అమెరికా ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే దారుణంగా క్షీణించింది. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో గడిచిన మూడేళ్లలోనే మొదటిసారిగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. బుధవారం అమెరికా వాణిజ్య విభాగం విడుదల చేసిన ముందస్తు గణాంకాల ప్రకారం, అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తొలి త్రైమాసికంలో 0.3 శాతం పడిపోయింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై ప్రకటించిన సుంకాల ప్రభావానికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు పెరిగిన కారణంగా వృద్ధిని దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదివరకు రాయిటర్స్ పోల్లో ఆర్థికవేత్తలు అమెరికా ఆర్థికవ్యవస్థ 0.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా కట్టారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా 0.3 శాతం క్షీణించడం గమనార్హం. మూడేళ్ల తర్వాత వృద్ధి ప్రతికూలంగా నమోదవడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. బుధవారం మిడ్-సెషన్ సమయానికి డౌ జోన్స్ 0.3 శాతం, ఎస్అండ్ 1.4శాతం, నాస్టాక్ 1.01 శాతం పతనమయ్యాయి. అంతకుముందు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రపంచంతో పాటు అమెరికా ప్రజలకు కూడా చేటు చేస్తుందని, ఆర్థికవ్యవస్థ పెద్ద నష్టాన్ని ఎదుర్కొనక తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఈ పరిణామాల కారణంగా 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికా జీడీపీ కుంచించుకుపోతుందని, టారిఫ్ నిర్ణయాల వల్ల వృద్ధి ప్రతికూలంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.