎంజాయ్ చేయటం సులభం కాదు. అతని అంతర్గత అశాంతిని, విప్లవ బీజాన్ని అందుకుంటే తప్ప అతన్ని ఆనందించలేము.
ఒక గొప్ప సత్యం ఆవిష్కరణ ఎప్పుడు జరుగుతుంది? నువ్వు తగలబడి, తగలబడి యింత బూడిదగా మారినప్పుడు.
“ఊహ చేయడమే హెచ్చరిక” అని అనటం మామూలు విషయం కాదు.
“నీ ఊపిరి విశ్వమంతా పాకిపోయింది
విశ్వాన్నెలా భస్మం చేస్తాడు
నీ ఆలోచన జనసంద్రం నిండా నిండిపోయింది
సముద్రాన్నెలా బందీ చేస్తాడు”
“ఊపిరి పీల్చడమే
మానవుల కళాత్మకమైన ధిక్కారన!
పదేపదే ఊహ చేయడమే
సంకెళ్ళకు సృజనాత్మక హెచ్చరిక!”
“మేఘాల పాత్ర లేకుంటే
అన్నం మెతుకులెక్కడివి
ఊహ పాత్ర లేకుంటే
సృజన పేరెక్కడిది”
పదేపదే ఈ నలుగురు గుర్తు రావడం వల్ల ఆ కవిత రాశానంటున్నాడు. 1. జి.ఎన్.సాయిబాబా, 2. గ్రాంసీ, 3. వరవరరావు 4. లియోనార్డ్ పెల్టియర్.
వీళ్ళు నలుగురూ యోధులే. వీరులే. జీవితాన్ని ఫణంగా పెట్టిన వాళ్ళే. అయితే, దీన్ని ఎలా కవిత చేశాడన్నదే ముఖ్యం. అక్కడ చరణ్ లో కవి, ఊహాశాలి- ఎలా progressive అయి, ఎలా కవిత రాశాడన్నది ముఖ్యం. వర్తమాన చరిత్రని కవిత్వంగా ఎలా మలిచాడో అది చరణ్ నేర్పరితనం. “మణిపూర్ ఒక్కటే! సీతలే అనేకం” అనే కవిత గొప్ప ఉదాహరణ.
“మనిషిని మాయం జేస్తావు
స్మృతులనేం జేస్తావు?
మట్టిపై అడుగుల ముద్రల్ని చెరిపేస్తావు
మట్టినేం జేస్తావు?”
అని అడుగుతున్నాడు చరణ్ encounter అనే మరో కవితలో.
“యుద్ధనేలపై నీ దేహం” అనే మరో కవితలో
“నిత్య వసంతాన్వేషణలో
నీ దేహం తుపాకుల గూడు
చిత్రాన్ని గీస్తున్న చంద్రకాంతి
పాడుతున్న పూరేకుల స్వరం
చిగురాకుల పచ్చదనం
మందార గుడిసెల్లో, నెత్తుటి మడుగుల్లో
త్యాగాల వనంలో
నీ దేహం, ఎర్రటి స్వప్నాల ముద్ద!”
“నీ అమరత్వం
పోరులో దొగ్గాడుతున్న పసిపాపల నవ్వు
నీ అమరత్వం
ఆదివాసుల పాటల్లో అడవి రంగు !”
మరో చోట అంటాడు
“ఓసారి వెళ్లివద్దామా
మనిషి రద్దుకాబడ్డ చోటకి. !
చీకటికుండలో
పచ్చిపుండ్లను పెంచుతున్న మౌనంలా వుండొచ్చు
అక్కడి హృదయాల నొప్పి !
ఓసారి వెళ్లివద్దామా
మనిషి రద్దుకాబడ్డ చోటకి!
మేమంతా అనే కవిత- రైతుల గురించి. కవిత మొత్తం ఉటంకించాల్సిందే.
“ఎద్దు కొమ్ముల మీద ఎదను ఆరేసుకున్నోళ్ళం
వరి గడ్డి మొనల మీద
వంగి వంగి ఆకలిని తీర్చుకున్నోళ్ళం
నాగలినెత్తుకొని పోరాట గడ్డని
నిప్పురవ్వల వనంలా మార్చినోళ్ళం
గుండెను నేలకు దించి
మా శ్వాసలతో భూమినంతా దున్నినోళ్ళం
మట్టి నగ్నత్వాన్ని
మా హృదయాలకు పూసుకున్నోళ్ళం
మేమంతా రైతులం
మేమంతా రైతులం”
ఒక వస్తువును ఎలా ఊహిస్తాడు. ఎలా కవితగా మలుస్తాడు అన్నదే ముఖ్యం. కవి సర్వసృజనాత్మక శక్తి అంతా మనల్ని అందులోకి దించటంలోనే వుంది. మనల్ని కవిత చేయటంలోనే వుంది.
“కూలిపోయిన గోడలపై దీపాలు ఏమాత్రం వుండవు” అనే కవితలో ఎత్తుగడ చూడండి.
“బాంబుల దాడికి గోడలు పడిపోతాయి
కానీ ఇక్కడి గోడలు గోడల్లా పడిపోవు
మనిషి అంతర్లోకంలో కుప్పకూలుతున్న మరో మనిషిలాగే
గోడలూ దుఃఖంతో కుప్పకూలుతాయి.
అయినప్పటికీ,
నేలపై పడివున్న సిమెంటు గడ్డల మధ్యలోంచి
ఆకాశం వైపుకు చూస్తున్న పిడికిళ్ళను మనం చూడవచ్చు
నెత్తుటి ఏర్లను ముద్దాడి నడుస్తున్న వాళ్ళం
పిడికిళ్ళు పిలుస్తున్నప్పుడు హాయిగా వెళ్ళి
కౌగిలించుకోకుండా ఎలా వుండగలం!”
“ఈ రాత్రి, నిన్నటి రాత్రి, కొన్ని యుగాల రాత్రులన్నీ
ఇక్కడ దీపాలతో వెలుగుతున్నాయి”
అలా అని కొనసాగి..
“దీపాలన్నీ ఎక్కడ వెలుగుతున్నాయో తెలుసా
యుద్ధంలో కోయబడుతున్న చన్నులన్నీ
ఈ పచ్చినేలపై, పచ్చిరక్తంలో తేలుతూ
దీపాలుగా వెలుగుతుంటాయి !”
ఎన్ని రకాల అలంకారాలు వాడినా పాఠకున్ని పద్యంలో involve చేయటమే ముఖ్యం. వారు జీవిస్తున్న స్థలకాలాల బట్టి వారికి అబ్బిన విద్య. అందరూ ఇదే intensity తో రాస్తున్నారని కాదు. ఆ వుద్దేశ్యం, ఆ జాగ్రత్త, ఆ మెలకువ వీళ్లలో గణనీయంగా వుంది. తరానికి తరానికి మధ్య లింకు తెగకుండా కలౌన్నత్యం సాధించే ఒక గాఢ కాంక్ష వుంది. దేన్లో అయినా అభివృద్ధి చూయించే గ్రాఫ్ పైకే చూయిస్తుంది. బహుశా అన్ని రంగాల్లోనూ ఇది స్పష్టంగా కనపడుతుంది. ప్రలోభాలకు లొంగి అడ్డదోవలు వెతుక్కునే కవులు లేరా అంటే, అన్ని కాలాల్లోనూ ఉన్నారు. జీవితం వేగవంతమై త్వరిత గతిని అభివృద్ధి సాధించే క్రమం కళా రంగాల్లోనూ వుంది. ఏది exception గాదు. చరణ్ కవిత్వ సందర్భంలో సాధారనీకరణ చేసి మాట్లాడుతున్న. ముందు తరం వాళ్ళ కంటే ఈ తరం కవులు వస్తు రూపాల్లో గుణనాత్మకమైన మార్పు సాధించలేదని శ్రద్ధగా ఫాలో అయిన వారు అనలేరు.
చరణ్ రెండు కవితా సంపుటులు ఒక్కసారి చదివితే, ఇతర కవులతో పోల్చి చూసినప్పుడు మీకర్థమవుతుంది ప్రత్యేకత.
“దోసిట్లో ధిక్కార సంతకాలు” అనే కవిత ఎలా ఊహించి, ఎలా నిర్వహించాడో ఆ పద్యం ఆద్యంతం, ఆశ్చర్యం కలుగుతుంది.
“మట్టిపెళ్లల పాలు తాగి
విల్లంబులను ముద్దాడిన నీ చేతివేళ్ళు
తోలు డప్పుపై
చెంగుచెంగున ఆడుతున్న చంటి పిల్లలు నీ చేతివేళ్ళు”
“యుద్ధవిమానాల కింద పతంగుల ఆటలాడిన చేతివేళ్ళు
యుద్ధట్యాంకుల కింద పక్షి రెక్కలను అల్లిన చేతివేళ్ళు
పువ్వుల్లోంచి, నినాదాల నిప్పులను నిద్రలేపిన చేతివేళ్ళు”
“యుద్ధ కాంతి ఉండలా నీ దోసిట పూలు
స్వేచ్ఛ కాంక్షల దొంతిలా నీ దోసిట పూలు
అమరుడి స్థూపం ముందు
సజీవమైన పురారాగం ముందు
ధిక్కార సంతకాలుగా నీ దోసిట పూలు”
ఏం చేశాడు. దోసిట్లో పూలను వర్ణించాడు. ఎవడి దృక్కోణాన్ని బట్టి, చరిత్రని, ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరుని బట్టి, పలు రకాలుగా వింత పోకడలు పోతాడు కవి. తను చూసిన దోసిట పూలు, తనలా ఊహించి పలురకాలుగా వర్ణించి మనకు చూయిస్తున్నాడు. ఇన్ని రకాలుగా చెపటంలో అందంగా చెపటమొకటే తద్వారా తను convey చేయదలుచుకున్నది మెరుస్తుంది.
ఈ రకంగా వ్యాఖ్యానించుకుంటూ పోతే అతి అనిపిస్తుంది. ఇందులో నా ఊహ కూడా వుంటుంది. ఏది నిజమైన పద్యం? పాఠకుడికి తగిలిందే. అర్ధమయిందే. కవి ఏది ఊహించాడో, అది కొంత పాఠకుడు ఊహించి అందుకుంటాడు.
మీరు అతిశయోక్తి అనుకున్నా సరే. ఈ తరం కవుల్ని చదవటం, పాత కవులకు ఒక orientation. కొత్త ఒరిపిడి. పునర్జీవం పొందడం. తరాల మధ్య గ్యాప్ ఎలా వుంటుందో, ఎంత వుంటుందో అర్ధమౌతుంది.
ఈ వాచకాన్ని అందరూ ఇలా చదవాలని లేదు. అందరూ ఇలా మునిగి వ్యాఖ్యానిస్తారని లేదు. ఈ వ్యాఖ్యానంలో నేనున్నా. నాదైనదే ఎక్కువేమో. ప్రతి పాఠకుడి స్థితి ఇంతేనేమో.
మొదటి పుస్తకం కంటే ఇది పరిణిత చెందింది. ఊహలో depth వచ్చింది. భాషలో సరళిత వచ్చింది. మీరూ చదివి ఆనందించాలి. విమర్శించాలి. ఒక అద్భుతమైన పద్యంతో ఈ ముందుమాట ముగిస్తా..
“విషాద రాగాలకు నేను కొనసాగింపును కాదు
వీరగాథలు తెలిసినవాడిని
విప్లవ పాటలు విన్నవాడిని
అసహనాన్ని పాడటం చేతనైనవాడిని
అణిచివేతను సహించలేని ధిక్కార మానవుడిని
పోరులో నిరాశ చెందనివాడిని
ప్రజలే గెలుస్తారని చరిత్ర తెలిసినవాడిని
ప్రజాగొంతులపై కత్తిని విరచడానికీ
అక్షరాలపై సంకెళ్లకు సమాధి కట్టడానికీ
సమర శంఖం ఎక్కడుందో స్పష్టత ఉన్నవాడిని
ప్రజాపాటలు వర్ధిల్లాలని అనుకున్నవాడిని
ప్రజాస్వరాన్ని వినిపించాలని అడుగేసిన వాడిని
సమాజం కుల్లిపోవడం చూసాను
పసిపాప చావడం చూసాను
ఒకరి నెత్తురు పారడం, ఒకరు దాన్ని తాగడం చూసాను
అందుకే..
నిశబ్దం నా భాష కాదని ఏనాడో ప్రకటించాను.”
మరో కవితలో ఇలా అంటాడు..
“ప్రజాపోరాటంలో అమావాస్యలుండవు
కొడవలి పట్టిన అమ్మలుంటారు
మోదుగుపూల పాటలుంటాయి
విముక్తిని అందించే
అందమైన చందమామలుంటాయి”
దోవ తప్పకపోతే
ఇతనికి గొప్ప భవిష్యత్తును కలగంటూ
ఆశీర్వాదాలతో
అభినందనలతో
శివారెడ్డి.