ఏపీలో రెండు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అమరావతి, శ్రీకాకుళంలలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను మొదలు పెట్టింది. వీటికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (TESR) రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. ఆన్లైన్ టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 24న సాంకేతిక బిడ్లు, 27న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనల్లో పేర్కొంది.
పర్యావరణ, సామాజికప్రభావ అధ్యయనాలు నిర్వహించాలని సూచించింది. విమానాశ్రయం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది, ఎన్ని దశల్లో చేపట్టాలి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, జాయింట్ వెంచర్ వంటి విధానాల్లో దేన్ని అనుసరించాలి వంటి తదితర ప్రతిపాదనలతో పాటు, ఎంత ఆదాయం వస్తుంది వంటి అంచనాల్ని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. విమానాశ్రయాలకు సంబంధించి రాబోయే 35 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాన్సెప్ట్ మాస్టర్హాన్ రూపొందించాలని, రన్వేలు, ట్యాక్సీవేలు ఎన్ని ఉండాలి, అవి ఎంత పొడవు ఉండాలి, ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్లు ఎన్ని అవసరం, ఎలాంటి విమానాలు నిలిపేందుకు ఏ తరహా స్టాండ్లు ఉండాలి, ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లు ఎలా ఉండాలి వంటి అంశాలన్నీ మాస్టర్లోన్లో ఉండాలని తెలిపింది. విమానాశ్రయాలకు ఇతరత్రా మార్గాల్లో ఆదాయం వచ్చేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఎంత భూమి అవసరం? తదితర సమస్త సమాచారాన్నీ కన్సల్టెన్సీ సంస్థలు తమ నివేదికల్లో పొందుపరచాలని ఏపీఏడీసీ పేర్కొంది.