శతాబ్దం క్రితం, భారతంలో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం.
భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండను, ఆ దేశ MP Bob Blackman మన్ UK పార్లమెంట్లో గుర్తుచేశారు. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఆ దారుణ ఘటనను పార్లమెంటులో (UK Parliament) లేవనెత్తిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ MP Bob Blackman, భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోజు జరిగిన కాల్పుల్లో, వేలాది మంది అమాయక పౌరులు చనిపోయారని, పలువురు గాయపడ్డారని MP విచారం వ్యక్తంచేశారు.
“1919 ఏప్రిల్ 13న, జలియన్ వాలాబాగ్ వద్ద శాంతియుతంగా సమావేశమైన అమాయక పౌరులపై, కాల్పులు జరపాలని జనరల్ డయ్యర్ బ్రిటిష్ బలగాలను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు, బలగాలు తమవద్ద మందుగుండు సామాగ్రి పూర్తయ్యేవరకు కాల్పులు జరిపారు. ఆ మారణహోమంలో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 1200 మంది గాయపడ్డారు. జనరల్ డయ్యర్ చర్య, బ్రిటిష్ సామ్రాజ్యంపై మాయని మచ్చగా మిగిలిపోయింది. 2019లో అప్పటి UK ప్రధాని థెరిసా మే ఈ ఘటనను ఓ మచ్చగా అభివర్ణించారు. కానీ, ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఏప్రిల్ 13 రాబోతోంది. దానికంటే ముందు, మన ప్రస్తుత ప్రభుత్వం ఓ ప్రకటన ఇవ్వగలదా? చేసిన తప్పును అంగీకరించి, భారత ప్రజలకు బ్రిటన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలి” అని MP Bob Blackman డిమాండ్ చేశారు.
Bob Blackman ఎవరు?
Bob Blackman 2010 సార్వత్రిక ఎన్నికల నుండి, హారో ఈస్ట్‌కు కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఈ సమయంలో, Blackman కన్జర్వేటివ్ పార్టీ మరియు పార్లమెంటులో అనేక పాత్రలను పోషించారు. 2015 నుండి 1922 కమిటీ కార్యదర్శిగా, 2019 నుండి కన్జర్వేటివ్ పార్టీ బోర్డు సభ్యుడిగా, 3 సెలెక్ట్ కమిటీలలో సభ్యుడిగా, 72 కి పైగా All-Party Parliamentary Group (APPG) సభ్యుడిగా, మరియు రెండుసార్లు చట్టాన్ని మార్చారు.
జలియన్ వాలాబాగ్ మారణహోమం:
అమృత్‌సర్ ఊచకోత అని కూడా పిలువబడే జలియన్ వాలాబాగ్ ఊచకోత 1919 ఏప్రిల్ 13న జరిగింది. రౌలత్ చట్టాన్ని మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు సైఫుద్దీన్ కిచ్లూ మరియు సత్యపాల్ అరెస్టును నిరసిస్తూ, అమృత్సర్ నగరంలోని జలియన్ వాలాబాగ్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. శాంతియుత నిరసనకు ప్రతిస్పందిస్తూ, తాత్కాలిక బ్రిగేడియర్ జనరల్ REH డయ్యర్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన తన గూర్ఖా మరియు సిక్కు పదాతిదళ రెజిమెంట్లతో ప్రజలను చుట్టుముట్టారు. జలియన్ వాలాబాగ్ యొక్క ఏకైక నిష్క్రమణ ద్వారం మూసివేసిన తర్వాత, డయ్యర్ రెజిమెంట్ సభ్యులను నిరసనకారులను కాల్చి చంపమని ఆదేశించాడు. ఈ కాల్పుల్లో, 1,500 మంది మరణించారని అంచనా. భారతదేశంపై 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో, ఈ ఊచకోత అత్యంత చీకటి ఘట్టాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.