ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ప్రొక్యూర్‌మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. తొలగింపు వార్తల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా 5 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్‌లో ఇది రెండో రౌండ్ తొలగింపులు. గతేడాది నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెయ్యి మందిపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది.
కాగా, ఇటీవలే కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ పలు వివాదాలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు, సేవలపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల హక్కులు ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కమెడియన్ కునాల్ కమ్రా, భవీశ్ అగర్వాల్ మధ్య వివాదం కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.