అమరావతి: హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజ నిర్వహించారు.
బాలకృష్ణ మాట్లాడుతూ, 2019లో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగినప్పటికీ, అప్పటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనులు పునఃప్రారంభించామన్నారు. ఈ ఆసుపత్రి లాభాపేక్ష లేకుండా, దాతల సహకారంతో నడుస్తుందని, రోగులకు అందించే సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు లభించాయని చెప్పారు. తన తల్లి బసవతారకం కోరిక మేరకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, మొదటి దశలో రూ.750 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.
రెండు దశల్లో నిర్మాణం
21 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్యాన్సర్ కేర్ క్యాంపస్‌లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన, రోగుల సంరక్షణ కోసం ఎక్స్‌లెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. తొలి దశలో 500 పడకలతో విస్తృత ఆంకాలజీ సేవలు, రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూర్చి, 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభిస్తారు. రెండో దశలో పడకల సంఖ్యను 1000కి పెంచి, ప్రత్యేక విభాగాలు, పరిశోధన కేంద్రాలు, క్లిష్ట క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా తీర్చిదిద్దుతారు.


