Friday, 7 August 2026

The Great Indian Kitchen…

‘ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’

నిజమే! అయితే ఆడవాళ్లు జ్యోతి మాత్రం వెలిగించి ఊరుకుంటే చాలా? అబ్బే! అక్కడితో ఆగితే ఎట్లా? జ్యోతి వెలిగించడం ఎంత పని? కాసింత నూనె, అందులో వత్తి. అసలు వెలిగించాల్సింది వేరే ఉంది. అది వంటింటి పొయ్యి. అది ఆడవాళ్ల హక్కుభుక్తం. ఏదో ఒకనాడు కాసింత టీకో, ఓ ఆమ్లెట్‌కో మగవాళ్లు దాని జోలికి రావాలేమో కానీ, ఆడాళ్ళకు 24 గంటలూ దాంతోనే పని. అదొక అలవాటు. అదొక ఆచారం. అదొక దారుణం. ఎందుకట దారుణం? ఉదయం లేవగానే టీ పెట్టమని అమ్మను అడిగినంత ధీమాగా నాన్నను అడగలేనంత వరకూ అది దారుణమే! అమ్మ వంటింటి రాణి. అమ్మే వంటింటి దాసి. అలాగే మనకు తెలుసు.

2021లో జియో బేబీ దర్శకత్వంలో మలయాళంలో ‘The Great Indian Kitchen’ వచ్చింది. నేను సినిమా చూడలేదు. కథాంశం తెలుసు. ఆడవాళ్లను వంటింటికి పరిమితం చేసిన ఒక సాంఘిక వ్యవస్థపై నిరసన. ఆచారం, అవసరం, అలవాటు, ఆర్థిక లేమి.. ఇలా రకరకాల కారణాలు స్త్రీ వంటింటికి పరిమితమయ్యేందుకు కారకాలవుతాయి. ఫైనల్‌గా ఇవన్నీ పురుషుడి కంట్రోల్‌లోనే ఉంటాయన్నది నిజం. కానీ వ్యవస్థ మూలాలు అలా ఉన్నప్పుడు, జెండర్ కంటే ముందు ఆ మూలాలను నిరసించడం అవసరం.

The Great Indian Kitchen కంటే 25 ఏళ్ల ముందే 1996లో రచయిత్రి కుప్పిలి పద్మ ‘మమత’ అనే కథ రాశారు. సినిమా కంటే చాలా ముందుగానే ఆ స్థితిని ఊహించారు. ఇద్దరు ఉద్యోగస్తులు పెళ్లి చేసుకుంటే ఇంటి అవసరాల కోసం ఉద్యోగం మానేయాలన్న ఆప్షన్ ఆడవాళ్లకే చెందుతుంది తప్పించి, మగవాళ్లకు వర్తించదు. ఎందుకు? మగమహారాజు అన్న‌ బిరుదు, సంపాదనపరుడు అన్న ట్యాగ్ తగిలించుకున్న అతను ఉద్యోగం మానతాడా? ఈ కథలో భార్యే ఉద్యోగానికి లీవ్ పెట్టి వంట పనుల్లో దిగింది. కొన్నాళ్లు అనుకున్నది ఆరు నెలలు గడిచింది. 24 గంటలూ వంట ధ్యాసే! చివరికి భర్తతో పడకటింట్లో కలిసి ఉన్న సమయంలో కూడా తర్వాత రోజు అతనికి ఏం వండాలి అనే ఆలోచనే! అబ్బా! ఏం ఘోరం ఇది? ‘భోజ్యేషు మాత’ అంటే ఈ వంటలక్క జీవితమా?

తెగించింది. తనకేం కావాలో నిర్ణయించుకుంది. ఉద్యోగం చేస్తానంది. భర్త వారించాడు. అడ్డగించాడు. చివరికి బెదిరించాడు. పుట్టింటి బాట పట్టింది. తండ్రి కసురుకున్నాడు. తల్లి బుజ్జగించింది. అన్న వివరం కనుకున్నాడు. వదిన తోడుగా నిలిచింది. భర్త మారడు. మారేలా లేడు‌. భార్యలు వంటిల్లు దాటి రావడం ఇష్టం లేని అనేకానేక మంది భర్తల్లో అతనూ ఒకడు మరి! కథ ముగిసింది.

సినిమాల్లో చూడండి! హీరో తన అమ్మతో వంటింట్లో ఉండి మాట్లాడతాడు. నాన్నతో హాల్లో ఉండి మాట్లాడతాడు. ఎన్నాళ్ళు అలాగే! ఇదంతా సరే! అమ్మలు వంట చేయొద్దా మరి? చేయొచ్చు. చాకిరీ అనిపించకుండా, తన కష్టాన్ని, ఇష్టాన్ని గుర్తించి ఆదరణ, గౌరవం చూపే చోట అమ్మ తప్పకుండా చేస్తుంది. కానీ నాన్నలను వంటింటి దారి పట్టించడం కావాలి ఇప్పుడు.

~ సాయి వంశి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు