‘23’ – వ్యవస్థపై ఓ ప్రశ్న
తెలుగు సినిమా అసహజత్వానికి, అబద్ధాలకు నిలయం. ప్రేక్షకుల్ని వినోదపరిచే పేరుతో సమాజం మొత్తం మీద సాంస్కృతిక విషాన్ని వెదజల్లుతుంటాయి తెలుగు వాణిజ్య సినిమాలు. హాస్యం, శృంగారం వంటి మానవీయ భావోద్వేగాలన్నీ తెలుగు సినిమాల్లో భరింపరాని అసభ్య ఆకృతిని తీసుకుంటాయి. కేవలం వసూళ్లే లక్ష్యంగా, ప్రాతిపదికగా నెత్తుర్లు పారించే భయంకరమైన హీరోయిజం తెలుగు తెరని పట్టి పీడిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో మలయాళం, తమిళం, ఇంకా ఇతర భాషల సినిమాల మీద ఆధారపడాల్సి వస్తున్నది.
జరిగిన సంఘటనల్ని సబ్జెక్టులుగా తీసుకొని సినిమాలుగా తీస్తే గొప్ప కళాఖండాలు తీయగల ఘటనలు తెలుగు నేల మీద ఎన్నో జరిగాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉద్యమాలు పుట్టి, నడిచిన గడ్డ ఇది. ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ‘మాభూమి ‘ అలాంటి సినిమా కాగా, మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ‘అంకురం’ కూడా కొంతమేరకు చెప్పుకోదగ్గ రియలిస్టిక్ సినిమాగానే చెప్పుకోవచ్చు. తీయాలనుకుంటే ఎన్నో వందల ఎన్ కౌంటర్లు, మిస్సింగ్ కేసుల్ని గొప్ప సినిమాలుగా తీయొచ్చు. కారంచేడు, చుండూరు, నీరుకొండ, లక్షింపేట వంటి కుల హత్య ఘటనలు ఎన్నో వున్నాయి. కానీ అవేవీ సినిమాలుగా రావు. అదే కేరళలో ఐతే ఒక్క రాజన్ ఎన్ కౌంటర్ మీదనే కొన్ని సినిమాలు వచ్చాయి.
రియలిస్టిక్ సినిమా అనేది తెలుగు ప్రేక్షకులకి తీరని ఆశ అని ఫిక్సై పోయిన వర్తమానంలో వచ్చిన సినిమా ’23’. ఇంతకీ ఏమిటీ ’23’? 23 కేవలం ఒక సంఖ్య కాదు. అది వాస్తవంగా జరిగిన ఒక మారణ సంఘటనలో పోయిన 23 అమాయక ప్రాణాలు. ఒక బస్సులో కొన్ని క్షణాల వ్యవధిలో 23 మంది ఘోరంగా కాలిపోయి బూడిదైన ఘటన అది. అదే చిలకలూరిపేట బస్సు దహనం కేసుగా ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటన 1993లో జరిగింది.
బస్సు దోపిడీ చేద్దామనే ప్రణాళికలో భాగంగా ఓ ఇద్దరు దళిత యువకులు బస్సులో పెట్రోలు పోసి ప్రయాణీకుల్ని బెదిరించి డబ్బులు గుంజుకుందామనుకుంటారు. కానీ ప్రయాణీకులు తిరగబడటంతో ఇద్దరిలో ఒకడు అగ్గిపుల్ల వెలిగించి బెదిరిస్తాడు. ఆ గాభరాలో ఏం జరిగిందో కానీ బస్సులో మంటలు చెలరేగుతాయి. తప్పించుకోలేని 23మంది ప్రయాణీకులు సజీవంగా దహనమైపోయారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన.
’23’ సినిమా ఆ ఇద్దరు యువకుల కోణం నుండి తీయబడింది. అంటే ఒక కారణం వుండి ఆ బస్సుని తగలబెట్టారని కాదు. వారికీ ఓ నిజాయితీ నేపథ్యం వుంది. ఆ ఇద్దరికీ అప్పటివరకు నేర చరిత్ర లేదు. ఇద్దరిలో ఒకడు కొద్దో గొప్పో చదువుకున్నవాడు. పుస్తక పఠనాభిలాష వుంది. ఎంతో కొంత కవిత్వం వాసనలు కూడా వుంటాయి అతనిలో. రెండోవాడు పోలీసులు ఇచ్చే డబ్బుల కోసం కోర్టుల్లో దొంగ సాక్ష్యాలు చెబుతుంటాడు. ఇంతకు మించి వారికి ఎలాంటి నేర చరిత్ర లేదు. పీకల దాకా చుట్టుకున్న ఆర్ధిక ఇబ్బందులు, భౌతిక పరిస్థితుల వత్తిడిలో ఏదో దోపిడీ చేస్తే డబ్బులు వస్తాయనుకుంటారు. బస్సులో వున్న ప్రయాణీకుల నుండి డబ్బులు దోచుకోవాలన్న యావ తప్ప వారిని హింసించి లేదా చంపే ఉద్దేశ్యం వారికి లేదు. వాళ్లు నేరస్తులే కానీ హంతకులు కారు. వాళ్లకీ మానవ సహజ భావోద్వేగాలైన ప్రేమ, స్నేహం, బాధ, కోపం, పశ్చాత్తాపంతో కుమిలిపోవడం వంటివి వుంటాయి. వీటన్నింటికీ మించి వారిని నేరాల వైపుకు పురికొల్పిన సంఘ నిర్మాణం, సామాజిక పరిస్థితులుంటాయి. ఈ కోణం నుండి తీసిన సినిమానే ఇది.
“నా జీవితంలో నేను చూసిన మూడు హత్యాకాండలు – 1991 చుండూరు మారణహోమం, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జుబిలీ హిల్స్ బాంబు పేలుడు. హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలా ముగిసిందా?” అనే వ్యాఖ్యానంతో సినిమా మొదలవుతుంది. (బహుశా ఆ వ్యాఖ్య దర్శకుడిదే అయుండొచ్చు)
మరి ఎందుకో 1985లో జరిగిన కారంచేడు కుల హత్యాకాండని వదిలేశారు
చుండూరు మారణహోమాన్ని వివరంగా చూపారు. జుబిలీ హిల్స్ కార్ బాంబు బ్లాస్ట్ ఉదంతం కూడా ప్రస్తావిస్తారు. ఈ మూడు కేసుల్లో హంతకులేమయ్యారు? చుండూరు మారణకాండలో హంతకులు నిర్దోషులుగా విడుదలయ్యారు. జుబిలీ హిల్స్ బాంబ్ కేసులో ప్రధాన ముద్దాయి మద్దిలచెరువు సూరి కూడా బైటకి వచ్చేశాడు. (తరువాత హత్యకు గురయ్యాడు. అది వేరే సంగతి) కానీ చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులైన చలపతి, విజయవర్ధన్ రావులు మాత్రం ఉరికొయ్యల దాకా వెళ్లి, వెనక్కొచ్చి గత 32 సంవత్సరాల నుండి జైలు శిక్ష అనుభవిస్తూనే వున్నారు. వారి ఉద్రేకాల యవ్వనం, శక్తియుక్తుల నడిమి వయసు మొత్తం జైల్లోనే గడవగా ప్రస్తుతం వృద్ధాప్యం కూడా జైల్లోనే కడతేరిపోయేలా వుంది. ఒక వ్యక్తి జీవితం మొత్తం జైల్లోనే గడపాలనడం శిక్ష కాదు, క్రూరత్వం. శిక్ష రూపంలో నేరస్తుల్ని సంస్కరించే రాజ్యానికి క్రూరత్వం వుండటం సమాజ ఆరోగ్యానికి మంచిది కాదు.
చుండూరు హత్యాకాండ సందర్భంగా ఎనిమిదిమంది నరకబడగా, దానికి అనుబంధంగా జరిగిన హింసలో మరో ఇద్దరు చనిపోయారు. జుబిలీ హిల్స్ బాంబ్ పేలుడు కేసులో 26మంది చంపబడ్డారు. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో 23మంది దగ్దమయ్యారు.
మిగతా రెండు సందర్భాల్లో హంతకులు బైటికొచ్చినప్పుడు ఒక్క బస్సు దహనం కేసులో మాత్రమే నేరస్తులు శిక్షను అనుభవించేలా చేసిన పరిస్థితిలేమిటి? కారణాలు ప్రత్యక్షంగా కనబడేవే.
వారు రాజకీయంగా పలుకుబడిగలవారు కాదు. ఆర్ధికంగా సంపన్నులు కాదు. సానుభూతి పొందడానికి అగ్రవర్ణస్తులు కాదు. శాసనానికి వివక్ష వున్నా లేకున్నా శాసనాన్ని అమలుచేసే రాజ్య విభాగాలకు మాత్రం వివక్ష కచ్చితంగా వుంటుంది. అది గణాంకాల్లోకి వెళితే నిరూపితమవుతుంది.
ఐతే ఈ సినిమా ఇంతకు మించి మనకు చూపిస్తుంది. అదేమిటంటే శిక్ష అంటే హింస కాదని, శిక్ష అంటే నేరస్తుల్లో మార్పు తేవడమని! తప్పు చేసినవారు పరివర్తనకి గురైనప్పుడు వారి పట్ల మనకి సానుభూతి కలుగుతుంది. ఈ సినిమా కూడా అదే ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. సినిమా అంతా చూశాక ఇరవై ముగ్గురి మరణానికి కారణమైన వారిద్దరి పట్ల సానుభూతి కలుగుతుంది. ఇలా తీయడం కచ్చితంగా కత్తి మీద సాము వంటిదే. ఆ సాములో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రెండున్నర గంటల సినిమాలో దర్శకుడు భారతీయ సమాజానికి సంబంధించి అనేక విషయాల్ని దృశ్యమానం చేయడం ద్వారా చర్చకి పెడతాడు. కులం, సాంఘిక వివక్ష, కులానికి ఆర్ధిక స్థాయికి వున్న సంబంధం, నేరం, నేరస్తులు, నేరాల వైపు నెట్టే వాతావరణం, రాజకీయ పరపతి వున్న వారికి నేరాలతో వున్న నెక్సస్, న్యాయ వ్యవస్థ, చట్టాలు, జైళ్లు, శిక్షలు, నేరస్తుల్లో పరివర్తన…ఇలా ఎన్నో అంశాలు చర్చకి వస్తాయి. ఈ అన్ని అంశాలనూ సంలీనం చేసుకుంటూనే కథ నడుస్తుంటుంది.
భరద్వాజ రంగావఝల అందించిన స్టోరీ లైన్ ని దర్శకుడు సజీవంగా అభివృద్ధి చేయగా ఇండస్ మార్టిన్ శక్తిమంతమైన సంభాషణల్తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. ప్రేమ, శృంగారం, స్నేహం, హాస్యం, ఆగ్రహం, బీభత్సం, నిస్పృహ…ఇలా అన్ని సందర్భాలకు తగ్గ మూడ్ ని క్రియేట్ చేసే డైలాగ్స్ రాశారాయన. ఈ సినిమాలో డైరెక్షన్ తరువాత మనం క్రెడిట్ ఇవ్వాల్సిన క్రాఫ్ట్ డైలాగ్ రైటింగే. బిజిఎం, పాటలు, ఫోటోగ్రఫీ కూడా బాగున్నాయి.
ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడు, నటి తమ రోల్స్ ని అర్ధం చేసుకొనే నటించారు. దర్శకుడు రాజ్ ఆర్ ఏ పాత్రనీ వృధాగా ప్రవేశపెట్టలేదు. సాగర్, దాసులుగా చేసిన ఇద్దరూ జీవించారని చెప్పాలి. ముఖ్యంగా దాసు పాత్రని చేసినతనికి ఎక్కువ మార్కులు వేస్తాను. చాలా కాలం తరువాత ఓ సాధారణ యువతి తెలుగు తెర మీద కనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా సహజంగా చేసింది. ఝాన్సీ, తాగుబోతు రమేష్ కి గుర్తుండిపోయే పాత్రలు దొరికాయి.
ఈ సినిమా చూస్తే మీరు ఆ ఇద్దరు యువకుల పట్ల సానుభూతితో తలవంచాల్సి వస్తుంది. మనుషుల్ని శిక్షించడమే శిక్ష కాదు. మార్పు తేవడమే అసలైన శిక్ష! ఇలాంటి సినిమాలే మన సమాజాన్ని ప్రశ్నించే బలమైన అస్త్రాలు.గుండె కింద తడి వున్న అందరినీ తట్టగల సినిమా ’23’. ఈ సినిమా మేకర్స్ కి అభినందనలు.
చివరగా…
‘23’ ఒక సినిమా కాదు – ఒక ప్రశ్న.
శిక్షలూ, శిక్షణలూ సమన్వయించాలి, ద్వేషంతో కాదు. దయతో చూడాలి.తప్పకుండా చూడాల్సిన సినిమా – ఆలోచించేవారికి, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి.
-Author Aranya Krishna