ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తాజాగా 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కంప్లీట్ సర్కిల్ సీఈఓ గుర్మీత్ చద్దా సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ జార్గన్ (అర్థం లేని పదజాలం) మరియు కృత్రిమ మేధస్సు (AI) పేరుతో ఉద్యోగాల కోతలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
జీతాలు ఎక్కువగా ఉండే 14,000 మేనేజర్లను అమెజాన్ పదవుల నుంచి తప్పించనుంది. 2025 తొలి త్రైమాసికంలోనే వీరందరికీ ఉద్వాసన పలుకుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా అమెజాన్ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ తో అమెజాన్ లో మేనేజర్ స్థాయి సిబ్బంది సంఖ్య 1,05,770 నుంచి 91,936 కు తగ్గుతుంది.
కరోనా సమయంలో అమెజాన్ భారీగా నియామకాలు చేపట్టింది. దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2019 లో 7,98,000 గా ఉండగా, 2021 ముగిసే నాటికి 16 లక్షలకు చేరింది. అయితే 2022 నుంచి లేఆఫ్స్ చేపట్టి ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది.
అమెజాన్ సీఈఓ Andy Jassy సంస్థాగత పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేశారు. మధ్యస్థాయి నిర్వహణను తగ్గించి, సంస్థ
సమర్థతను పెంచడమే ఆయన లక్ష్యం. 2025 నాటికి మధ్యస్థాయి మేనేజర్లను 15% తగ్గించాలనే లక్ష్యాన్ని Jassy ఇప్పటికే అధిగమించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సంస్థలో ఎక్కువ మంది చేరితే, మధ్యస్థాయి నిర్వహణ పెరిగిపోతుందని, అనవసరమైన సమావేశాలు, చర్చలు పెరుగుతాయని ఆయన అన్నారు.
నిర్వహణ స్థాయిలను తగ్గించి, ఉద్యోగులకు మరింత స్వాతంత్ర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాస్సీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జెన్ Z ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. సాంప్రదాయ నిర్వహణ శైలికంటే, స్వీయ నిర్వహణనువారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మధ్యస్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి జెన్ Z ఉద్యోగులు ఇష్టపడటం లేదని, పర్యవేక్షణ బాధ్యతలు లేకుండానే కెరీర్‌లో ఎదగాలని వారు కోరుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది.
అమెజాన్ ఉద్యోగుల తొలగింపు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Wisdom Hatch వ్యవస్థాపకులు అక్షత్ శ్రీవాత్సవ ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. అమెజాన్ క్యాష్ నిల్వలు 100 బిలియన్ డాలర్లకంటే ఎక్కువగానే ఉన్నాయని, అలాంటప్పుడు 14,000 మంది ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆ డబ్బును బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా 5 శాతం వడ్డీతో 5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించవచ్చని పేర్కొన్నారు.