ఓ ధోరణిగా మారుతున్న పిల్లల హత్యలు, పెద్దల ఆత్మహత్యలు!
మొన్న హైదరాబాద్ హబ్సిగుడా, నిన్న చెన్నైలో పిల్లల్ని చంపేసి తామూ ఆత్మహత్య చేసుకున్న పెద్దల క్రూరకాండ జ్ఞాపకం చెదరకముందే నిన్న కాకినాడలో ఓ తండ్రి ఇలాంటి అఘాయిత్యానికే మరింత క్రూరమైన పద్ధతిలో పాల్పడ్డాడు. ఇదొక ట్రెండ్ గా కొనసాగడం అత్యంత ఆందోళన కలిగించే విషయం.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓ.ఎన్.జీ.సీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. కాకినాడలో ఓ ఫ్లాట్ లో కుటుంబంతో సహా అద్దెకి వుంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే ఏడేళ్ల జోషిల్, యూకేజీ చదివే ఆరేళ్ల నిఖిల్ అనే ఇద్దరు కుమారులున్నారు. హోలీ పండగనాడు వేడుకలకోసం తన భార్యా పిల్లల్ని తన కార్యాలయానికి తీసుకెళ్లిన చంద్రశేఖర్ భార్యని అక్కడే వుంచి పిల్లల యూనిఫార్మ్స్ కోసం టైలర్ దగ్గరకు వెళ్లివస్తానని పిల్లల్ని వెంటతీసుకెళ్లి, సరాసరి ఇంటికి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికివెళ్లి కిటికీ నుండి చూడగా చంద్రకిశోర్ ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించాడు. బలవంతంగా తలుపులుతెరిచి చూడగా పిల్లలు ఇద్దరూ కాళ్లూ, చేతులూ కట్టేసి వుండగా నీళ్ల బక్కెట్లలో తలలు మునిగిపోయి వున్నారు. ఆ నిర్జీవ పసిదేహాలను చూసిన తనూజ వెంటనే కుప్పకూలిపోయారు. ప్రస్తుత పోటీ వ్యవస్థలో తన పిల్లలు పోటీపడలేకున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపేసి తానూ చనిపోతున్నానని చంద్రకిశోర్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. పిల్లలు సరిగ్గా చదవడంలేదని ఈ మధ్యనే వారి స్కూలు మార్చారట.
జరిగింది ఎంతోఘోరమైన దారుణ విషయమనడంలో సందేహం లేదు. తానో కేంద్రప్రభుత్వ ఉద్యోగి అయివుండి కూడా తన పిల్లల భవిష్యత్తు గురించి భరోసా లేక పిల్లల్ని హత్యచేసి, తానూ ప్రాణాలు తీసుకునేంతగా అతన్ని సమాజంలో నెలకొన్న పోటీ సంస్కృతి ప్రోద్భలపరిచింది. చదువంటే జ్ఞానసముపార్జనకి, వ్యక్తి వికాసానికికాక పెద్దయ్యాక డాలర్లు సంపాదించడానికని, అందుకుగాను కిండర్ గార్టెన్ నుండే పోటీ పడాలనే కమర్షియల్, కార్పొరేట్ విద్యా సంస్కృతి చేసిన హత్యలే ఇవి.
పోటీ సంస్కృతి పిల్లలకు జన్మనిచ్చిన కన్నతండ్రిని కూడా క్రూరంగా మార్చేసిందన్న విషయం అర్ధం అయి అన్నం కూడా సహించని పరిస్థితి. అన్నెం పున్నెం ఎరగని ఆ పసిబిడ్డల్ని అంత క్రూరంగా హత్యచేయడానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయోనని జనం వాపోతున్నారు. తాము కూడా చనిపోతున్నందున ఏం చేసినా పాపంకాదనే, తప్పులేదనే దురవగాహనే కన్నవారిని దయలేని వారిగా, కరకు రాతి గుండెల మనుషులుగా, క్రూరులుగా మార్చేస్తుందేమో! మనుషుల్లో మానవీయ కోణాల వికాసానికి వర్తమాన విద్యావ్యవస్థ ఎంత శతృవుగామారిందనే దానికి కాకినాడలో ఆ తండ్రి పాల్పడిన ఘాతకచర్యే నిదర్శనం. అంతేకాదు, డబ్బు సంపాదించి విలాసాలు అనుభవించాలని, అందుకు కిండర్ గార్టెన్ నుండే పోటీపడాలని, వినిమయదారీ సంస్కృతికి పాదలేపనంగా మారిన విద్యావ్యవస్థ మనుగడలో వున్నంత కాలం ఇలాంటి దారుణహత్యలు ఆగవేమో!


