రాజ్యాంగ నిర్మాత Dr. BR Ambedkar జయంతి సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. అంతే కాకుండా ఈరోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది.
తెలంగాణలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ తెలిపారు. SUPREME COURT తీర్పు తరువాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పుకొచ్చారు.
గతేడాది ఆగస్టు 1న SUPREME COURT తీర్పు తరువాత అక్టోబరులో ప్రభుత్వం justice shamim akhtar నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్య ప్రవేశాలు, ఉపాధి సహా పలు అంశాలపై కమిషన్ లోతైన విశ్లేషణ నిర్వహించి 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. బహిరంగ విచారణలు, ప్రజల నుంచి వచ్చిన 4,750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్లో వచ్చిన 8,681 వినతులను కమిషన్ పరిశీలించింది. మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది. ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన కులాలు.. గ్రూప్-2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధిపొందిన కులాలు.. గ్రూప్-3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ తరహా వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య సమన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
దీనికి సంబంధించి ఉపసంఘ సమావేశం ఆదివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్షితిజ్ సహా పలువురు పాల్గొన్నారు.