ఓ ప్రయాణికుడి ప్రాణం కాపాడటం కోసం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఏకంగా కిలోమీటరున్నర దూరం వెనక్కి ప్రయాణించింది. రైల్వే సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించి చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటున్నా, చివరికి ఆ వ్యక్తి ప్రాణాలు దక్కకపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన కమలకంటి హరిబాబు (35) మరికొంతమంది స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం యలహంకకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం వీరంతా గుంటూరులో కొండవీడు ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు ప్రకాశం జిల్లాలోని గజ్జలకొండ స్టేషన్ దాటిన తర్వాత హరిబాబు భోజనం ముగించుకుని చేతులు కడుక్కునేందుకు వాష్‌బేసిన్ వద్దకు వెళ్లాడు. అనంతరం డోర్ దగ్గర నిల్చున్న సమయంలో రైలుకు బలమైన కుదుపు రావడంతో అదుపుతప్పి కిందపడిపోయారు.
ఈ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై హరిబాబు స్నేహితులకు సమాచారం అందించి వెంటనే చైన్‌ను లాగారు. దీంతో రైలు ఆగింది. అప్పటికే రైలు దాదాపు 1.5 కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న లోకో పైలట్లు ఉన్నతాధికారులతో మాట్లాడి, గుంటూరు రైల్వే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అనంతరం రైలును వెనక్కి నడిపి, పట్టాల పక్కన గాయాలతో పడి ఉన్న హరిబాబును గుర్తించారు.
వెంటనే అతడిని రైలులోకి ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, వైద్యులు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి హరిబాబు కన్నుమూశాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.