గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ నటి నస్రత్ ఫరియాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఢాకా నుంచి థాయిలాండ్ కు వెళ్తుండగా.. షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు! ఈ సందర్భంగా స్పందించిన ఢాకా ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ యూనిట్ వర్గాలు… హసీనా దేశాన్ని వదిలి పారిపోయిన సమయంలో జరిగిన అల్లర్లలో ఆమెపై హత్యాయత్నం కేసు నమోదయ్యిందని, అందులో భాగంగానే అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారని తెలిపాయి.
ప్రస్తుతం ఆమెను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందించిన “ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్” సినిమాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్రను నుస్రత్ ఫరియా పోషించారు. 2023లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించింది.