నేను ప్రేమిస్తాను. ప్రేమించడమంటే నిరసన తెలుపడమే. కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడమంటే ధిక్కారం ప్రకటించడమే. నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం మన దినచర్యలో భాగమైతే, మనం దీర్ఘకాలిక పోరాటంలో భాగమై ఉన్నామని అర్ధం. “Performance is Power” అంటాడు Upton Sinclair అనే American dramatist. మన చేతులను కాళ్ళను పెదాలను కదలాడిస్తూ చేసే నాట్యమైనా, నాటకమైనా, పాటలు పాడటమైనా, రాత రాయడమైనా ఒక performance. ఈ సృజన మొత్తం కాగితంపైకో నేలపైకో రాకముందు ఇవన్నీ మన ఊహల్లో జరుగుతాయి. అంటే imagination is also a performance. ఊహించడం, జ్ఞాపకం చేసుకోవడం అనేవి మనిషి లోలోపల జరిగే performances. మనిషి నిరంతరం మోసే ఆయుధాలవి. అందుకే, “ఊహ చేయడమే హెచ్చరిక” అన్నాను.
ఊహ చేయడం ఎంత ధిక్కారమైనదో ఊపిరి పీల్చడం కూడా అంతే ధిక్కారమైనది. ప్రస్తుత కాలంలో, జైలులో ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు బెడ్ షీట్ లేకుండా చేయడం, అతని బాత్రూం గదిలో cc కెమెరా పెట్టడం. మంచి నీళ్ళు కూడా తాగనివ్వకుండా స్టాన్ స్వామిని చంపడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. అయితే “చావును నిరాకరిస్తున్నాను” అని ఎంతో కవితాత్మకంగా ధిక్కారం ప్రకటించాడు సాయిబాబా. ఇప్పుడు మనమంతా చేయవలసింది కూడా అదే.
“నీ ఊపిరిలో అమ్మలుంటారు
నీ ఊపిరిలో నిప్పులుంటాయి
నీ ఊపిరిలో ధిక్కార కవితలుంటాయి”
ఒక పోరాట మహిళ శ్వాసకు ప్రమాదం వచ్చినప్పుడు, ఊపిరి ఉండలను మోసుకుంటూ త్వరగా రమ్మని ఉత్తరం రాసాను.
“నవ్వులంటే
పూసిన పువ్వులన్నీ కలిసి
ధిక్కారంతో చేసే నాట్యాలు.
నవ్వులంటే
నియంతలను అంతం చేయడానికి
నోరు తెరిచిన సముద్రాలు.”
ఆఫ్గనిస్తాన్ లో ఒక హాస్యకారుడు ఉరి తీయబడ్డప్పుడు కూడా ‘నవ్వటం ధిక్కార సంకేతమవుతున్న వేళ’ అని కవిత రాసాను. బెల్లాల పద్మ అరెస్టయినప్పుడు కూడా ‘దిక్కులూ మొక్కలూ నా ఆయుధాలు; చిరునవ్వుల పసిపువ్వులు నా ఆయుధాలు’ అన్నాను.
నేను పైన చెప్పినట్టుగా ఊహ చేయడం, జ్ఞాపకం చేసుకోవడం, ఊపిరి పీల్చడం, నవ్వటం, ఇవన్నీ మానవులు నిత్యం మోస్తున్న ఆయుధాలు. వీటితో పాటు నేనింకో మాట కూడా అన్నాను. చంద్రుణ్ణి పట్టడమే ఉత్సవమని.
“ఏ కాలానికైనా
కొడవలి మాత్రమే చంద్రుడు.
చంద్రుడంటే
అర్ధ చంద్రాకారపు ఆయుధం!”
*
ఎన్నో రోజుల నుంచి నేను రాయాలనుకొని రాయలేకపోతున్న కవిత్వం ఎదురుచూపుల గురించి. ప్రియుడు ప్రియురాలు కోసం చూసే ఎదురుచూపులు గావొచ్చు, తప్పిపోయిన బిడ్డల కోసం తల్లులు చూసే ఎదురుచూపులు గావొచ్చు, ఇంకా ఇల్లు చేరుకోని పసిపిల్లల శవాల కోసమో, సహచరుల శవాల కోసమో ఏండ్ల తరబడి చూసే ఎదురుచూపులు గావొచ్చు, ఇప్పటిదాకా నాలో ఇన్ని ఎదురుచూపుల గురించి ఓచోట మోయడమే తప్ప ఓచోట రాయడం సాధ్యపడలేదు.
శ్రీశ్రీ లాగ ‘నేను నక్సలైటుని’ అనో, గిరీష్ కర్నార్డ్ లాగ ‘నేను కూడా అర్బన్ నక్సల్నే’ అనో మెడలో బోర్డు వేసుకొని నిలబడలేదుగాని, నా చుట్టూ జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో నా వంతు ధిక్కారాన్ని ప్రకటిస్తూనే వున్నాను. నా అక్షరాలు, నా నినాదాల శబ్దం, నా పిడికిలి, ఎప్పటికీ జనంతోనే. ఎప్పటికీ జీవంగానే.
“నీ కవిత్వమే నువ్విచ్చే స్టేట్మెంట్” అంటాడు కాళోజీ. రాసిన అక్షరాలకు నిలబడటం అనేది ఎంత ఘర్షణతో కూడుకున్నదో అంతే అందమైనది కూడా. వరవరరావు తన జైలు డైరీలో చెప్పినట్టుగా “రాజకీయఖైదీలకు నిరీక్షణ తెలిసినంతగా నిరాశ తెలియదు.” నిరీక్షణ ఎంతో దుర్భరమైనప్పటికీ నిరాశను దగ్గరకు రానివ్వరు. “నేడీ జైలులో వున్న ఖైదీల హృదయాలే నా పొలాలు; నిరంతర కవితా వ్యవసాయం నా ధ్యేయం” అని రాసిన చెరబండరాజు. “దేశద్రోహం చేసినా పరవాలేదుగాని ప్రజాద్రోహం చేయకూడదు” అని చెప్పిన వరవరరావు. వీళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషన్.
ఇదే సంవత్సరం జూలై రెండు నాడు, అంటే చెరబండరాజు 41వ వర్ధంతి నాడు “చెర స్ఫూర్తితో రెండవ కవిత్వ పుస్తకం. త్వరలో..” అని ప్రకటించాను. ఆరోజే అంకుశాపురంలో చెర విగ్రహావిష్కరణ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాలు స్తూపాలు విప్లవ పాటలు పాడుతాయని, ఒక ప్రజాకవి విగ్రహ రూపంలో ఆగ్రహాన్ని ప్రకటిస్తాడని, చెర చనిపోయి నలబై ఏండ్లు గడిచినా కూడా యింకా ప్రభుత్వాలు భయపడుతూనే వున్నాయి. చెరబండరాజు ఒక శాశ్వత ప్రజాకవి. అలాంటి ప్రజాకవులను ప్రేమిస్తూనే వుంటానని, ఇలాంటి ధిక్కార కవితలు ఇంకెన్నో రాస్తూనే వుంటానని తెలియజేస్తున్నాను.
“ప్రపంచం రేపటికి ముగిసినా సరే
ఇవాళ మా విత్తనాలు నాటుతూనే వుంటాం.”
నేను చెరబండరాజు కవిత్వంతో జీవితంతో నిత్యం ప్రయాణిస్తున్నానంటే, “అగ్నిని ఆవాహన చేసుకోండి” అని బెంగాలి కవి బీరేంద్ర చటోఫాధ్యాయ రాసిన వాక్యానికి ఆచరణ రూపమిది. ఇది యుద్దకాలము కాదని, యుద్ధంలో నేనేమీ లేనని అమాయకమైన ఆలోచనలు నాకు లేవు. వాక్యం రాయడమంటే దాడికి ప్రతిదాడి. కవిత్వమంటే సృజనాత్మక ప్రతిఘటన. నా వాక్యం తేనెరుచి లాంటిది కాదు. ప్రభుత్వాలు ఆహ్వానించదగ్గ స్థాయిది కాదు. బహు ప్రమాదకరమైనది. మత రాజ్యాలకు, నియంత పాలనకు బహుముఖాల్లో ప్రమాదకరమైనది.
“నా వాక్యం
నేలకు రాకబడ్డ మానవుడి పొట్టపేగులాంటిది.
తెగిపడ్డ ఆదివాసీ స్తన్యం పైన
వెలుగుతున్న దీపకాంతి లాంటిది.”
నొప్పితో కూడిన అరుపు కళాత్మకమైనది మరియు విప్లవాత్మకమైనది. ఈ పుస్తకమే ఒక అరుపు. గాఢమైన నొప్పితో కూడిన అరుపు. నిప్పుల మెరుపు! అలల గాండ్రింపు!!
-దొంతం చరణ్