మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. కేబినెట్లో తమ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. తమ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు అధిష్టానానికి వినతులు పంపించారు. తమ వర్గానికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరనే విషయాన్ని తెలుసుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్లను కలిసి విజ్ఞప్తులు అందజేశారు. జనాభా దామాషా ప్రకారం తమ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఎక్కడ చూసిన మాదిగ, లంబాడ ఎమ్మెల్యేల హడావుడి కనిపించింది.
ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. ‘రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 48 లక్షల మంది ఉన్నారు. కానీ, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ మధ్య భర్తీచేసిన ఎమ్మెల్సీల్లోనూ అవకాశం ఇవ్వలేదు. అందుకే కేబినెట్లో తమ కులం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు తమ వర్గానికి కేబినెట్లో చోటులేదు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం కల్పించండి’ అంటూ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యేలు సైతం లేఖలో అధిష్ఠానానికి వివరించారు.
సీఎం, డిప్యూటీ సీఎంలకు వినతులు: మంత్రివర్గ విస్తరణలో తమ వర్గాలకు అవకాశం కల్పించాలని, ఈ మేరకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్లను విడివిడిగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఆ ఫ్యామిలీల్లో ఒకటికంటే ఎక్కువ పదవులు! వివేక్, రాజగోపాల్ రెడ్డిలకు మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం నేపథ్యంలో ఆ రెండు కుటుంబాల్లో ఎంతమందికి పదవులు ఇస్తారు? అనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. ఇప్పటికే వివేక్ తో పాటు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా, వివేక్ కొడుకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. వాళ్లకు అదనంగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? అని మాదిగ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అందరికి అవకాశం ఇవ్వడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని సైతం కేబినెట్ లోకి తీసుకోవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనే డిస్కషన్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది.