ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. గత 17రోజులుగా బలగాల ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ పేరుతో.. 90 కిలోమీటర్ల విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈ మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన 200 మందుపాతరలను బలగాలు ఇప్పటి వరకు నిర్వీర్యం చేశారు. తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, చర్ల ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకొని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మందుపాతరలను బలగాలు గుర్తించి.. తొలగించాయి. ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్టలో దాదాపు 24వేల మంది భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు రెండు ఎన్‌కౌంటర్‌లో 25 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు జవాన్లు గాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.