కృత్రిమ మేధ (AI) స్టార్టప్ కంపెనీ అయిన పర్ప్లెక్సిటీ, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేసేందుకు 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.02 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ కంపెనీ విలువ సుమారు 18 బిలియన్ డాలర్లు (రూ.1.57 లక్షల కోట్లు) కాగా, ఈ ఆఫర్ దాని సొంత విలువ కంటే దాదాపు రెట్టింపు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మార్కెట్లో గుత్తాధిపత్యం కలిగి ఉండగా, అమెరికా ప్రభుత్వం దానిని విక్రయించాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పర్ప్లెక్సిటీ నుంచి ఈ ఆఫర్ రావడం గమనార్హం.
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, ఈ డీల్‌ను పూర్తి చేసేందుకు బహుళ పెట్టుబడిదారులు ఫైనాన్సింగ్‌కు అంగీకరించారని పర్ప్లెక్సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో తెలిపారు. జులైలో కంపెనీ 100 మిలియన్ డాలర్లు (రూ.875 కోట్లు) సమీకరించింది. పర్ప్లెక్సిటీ క్రోమ్ యొక్క కోర్ ఇంజిన్ అయిన క్రోమియంను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తామని, రెండేళ్లలో 3 బిలియన్ డాలర్లు (రూ.26,000 కోట్లు) పెట్టుబడి పెడతామని, గూగుల్‌ను డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉంచుతామని హామీ ఇచ్చింది.
గూగుల్‌పై యాంటీ-ట్రస్ట్ ఒత్తిడి: గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌ను డిఫాల్ట్‌గా ఉంచేందుకు యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలతో చట్టవిరుద్ధ ఒప్పందాలు చేసుకుందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు గూగుల్ గుత్తాధిపత్య విధానాలను నిర్ధారించింది. అమెరికా ప్రభుత్వం క్రోమ్‌ను విక్రయించాలని, సెర్చ్ డేటాను పోటీదారులకు లైసెన్స్ చేయాలని సూచించింది. గూగుల్ ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు సిద్ధమవుతోంది.
పర్ప్లెక్సిటీ లక్ష్యం: పర్ప్లెక్సిటీ తన AI ఆధారిత సెర్చ్ ఇంజిన్‌తో గూగుల్‌కు పోటీగా నిలుస్తోంది. ‘కామెట్’ అనే AI బ్రౌజర్‌ను ఇప్పటికే ప్రారంభించడంతో పాటు 2026 నాటికి పది కోట్ల నుంచి వందల కోట్ల యూజర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రోమ్ కొనుగోలు ద్వారా దాని AI సామర్థ్యాలను బిలియన్ల మంది వినియోగదారులకు విస్తరించాలని భావిస్తోంది.


