Wednesday, 3 September 2025

ఓ ప్యారసైట్.. ఓ జీవధార…

ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేసారు. రాయాల్సిందంతా రాసేసారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు ‘జీవధార’ గుర్తొచ్చింది. ఎక్కడిదీ మాట? ఏంటసలా జీవధార?

కాళీపట్నం రామారావు గారు 1971లో రాసిన కథ. చిన్న కథ. కొండంత అర్థాన్ని నింపుకున్న కథ. పేదవాళ్ల పాకలన్నీ ఓ చోట చేరిన వాడ. అక్కడ అందరూ బడుగు జీవులే! ఎర్రటి ఎండలకాలం. ధారాపాతంగా చెమటలు చిందే కాలం. గొంతెండిపోతోంది. నీళ్లు కావాలి. అనుకోగానే వస్తాయా? నానా అవస్థలు పడాలి. పబ్లిక్ నల్లాలో వచ్చేవి ఏమూలకీ చాలవు. కడవల మీద కడవలు నిండాలంటే గంగమ్మ ఉప్పొంగాలి. అది అయ్యే పనేనా? ఉన్నంత మేర పోట్లాడి, కాట్లాడి పట్టుకుంటారు. అయిపోయాక??

అక్కడికి ఫర్లాంగు దూరంలో ఓ బడాబాబుల బంగ్లా ఉంది. అందులో విశాలమైన తోట. మొక్కలు తడిపేందుకు నీళ్లు కావాలి గదా! అందుకోసం ఓ కుళాయి పెట్టించుకున్నారు. వాడినంత వాడతారు. తర్వాత అలా వదిలేస్తారు. అందులో ఓ రెండు బిందెల నీటి కోసం ముగ్గురాడాళ్లు ఆ ఇంటి గేటు తట్టి వేడుకున్నారు. ‘నీళ్లు లేవు’ అన్న సమాధానం వచ్చింది. లేకపోతే ఎలా? ఏం చేసేది? మరో చోటికి వెళ్లడం ఇబ్బంది. అయినా లేకపోవడం కాదు. ఇవ్వరు. అదీ అసలు సంగతి. వాడకట్టు ఆడవాళ్లకి అది తెలుసు. అందుకే బతిమాలుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బంగ్లా వాళ్లు పట్టు వీడటం లేదు. మరీ గోల చేస్తే కుక్కల్ని వదులుతాం అంటున్నారు.

వీళ్లకి ఆవేశం హెచ్చింది. గలాటా మొదలైంది. అటు బంగ్లా వాళ్లకి భయం కలిగింది. అయినా బయట పడలేదు. కొన్ని మాటలు నడిచాక ఎవరో కాస్త పెద్దరికం తీసుకున్నారు. సంధి కుదిరింది. ‘సరే! ఈ వేళ్టికి పట్టుకుపోండి. మళ్లీ రాకండి’ అని ఖరాఖండిగా చెప్పారు ఇంటి యజమానులు. వాడంతా కదిలింది. మూడు బిందెలు కాస్తా అందరి బిందెలూ నింపాయి. తర్వాత? మరుసటి రోజు మళ్ళీ దాహం వేస్తుంది. జీవధార కావాలి. బంగ్లా గేటు ఎదుట నిలవాలి. బతిమాలో.. భయపెట్టో నీళ్లు సాధించాలి‌. దప్పిక ఆర్పుకోవాలి. తప్పదు!

‘జీవధార’లో నీటి కోసం తిప్పలైతే.. ‘ప్యారసైట్’ సినిమాలో బతుకు కోసం తిప్పలు. వస్తువు మారిందంతే! వ్యవస్థ మారలేదు.. మారదు. సంపదంతా కొన్ని ఇళ్లకే పరిమితమైనప్పుడు, ఎక్కువ మందికి చేరనప్పుడు, పేదలు ఇలాగే మారుతారనిపిస్తుంది. ముందు సౌమ్యంగా, తర్వాత ధైర్యంగా, ఆపైన మొండిగా, హద్దు దాటితే క్రూరంగా.. కిరాతకంగా తప్పు ఎవరిది? ఎగుడు దిగుడు వ్యవస్థది. పైకి పాకేవాడు ఇంకా వెళ్తూనే ఉన్నాడు. కిందకి జారేవాడు ఇంకా ఇంకా జారుతూనే ఉన్నాడు.

యాభై ఏళ్ల క్రితం కాళీపట్నం రామారావు ఈ కథ రాశారు. ఇవాళ ప్యారసైట్ సినిమా వచ్చింది. ఏం మారింది? వాడకట్టు వారంతా ఏకమైతే బంగ్లా వాళ్లు తోక ముడవాల్సిందే! డబ్బులేని అధిక సంఖ్యాకుల ముందు వాళ్లు మైనారిటీలే. అది వాళ్లకి తెలుసు. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పబ్బం గడుపుతుంటారు. ఒక్కసారి అలజడి వాళ్ల ఇంటి గేటును తాకితే గుండెలు చిక్కబెట్టుకుంటారు. ఆ తాకడం వ్యక్తులే కానక్కరలేదు. చదువు, జ్ఞానం, సంస్కారం, పట్టుదల లాంటి శక్తులు తాకాలి. అప్పుడు దక్కే విజయం వాడకట్టుదే! సిసలైన నిరుపేదలదే!

~ సాయి వంశి 

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు