ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణాతోపాటు ఇతర ఉన్నతాధికారులతో విద్యాసంసరణలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ సూళ్లు ఎందుకో ఇప్పుడా పరిస్థితిలో లేవని వాపోయారు.
ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకేలోని విద్యాప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశపెట్టాలి. పాఠ్యాంశాలను మార్చాలి అని ఆదేశించారు. వచ్చే 2, 3 ఏండ్లలోనే విద్యావిధానంలో సమూల మార్పులు జరగాలని, ఢిల్లీలోని ప్రభుత్వ సూళ్లలో అమలవుతున్న విధానాలను పరిశీలించి ఇక్కడ అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఒకప్పుడు డీఈవోలు తరచూ సూళ్లను తనిఖీ చేసేవారు. ఎంఈవోలు ఇతర పనులు చేస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలను పెంచే ప్రయత్నం చేయడం లేదు. సూళ్లలో వక్తృత్వ పోటీలు జరిగేవి. విద్యార్థులను విజ్ఞానయాత్రలకు తీసుకెళ్లేవారు. ప్రైవేట్ సూళ్లలో ఇవన్నీ ఉన్నయి’ అని చెప్పారు