అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్ తెలిపింది.
రాష్ట్రంలో TDO కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు CEOను, వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, ఐటీశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.
అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున, వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు AP స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, CEO ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్లోడ్ చేయాల్సిన బిల్స్ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే, ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి.