జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల కిరాతక చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, న్యూజిలాండ్ విదేశాంగ శాఖ మంత్రి విన్‌స్టన్ పీటర్స్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొని అల్బనీస్, బ్రిటన్ ప్రధానమంత్రి కీత్ స్టార్మర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీకి స్వయంగా ఫోన్ చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపం తెలియజేశారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
భారత ప్రజల వెంట ఉంటామని తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతలో అన్ని రకాలుగా సహకరిస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ కష్ట సమయంలో భారత్‌కు అండగా నిలిచినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. హేయమైన ఉగ్ర దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి దృఢ సంకల్పంతో ఉన్నామని మోదీ అన్నారు.