నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆడపులుల సంఖ్య మగపులుల కంటే ఎక్కువగా ఉంది. 2024-25 ఫేజ్-IV పర్యవేక్షణ ఫలితాల ప్రకారం, ఈ రిజర్వ్‌లో మొత్తం 36 పులులు ఉన్నాయి, వీటిలో 20 ఆడపులులు, 13 మగపులులు, మిగిలినవి పిల్లలు లేదా లింగం గుర్తించబడనివి.
గత సంవత్సరం (2023-24)తో (33 పులులు) పోలిస్తే, ఈ ఏడాది పులుల సంఖ్యలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఆడపులుల సంఖ్య (20) మగపులుల (13) కంటే ఎక్కువగా ఉండటం వల్ల జనాభా స్థిరత్వం, పునరుత్పత్తి విజయానికి సానుకూల సూచనగా భావిస్తున్నారు. ఈ విజయం రక్షణ కార్యక్రమాలు, వేట నియంత్రణ మరియు స్థానిక సమాజాల సహకారం వల్ల సాధ్యమైంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని 10 ఫారెస్ట్ రేజ్ లను నాలుగు భాగాలుగా విభజించి డేటా సేకరించారు. పులుల్ని గుర్తించేందుకు నల్లమల అడవుల్లో 1594 కెమెరా ట్రాపులను బిగించారు. 2024 డిసెంబర్ 20 నుంచి 2025 మే 15 వరకు పులుల గణన సాగింది. ప్రతి 2 చదరపు కిలోమీటర్ల అడవిని ఓ గ్రిడ్ గా విభజించారు. 797 గ్రిడ్ ప్రాంతాల్లో పులి అడుగు ముద్రలు, మలమూత్రం, ఇతర ఆధారాలను సేకరించి విశ్లేషించారు.