విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ముడిపదార్థాల కొరత కారణంగా ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపలేకపోతున్నారు. మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నే్‌సల ద్వారా రోజుకు 21 వేల టన్నుల హాట్ మెటల్ (లిక్విడ్ స్టీల్) ఉత్పత్తి చేయాల్సి ఉంది. గత నాలుగు రోజుల నుంచి ఇది తగ్గుతూ మంగళవారం నాటికి 10,180 టన్నులకు పడిపోయింది. అంటే సగానికి సగం ఉత్పత్తి తగ్గింది. రెండో బ్లాస్ట్ ఫర్నే్‌సలో ఉత్పత్తి మంగళవారం పూర్తిగా నిలిచిపోయింది. ముడిపదార్థాల కొరత కారణంగా బ్లాస్ట్ ఫర్నే్‌స-3ని చాలాకాలం మూసేశారు. నిధులు అందుబాటులో లేకపోవడంతో ముడిసరుకు సమకూర్చుకోలేకపోయారు.
కేంద్రం ఇచ్చిన రూ.11,440 కోట్లు, రాష్ట్రం అందించిన రూ.2,600 కోట్ల సాయంతో బ్యాంకుల రుణాలన్నీ తీర్చి, మళ్లీ క్రెడిట్ లెటర్లు తీసుకొని యాజమాన్యం ముడి సరుకు సమకూర్చుకుంది. వర్షాకాలం తరువాత బ్లాస్ట్ ఫర్నే్‌స-3ను పునఃప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుత ఇన్‌చార్జి సీఎండీ సక్సేనా ఎవరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా జూన్ 27నే పునఃప్రారంభించేశారు. ఆ ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారానే రోజుకు 9వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటివరకు స్టీల్ తయారీకి అవసరమైన సింటర్, కోక్‌ను ప్లాంటు స్వయంగా తయారు చేసుకునేది. దానివల్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేది. ప్రస్తుత యాజమాన్యం కమీషన్లకు ఆశపడి సింటర్‌కు బదులు నేరుగా పెల్లెట్లను వినిగియోగిస్తోంది. ఇందుకోసం లక్షల టన్నుల్లో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అదేవిధంగా కోక్ తయారీకి కోక్ ఓవెన్లు ఉండగా బయటనుంచి కొనడం ప్రారంభించింది. ఇది కూడా అదనపు భారంగా మారింది.
ప్లాంటుకు అవసరమైన ముడి పదార్థాలను నిల్వ చేసి, అక్కడి నుంచి వివిధ విభాగాలకు కన్వేయర్ల ద్వారా సరఫరా చేసేందుకు రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) ఉంది. ఈ కన్వేయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కన్వేయర్లు మొరాయించాయి. మరోవైపు ముడి పదార్థాల సరఫరా తగ్గిపోవడంతో ఉత్పత్తి పడిపోతూ వచ్చింది. మంగళవారం నాటికి బ్లాస్ట్ ఫర్నేస్-2 జీరో స్థాయికి పడిపోవడంతో దానిని మూసేశారు. ఈ విషయం తెలియడంతో సీఎండీ సక్సేనా మంగళవారం సాయంత్రం ఆర్‌ఎంహెచ్‌పీని తనిఖీ చేశారు. ఎలక్ర్టికల్, మెయింటెనెన్స్, ఆపరేషన్ విభాగాల అధిపతులను సస్పెండ్ చేశారు. బ్లాస్ట్ ఫర్నేస్-3 పునఃప్రారంభానికి ముందునుంచి అన్ని విభాగాల్లో నిర్వహణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని ఉద్యోగ, కార్మిక వర్గాలు సూచిస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరించింది.
కాంట్రాక్టు వర్కర్లు ఎక్కువమంది ఉన్నారంటూ ఈ ఏడాది మే నెలలో 4,500 మందిని తొలగించింది. వారి స్థానంలో ఎటువంటి అనుభవం లేని ఒడిశా, జార్ఖండ్ వర్కర్లను తీసుకువచ్చి వారితో పనులు చేయిస్తోంది. దాంతో అనేక విభాగాల్లో నిర్వహణ సమస్యలొస్తున్నాయి. గత 3నెలల్లో మొత్తం 6వేల మందిని తీసేశారు. మిగిలిన ఉద్యోగులు, కార్మికులతో రోజుకు 12గంటలు పనిచేయిస్తున్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. 330 శాతం జీతాలు బకాయి పెట్టారు. ఈ క్రమంలో యాజమాన్యానికి, ఉద్యోగ వర్గాల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది ప్లాంటు పనితీరుపై ప్రభావం చూపిస్తోంది.