Friday, 7 August 2026

పసి పిల్లలపై ఎన్నాళ్లీ పెద్దల అమానుష హింసాకాండ?

పసిపిల్లల మీద కొనసాగుతున్న హింసాకాండ పరంపరలో మనసు కలచివేసే మరో దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది.

అయితే పసి బిడ్డలపై హింసాకాండను అమలుచేసే విషయంలో, ప్రాణాలు తీసే విషయంలో కొందరు స్త్రీలు తాము ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్, కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఆరేళ్ల క్రితం కవల పిల్లలు ఆకాశ్, కార్తీక్ జన్మించారు. అయితే, రెండేళ్ల క్రితం రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనూష ఆ మరుసటి రోజున చనిపోయింది. ఆ తర్వాత, ఆ పాపను యనమదల గ్రామానికి చెందిన వారికి దత్తత ఇచ్చారు.

తర్వాత, తనతోపాటు తన కవల పిల్లల బాగోగులు చూసుకోవడానికి సాగర్ ఏడాదిన్నర కిందట గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. సాగర్, లక్ష్మిలకు ఏడు నెలల కింద ఓ ఆడపిల్ల కలిగింది. తనకు బిడ్డ పుట్టగానే ఆకాశ్, కార్తీక్ పట్ల లక్ష్మి వైఖరి భయంకరంగా మారింది. నిత్యం సూటిపోటీ మాటలతో పిల్లలిద్దరినీ వేధించిన లక్ష్మి గత ఆరు నెలలుగా వాళ్లను భౌతిక హింసకు గురి చేస్తోంది.

అంగన్‌వాడీ స్కూల్లో చదువుకుంటున్న కవల పిల్లలిద్దరూ మధ్యాహ్నానికే ఇంటికి వచ్చేసే వారు. రాడ్ వెల్డింగ్‌ పనిచేసే సాగర్ ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోతే, పొద్దుపోయాక తిరిగొచ్చేవాడు. ఈలోగా పిల్లలిద్దరినీ రక్తం వచ్చేట్టు కొట్టడం ఆమెకు నిత్యకృత్యంగా మారింది. నాన్నకు చెబితే పరిస్థితి మారుతుందనుకుని పిల్లలు ఒకటి, రెండుసార్లు తండ్రికి చెప్పుకున్నారు. అయితే, సాగర్ కూడా పిల్లలనే తిరిగి కొట్టడంతో అప్పటి నుంచి వారు తండ్రికి కూడా చెప్పుకోవడం లేదు. దీంతో లక్ష్మి మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇరుగుపొరుగు ఎంత చెప్పినా, మందలించినా ఆమె వినలేదు. పిల్లల్ని హింసించడం ఆపలేదు.

ఇటీవలి సంఘటనలో, కొండవీడు నుండి లక్ష్మి సొంతూరు గొల్లపాలెంకు మారారు. సాగర్ కూడా పిల్లలను తీసుకుని గొల్లపాలెం వచ్చేశాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సాగర్ పనికి వెళ్లిన తర్వాత, లక్ష్మి కవలలిద్దరినీ చిత్రహింసలకు గురిచేసింది. కార్తీక్‌ను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆకాశ్‌ను బట్టలు మొత్తం ఊడదీయించి మొండిమొలతో పొయ్యి మీద కాలుతున్న అట్ల పెనంపై కూర్చోబెట్టింది. కదలకుండా ఉండేందుకు ముందుగానే చేతులు, కాళ్లు కట్టేసింది. మంట తట్టుకోలేక ఆకాశ్‌ ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగువారువచ్చి ఆకాశ్‌ను రక్షించారు మరియు ఫిరంగిపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి కార్తీక్ నిర్జీవంగా పడి ఉన్నాడు. కాలిన గాయాలతో ఏడుస్తున్న ఆకాశ్‌ను పోలీసులు వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చిన్నారుల మేనత్త విజయ ఫిర్యాదు మేరకు సవతి తల్లి లక్ష్మి, సాగర్‌పై 103(1), 109(1), 238 read with 3(5) of BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, లక్ష్మీ, సాగర్లను అరెస్టు చేశారు.

చిన్నారులపై అమలవుతున్న అమానుష హింస, మారణకాండ పతనమవుతున్న సమాజానికి సంకేతాలు.

తాము కన్న పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరించే తల్లిదండ్రులను మొదట్లోనే గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఏదైనా విపరీతం జరిగే వరకు ప్రభుత్వం వేచి చూసి, అప్పుడు విచారణ జరిపి, కేసులు నమోదు చేయడం, ప్రాసిక్యూట్ చేయడం మాత్రమే పరిమితమవుతుంది. కుటుంబాలు ప్రశాంతంగా లేకపోతే సమాజంలో శాంతి కరువవుతుంది. వెస్టర్న్ దేశాలలో చైల్డ్ అబ్యూజ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇంట్లో పిల్లల అరుపులు వినిపిస్తే పొరుగింటివారు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. అక్కడ ఏ కొద్దిపాటి హింసాత్మకంగా అయినా ప్రవర్తించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు ఉంటాయి. కానీ భారతీయ సమాజంలో పిల్లల్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కేవలం ప్రేమతోనే దండిస్తారని, అది వారి ఉజ్వల భవిష్యత్తు కోసమేనని బుకాయిస్తుంటారు. నిజానికి నిరంతరం అసంతృప్తి, నిస్పృహతో ఉండే వారు తమ కోపాల్ని చల్లార్చుకోవటానికి పిల్లలను సాఫ్ట్ టార్గెట్స్‌గా చూసుకుంటారు.

ఈ పరిస్థితులు మారాలంటే: మానవీయమైన సంబంధాలు, విధానాలు సమాజంలో, సమాజాన్ని ప్రతిబింబించే కుటుంబాల్లో పెరగాలి. అప్పటివరకు పెద్దల నెత్తుటి దాహానికి పిల్లలు బలి అవుతూనే వుంటారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు