ప్రణయ్ హత్యకుముందు అమృత, మారుతీరావు అనే ఇద్దరు వ్యక్తులు ఎవరో మనకు తెలియదు. న్యూటన్ కి ముందు కూడా ఆపిల్ పళ్లు చెట్టుమీద నుండి భూమ్మీదకి పడ్డట్లు ప్రణయ్ హత్యకు ముందు కూడా ఈ దేశంలో మారుతీరావులాంటి తల్లిదండ్రులు, అమృత వంటి పిల్లలు పుష్కలంగా వున్నారు. కేవలం పిల్లలమీద దాడులు, హత్యల వల్ల మాత్రమే మిగతా మారుతీరావుల నుండి కొందరు హంతక మారుతీరావులు బైటకి వచ్చి కనపడతారు. కనిపించే మారుతీరావులకంటే కనిపించని మారుతీరావులే ఎక్కువ. ఇదో చేదు వాస్తవం. ఈ హంతక మారుతీరావుల వాదనలు కనిపించని మారుతీరావులకి ప్రాతినిధ్యం వహిస్తుంటాయి.
నిజానికి మన వ్యవస్థలో తల్లిదండ్రుల్ని నడిపించే అసలు విషయం వేరే వుంది. ఒక పితృస్వామిక వ్యవస్థలో కుటుంబసంబంధాలన్నీ పురుషుడి అహాన్ని, ఆధిపత్యాన్ని ఆస్తిపాస్తులమీద ఆజమాయిషీకి, ఇఛ్ఛకిలొంగి వుండాల్సిందే. స్త్రీలు, ఆల్రెడీ దానికి కండిషండ్ అయ్యుంటారు. అందులోనే వారికీ సుఖం, సౌకర్యం కనబడటంలో ఆశ్చర్యం లేదు. తన కులం, తన మతం, తన పరపతి, తన హోదా, తన స్థాయి, తన అంతస్తు అనే విషయాలే పిల్లల పెళ్లిళ్ల విషయంలో కూడా ప్రతిబింబించాలనేది పితృస్వామిక లక్షణమే. ఇందులో సున్నితత్వానికి, ప్రజాస్వామిక సంస్కారానికి, పిల్లల పట్ల ప్రేమకి చోటులేదు. నేను ఎన్నోవందల కేసులు చూశా. పిల్లలు కులాంతర, మతాంతర, ఆస్తి, హోదా అంతర వివాహాలు చేసుకున్నందుకు “కుమిలిపోయి” వారిని దూరం పెట్టిన వారెందరినో చూసా. నా బంధువుల్లో కూడా వున్నారు. “మమ్మల్ని కాదని పోయింది” అనే అహం దెబ్బతినటం కనిపిస్తుంది ప్రధానంగా. ఇది మనిషిలోని సున్నితత్వాన్ని, ప్రేమని చంపేసే పేట్రియార్కియల్ బిహేవియర్!
పిల్లల పెళ్లిళ్ల విషయంలో వచ్చే విభేదాలు, భయాల్ని, అణచివేతల్ని, అమలు చేసే హింసని పెంపకపు తాలూకు ప్రేమల పరిధిలోకి తీసుకు రాలేము. పిల్లల్ని తాము కని పెంచాము కాబట్టి పిల్లల మీద తమకి సంపూర్ణ హక్కు కలిగి వుండాలని వాదించటం, ఎదిగిన పిల్లలు తమ జీవితాన్ని తామే నిర్ణయించుకునే హక్కుని కాలరాయటానికి ప్రయత్నించటం, వారి మీద హింసని ప్రయోగించటం, తమ కుమార్తెల్ని, వారిని ప్రేమించిన యువకుల్ని చంపేయటం….ఇది పెంపకాల తాలుకు ప్రేమ అంటే వినటానికి అసహ్యంగా వున్నది. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఇంత హింసాత్మకంగా వుంటుందనటం పైశాచికం. అలా అనేవారిలో, అనుకునేవారిలో, వాదించే వారిలో కూడా వారికి తెలియకుండానే హంతక మారుతీరావులుంటారు. ఈ రకమైన ప్రవర్తనలు పితృస్వామ్యంలోని నేరపూరిత స్వభావాన్ని ఎత్తి చూపిస్తాయి. నేర స్వభావపు ప్రవర్తనల్లో ప్రేమ కోసం వెతకటం వ్యవస్థలోని ఆలోచనా విధానంలోని కరుడు కట్టిన, మానవత్వం మరిచినతనానికి ప్రతీక!
“చంపేంత, చచ్చేంత ప్రేమ”ట మారుతీరావుది. ఒక ప్రముఖ దినపత్రిక పైత్యం ఇది. ఇలాంటి హెడ్లైన్ పెట్టడం వాళ్ల భావదారిద్ర్యానికి పరాకాష్ట. ప్రేమ వున్న చోట చంపటాలు, చావటాలు వుంటాయా? ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు, గొడ్డళ్లతో నరకటాలు, కత్తులతో పొడిచి చంపి చచ్చే హంతక ప్రేమికులకు – ఈ “ప్రేమతో చంపే-చచ్చే” తల్లిదండ్రులకు ఎక్కడుంది వ్యత్యాసం? మదమెక్కిన పితృస్వామిక భావన ఐన స్త్రీలు, ఆడపిల్లలు పురుషుడి సొత్తు, వారికి స్వంత అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు, కోరికలు, ఐచ్ఛికాలు వుండకూడదు అనుకుంటూ తనకి దక్కని అమ్మాయి వేరేవ్వరికీ దక్కకూడదనే యువకుల హింసాత్మక ప్రవర్తనకి తన పిల్లలు తన ఆస్తి, వారిని తనకు ఇష్టం వచ్చిన వాళ్లతో పెళ్లి చేస్తా, వారు ప్రేమ అంటూ వేరే కులం, వేరే మతం పిల్లల్ని ప్రేమిస్తే నరికేస్తా లేదా చంపేస్తా అని పైశాచికంగా వ్యవహరించే ఈ మారుతీరావులకి ఏమిటి తేడా? ఇది స్త్రీకీ హృదయం వుంటుంది, శరీరం వుంటుంది, ఆమెకీ ప్రేమాభిమానాలు, స్వంత ఇష్టాలుంటాయని అంగీకరించకుండా తల్లిదండ్రుల్ని కూడా అమానుషంగా తయారు చేసే వ్యవస్థ యొక్క రోగగ్రస్థ లక్షణం.
ప్రణయ్ హత్యలో కేవలం తండ్రి బిడ్డల మధ్య పితృస్వామ్య ఆధిపత్య- వ్యక్తిత్వ తిరుగుబాటుల ఘర్షణ మాత్రమే లేదు. మనువాదపు కుల వివక్ష బలంగా ఉంది. మారుతీరావు అంతగా కాకపోయినా ప్రణయ్ కుటుంబం కూడా ఆస్తిపరులే. వారూ పరపతి కలవారే. గౌరవనీయమైన వ్యవసాయ, ఉద్యోగస్తుల కుటుంబమే. కానీ కూతురు ఒక దళితుడిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవడం మారుతీరావు అహాన్ని దెబ్బతీసింది. ప్రణయ్ మాత్రపు ఆర్ధిక స్థితిగతులున్న ఆధిపత్య కుల యువకుడిని అమృత ప్రేమించి ఉంటే మారుతీరావు ఆమోదించక పోవచ్చేమో కానీ ఈ హత్య జరగకపోను. ఆర్య వైశ్య కమ్యూనిటీలో చురుకుగా ఉన్న అతనిలోని కుల దాష్టీక బుద్ధి ప్రణయ్ హత్యకి దారితీసింది. ప్రణయ్ హత్య జరిగినప్పుడు వైశ్య కులమే కాదు దాష్టీక కులాల ప్రతినిధులు అతనికి మద్దతు పలికారు. ఆ సమయంలో కులమే ప్రధానంగా చర్చకు వచ్చింది. (మారుతీరావు చివరికి తన చావుకు వేదికగా అదే ఆర్య వైశ్య భవనం ఎన్నుకోవడం ‘పోయటిక్ జస్టిస్’ కి బలమైన ఉదాహరణ.) ఆ రకంగా ఇది కేవలం పితృస్వామ్యపు హత్యే కాదు. ఇది కుల హత్య కూడా.
ఒక విషయం గమనించండి పరువు హత్యలన్నీ అమ్మాయిల తల్లిదండ్రులే చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీ ఏ రూపంలో వున్నా…అంటే భార్యగా అయినా, కూతురుగా అయినా పురుషుడి ఆస్తి! ఆమెని తనంత సమానమైన సాటి మనిషిగా పురుషుడిని చూడనివ్వదు పితృస్వామిక వ్యవస్థ. అందుకే ఆమె ధిక్కారం ఏదో ఆస్తి జారిపోయిన, సంఘంలో ఏదో కోల్పోయిన అభద్రతా భావంలోకి తండ్రుల్ని, సోదరుల్ని, ఇతర బంధువుల్ని తోసేసి తీవ్రంగా గాయపరుస్తుంది. ఎక్కడైనా మగ పిల్లవాడి తల్లిదండ్రులు తమ పిల్లాడిని చంపుకున్న దాఖలాలు మనకు కనబడవు. కూతురినైనా, అల్లుడినైనా ఆడపిల్ల తరపు వారే చంపుతారు. పితృస్వామ్యం, మనువాదపు కులతత్వం ఇంతగా కరాళ నృత్యం చేస్తుంటే ఇంకా “పిచ్చి తండ్రి వెర్రి ప్రేమ” అంటూ మూర్ఛనలు పోవటం ఏమిటో విడ్డూరం కాకపోతే!
పిల్లల పట్ల సరైన ప్రేమ వున్న తల్లిదండ్రులు తమ పిల్లలతో పెళ్లిళ్లు వంటి అంశాల్లో విభేదించే సందర్భంలో ఏం చేయాలి? పిల్లలకి కూలంకుషంగా మంచి చెడులు, వాస్తవికాంశాలు, తాము భయపడే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, హోదాల అంతరాల వల్ల వచ్చే కల్చరల్ షాక్స్ వంటి విషయాలు చెప్పాలి. ఒకవేళ పిల్లలు వినకుంటే తాము ఏం భయపడుతున్నారో అటువంటి విషయాల్లో పిల్లలకి అండగా నిలబడాలి. సాంఘీక, సాంస్కృతిక, ఆర్ధిక అంతరాల వల్ల ఏర్పడే ఘర్షణల గురించి కౌన్సెలింగ్ ఇప్పించాలి ముందుగానే. పిల్లలు ఏం నష్టపోయినా తాము అండగా వుంటామన్న భరోస ఇవ్వటం ప్రేమ. పిల్లలు ఖచ్చితంగా తప్పులు చేయొచ్చు. వారి అంచనాలు తలకిందులు కావొచ్చు. ఆ సంభావ్యత వుంది.
ప్రఛ్ఛన్న మారుతీరావులకి ఒక్కటే ప్రశ్న ! జవాబు చెప్పండి. “పిల్లలు విషయంలో మీరేమన్నా ఏ తప్పులూ చేయని తోపులా? మీరు తీసుకొచ్చే వివాహ సంబంధాలు సంతోషదాయకంగా వుంటాయని, మీ నిర్ణయాలు, ఆమోదాలు అన్ని వేళలా పిల్లలకి లబ్ది (లబ్ది అనే పదం వాడక తప్పదు. ఎందుకంటే మన మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాల్ని దాటి వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి కదా!) చేకూరుస్తాయని గ్యారెంటీ వున్నదా? ఒక వేళ మీరనుకున్నట్లు జరగక పోతే “వాళ్ల ఖర్మ అలా ఏడిసింది. మనం ఎవరం తప్పించుకోటానికి?” అంటూ తప్పించుకోటానికి మీకు కర్మ సిద్ధాంతం ఎలానూ అందుబాటులో వుంటుందనుకోండి. కానీ నిజాయితీగా చెప్పండి మీరు అన్ని వేళలా సరైన నిర్ణయాలు తీసుకోగలరా?
పిల్లల (ముఖ్యంగా ఆడపిల్లల) ఇష్టాలకి వ్యతిరేకంగా లేదా అసలు వారి ఇష్టాల్ని పట్టించుకోకుండా పెళ్లిళ్లు జరిగిన జనరేషన్లో యువకుడిగా వున్నవాడిని నేను. ఎన్నో వందల కేసులు చూసాను. ఇప్పుడు యాభైల్లో వుండి సంసారాల్లో నరక సాగరాల్ని ఈదుతున్న నా తరపు స్త్రీలని చూస్తున్నా. వాళ్లందరి కష్టాలకి నా కాలపు మారుతీరావులే కారణం. నా పిల్లల తరం అలాంటి హీనస్థితిలో వుండకూడదనుకుంటా. ఈ జనరేషన్లో ఆడపిల్లల ధైర్యాన్ని చూస్తే సంతోషంగా వుంటుంది. ఆత్మగౌరవం, స్వంత ఇష్టాలు, గౌరవప్రదమైన ఉనికి, అభిరుచుల్ని కొనసాగించే స్వేఛ్ఛ లేకుంటే వారు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే అవి లేని జీవితం, కుటుంబ సంబంధాలు జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. కలిసి జీవించటమే కాదు, “బీయింగ్ సింగిల్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్” అనుకుంటాన్నేను. జీవితంలో సెల్ఫ్ ఎస్టీం ఇవ్వలేని ఏ విలువని ఎవరూ అంగీకరించాల్సిన అవసరం లేదు. మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక పరిమళాలకి పూచీ పడలేని ఏ కుటుంబ బంధాల్ని ఎవరూ నెత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కుటుంబ ప్రేమల్లో అధిక భాగం దోపిడీ ప్రేమలే. అంతా వొట్టి బూటకం. ఈ విషయంలో అందరం ఎదగాల్సిన వాళ్లమే.
అమృత గురించి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. తిలా పాపం తలా పిడికెడు పంచినట్లు ఆమెని, మారుతీరావుని ఒకే గాటన కట్టే “సమతౌల్య” దృష్టిగల మిత్రులు కూడా వున్నారు. ఆ అమ్మాయి ఎనిమిదో తరగతిలోనే ప్రణయం నడిపిందని, తండ్రి నానా తంటాలు పడ్డాడని, ఆమెని ఆ రొంపి నుండి బైట వేయటానికి చాలా కష్టాలు పడ్డాడని, ఆమె ఒక డిగ్రీ కూడా పూర్తి చేయని కుర్రాడిని ప్రేమించిందని, పెళ్లి చేసుకుందని, ఆ రకంగా తండ్రిని మోసం చేసిందని, కరడు కట్టిన మనిషని…..వగైరా వగైరా చాలా వాదనలు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎనిమిదో తరగతిలోనే ప్రేమించినా అదే ప్రేమ ప్రణయ్ మరణం వరకూ, ఆ తరువాత కూడా కొనసాగిందిగా? అతని మరణానంతరమూ అత్త మామలతోనే వుందిగా? ఆమెది తిరుగులేని నిబద్ధత! స్మగ్లింగ్ వ్యాపారం, భూ కబ్జాలు, సెటిల్మెంట్స్, భయంకరమైన అవినీతి, బ్లూ ఫిల్మ్ నిర్మాణం, హంతక నేరస్తులతో సంబంధాలు వంటి ఆరోపణలు కలిగిన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి హృదయం ఇంత గొప్పగా వుంటే సంతోషించక ఇంకా తప్పు పడతారేమిటి? ప్రేమ పట్ల ఆమె నిబద్ధత తిరుగులేనిది. ఆదర్శవంతమైనది. ఆ అమ్మాయి తన తల్లి దగ్గరకు వెళ్లాలా, భవిష్యత్తులో మరో పెళ్లి చేసుకోవాలా అనేది ఆమె స్వంత విషయం. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మనం వాయుముడిస్తే సంస్కారవంతంగా వుంటుంది.
చివరిగా ఒక్క మాట! వివాహం అనంతరం కూతురితో మంచిగానే వుంటూ ఆమె ఆసుపాసులు కనుక్కుంటూ ఆమె భర్త మర్డర్ కి స్కెచ్ వేసి, అమలు చేసి, ఆమె జీవితాన్ని ధ్వంసం చేసిన మారుతీరావు కూతురు మీద “చచ్చేంత ప్రేమ”తో ఆత్మహత్య చేసుకోలేదు. తప్పించుకోలేని శిక్ష పట్ల “చచ్చేంత భయం”తోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తిరునగరు మారుతీరావు వల్ల ఒక్క ప్రయోజనమే జరిగింది ఈ సమాజానికి. అదేమిటంటే అతను తన బోటి ప్రఛ్ఛన్న మారుతీరావులకి ఒక గుణపాఠం! ఒక హెచ్చరిక!!
మారుతీరావులు నశించాలి!