AP లో ఫారెస్ట్ అకాడమి (AP Forest Academy) ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు (Divan Cheruvu) సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అటవీశాఖ ఉద్యోగులకు అటవీ, వన్యప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండేందుకు అటవీ సమీపంలో ఉన్న దివాన్ చెరువు ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. అయితే రక్షిత అటవీ ప్రాంతాన్ని వినియోగించుకొనే విషయంలో కేంద్రపర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా.. తాజాగా మంగళవారం ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో అకాడమీ ఏర్పాటుకు ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అకాడమీ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుతో కలిసి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అనుమతి కోసం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.